జెండా.. ఎజెండా లేని మహాకూటమి

8 Oct, 2018 01:00 IST|Sakshi
హరీశ్‌రావుకు విరాళాలు అందజేస్తున్న వివిధ సంఘాల ప్రతినిధులు

కూటమిని గెలిపిస్తే మళ్లీ బానిస బతుకే: హరీశ్‌

బంగారు తెలంగాణ నిర్మాణమే టీఆర్‌ఎస్‌ లక్ష్యం

సిద్దిపేట జోన్‌: ‘తెలంగాణ ద్రోహుల పార్టీ టీడీపీ, కోదండరాం పార్టీ టీజేఎస్, సీపీఐలు మహాకూటమిగా వస్తున్నాయ్‌. కూటమికి ఓటేస్తే మన వేలితో మనకంటిని పొడుచుకున్నట్లే. ఏ జెండా.. ఎజెండా లేని అతుకుల బొంత మహాకూటమి. అలాంటి కూటమిని గెలిపిస్తే తెలంగాణ ప్రజలది మళ్లీ బానిస బతుకే. తెలంగాణ ప్రభుత్వం జుట్టు చంద్రబాబునాయుడు చేతుల్లో ఉంటుంది. అప్పుడు మనకు న్యాయం జరుగుతదా? ఇప్పటికే కాళేశ్వరం, సీతా రామ, పాలమూరు ప్రాజెక్టులను ఆపాలని చంద్రబాబు ఢిల్లీకి లేఖలు రాశారు. ఇక కూటమికి అధికారం ఇస్తే బాబు చెప్పుచేతుల్లో ఉండాల్సి వస్తుంది.

ఇది మనకు అవసరమా.. తెలంగాణ మొత్తం బాబు కు గులాంగిరీ చేయాలా?’ అని మహాకూటమిపై మాజీ మంత్రి హరీశ్‌రావు ధ్వజమెత్తారు. ఆదివారం సిద్దిపేట జిల్లా కేంద్రంలో పలు సంఘాలు హరీశ్‌రావుకు సంపూర్ణ మద్దతు ప్రకటిస్తూ ఏకగ్రీవ తీర్మానం, ఆశీర్వాద సభలను ఏర్పాటు చేశారు. హరీశ్‌రావు మాట్లాడుతూ, తెలంగాణ ఏర్పాటు లక్ష్యంగా టీఆర్‌ఎస్‌ పార్టీ ఆవిర్భవించిందని, బంగారు తెలంగాణ లక్ష్యంగా ముందుకు సాగుతున్నామన్నారు. మహా కూటమిని ప్రజలు నమ్మే స్థితిలో లేరన్నారు. కాంగ్రెస్‌ నాయకులు ఢిల్లీ నేతల చేతుల్లో కీలు బొమ్మలుగా ఉంటారని, ఆ పార్టీలో ఎవరు సీఎం అవుతారో ఎవరికీ తెలియదన్నారు.

ఇప్పుడిస్తున్న హమీలను ఎవరు నెరవేస్తారో, ఎవరు బాధ్యత వహిస్తారో కూడా తెలి యని పరిస్థితి ఆ పార్టీలో ఉందన్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని అడ్డుకున్న చంద్రబాబుతో మహాకూటమి జత కట్టిందని, ఇప్పటికే  ఏపీ, తెలంగాణ మధ్య ఉమ్మడి పంపకాల పంచాయితీ కొనసాగుతుందని తెలిపారు. పదేళ్ల వరకు ఉమ్మడి రాష్ట్ర పంచాయితీ ఉంటుందని.. ఇవి పూర్తి కాకుండానే కూటమికి అవకాశం ఇస్తే పరోక్షంగా బాబుకు పెత్తనం ఇచ్చినట్లేనన్నారు. స్వీయ అస్తిత్వం, స్వపరిపాలన కోసం రాష్ట్రాన్ని సాధించుకున్నామని, అలాంటిది బాబు చేతుల్లో రాష్ట్ర ప్రభుత్వం జుట్టు ఉంటే.. మన నీళ్లు, మన వాటా దక్కించుకోగలమా అని ప్రశ్నించారు.  

మళ్లీ కాంగ్రెస్‌ కుట్రలు...
ఇటీవల కాంగ్రెస్‌ నేత కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తాము అధికారంలోకి వస్తే మిర్యాలగూడ మెగా థర్మల్‌ ప్రాజెక్టును నిలిపివేస్తామని ప్రకటన చేయడంలో ఆంతర్యం ఏమిటని హరీశ్‌ ప్రశ్నించారు. తెలంగాణ ప్రజలకు, రైతులకు 24 గంటల పాటు నాణ్యమైన విద్యుత్‌ రావడం వారికి ఇష్టం లేదన్నారు. జానారెడ్డి, ఉత్తమ్‌లు ఎందుకు కోమటిరెడ్డి వ్యాఖ్యలపై అభ్యంతరం చెప్పలేదని ప్రశ్నించారు. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 10 ప్రాజెక్టులను చేపట్టిందని, ఈ సమయంలో మహాకూటమికి అవకాశం ఇస్తే అవన్నీ ఎక్కడికక్కడ నిలిచిపోయే ప్రమాదం ఉందని హరీశ్‌రావు ఆరోపించారు.  

ప్రతిపక్ష హోదాపైనే ప్రస్తుతం చర్చ..
గెలుపు టీఆర్‌ఎస్‌దే అయినా ప్రతిపక్ష హోదాపైనే రాష్ట్రమంతా చర్చ జరుగుతోందని హరీశ్‌ అన్నారు. కనీసం 10 సీట్లు గెలిస్తేనే ప్రతిపక్ష హోదా వస్తుందని  కాంగ్రెస్‌కు ఈసారి ఆ అవకాశమైనా దక్కుతుందో లేదోనని ప్రజలు చర్చించుకుంటున్నారని అన్నారు.  ఇదిలా ఉండగా, సిద్దిపేట టీఆర్‌ఎస్‌ అభ్యర్థి హరీశ్‌రావుకు 170 చర్చిలు ఏకగ్రీవంగా మద్దతు ప్రకటించాయి. సిద్దిపేట కొండా భూదేవి గార్డెన్‌లో ఆదివారం జరిగిన నియోజకవర్గ క్రైస్తవుల సభలో ఈ మేరకు నిర్ణయించాయి.

ఔర్‌ ఏక్‌ డక్కా.. ఏక్‌ లాక్‌ పక్కా..
‘పద్నాలుగేళ్లుగా సిద్దిపేట నియోజకవర్గం నుంచి నన్ను గుండెల్లో పెట్టుకుని శాసనసభకు పంపించారు. కానీ సచిన్‌ 99 దగ్గర ఔట్‌ అయినట్లు మన మెజారిటీ 90 వేల దగ్గరే ఆగుతోంది. ఈ సారి ‘ఔర్‌ ఏక్‌ డక్కా.. ఏక్‌ లాక్‌ పక్కా’ లెక్క లక్ష మెజారిటీ దాటి చరిత్ర సృష్టించాలని’ హరీశ్‌రావు పిలుపునిచ్చారు. సిద్దిపేట పట్టణ పరిధిలోని ప్రెస్‌క్లబ్, మున్నూరుకాపు సంఘం, రెడ్డి సంక్షేమ భవన్, చిన్నకోడూరు, మందపల్లి, ఎన్జీవో భవన్, కొండభూదేవి గార్డెన్‌లో వరుసగా జరిగిన సభల్లో ఆయన పాల్గొన్నారు.

ఒక దశలో ఆయా సంఘాలు హరీశ్‌కు మద్దతుగా ఏకగ్రీవ తీర్మానాల పత్రాలు అందజేసి మద్దతు ప్రకటించాయి. గత రెండు పర్యాయిలు 90 వేల నుంచి లక్షలోపు మెజారిటీ సాధించి అక్కడి వరకే ఆగిందన్నారు. ఈసారి లక్ష పైచిలుకు మెజారిటీ అందించాలని ప్రజలను కోరారు. మెజారిటీ పెరిగితే సిద్దిపేట ప్రాంత గౌరవం, ఆత్మాభిమానం పెరుగుతుందన్నారు. ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకునేలా ప్రజలు, పార్టీ శ్రేణులు, మేధావులు కృషి చేయాలని సూచించారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ ఫారూఖ్‌హుస్సేన్‌తో పాటు నాయకులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు