వైఎస్‌ జగన్‌ అనే నేను

31 May, 2019 04:12 IST|Sakshi
నాడు సీఎంగా ప్రమాణస్వీకారం తర్వాత తొలి సంతకం చేస్తున్న వైఎస్సార్‌.. నేడు అదే పెన్నుతో వైఎస్‌ జగన్‌ తొలి సంతకం

 అభిమానుల హర్షధ్వానాల మధ్య సీఎంగా వైఎస్‌ జగన్‌ ప్రమాణ స్వీకారం

అదే పెన్ను.. అదే సంక్షేమం

సాక్షి, అమరావతి: అశేష జనవాహిని కేరింతలు.. హర్షధ్వానాలు.. దిక్కులు పిక్కటిల్లే నినాదాల నడుమ ‘వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అనే నేను..’ అంటూ వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆంధ్రప్రదేశ్‌ రెండవ ముఖ్యమంత్రిగా గురువారం పదవీ ప్రమాణ స్వీకారం చేశారు. విజయవాడ నడిబొడ్డున గల ఇందిరా గాంధీ మున్సిపల్‌ స్టేడియంలో ఉత్సాహం, ఉద్విగ్నభరిత వాతావరణంలో మధ్యాహ్నం సరిగ్గా 12.23 గంటల ముహూర్తానికి గవర్నర్‌ ఈఎస్‌ఎల్‌ నరసింహన్, వైఎస్‌ జగన్‌తో పదవీ ప్రమాణ స్వీకారం చేయించారు. ప్రభుత్వ రహస్యాలను కాపాడతానని కూడా ప్రమాణం చేయించారు. జగన్‌ ప్రమాణం చేస్తున్నప్పుడు వేదికకు ఎడమవైపున ఆశీనురాలైన ఆయన మాతృమూర్తి వైఎస్‌ విజయమ్మ చలించారు.. కంటతడిపెట్టారు.

ప్రమాణ స్వీకార సమయానికి ముందుగా అక్కడకు చేరుకున్న ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రమణ్యం తొలుత జగన్‌ను ముఖ్యమంత్రిగా నియమిస్తూ గవర్నర్‌ జారీ చేసిన నియామక పత్రాన్ని చదవి వినిపిస్తూ కాబోయే ముఖ్యమంత్రిని ఆహ్వానించారు. ఆ వెంటనే గవర్నర్‌ లేచి లాంఛనంగా ‘..అనే నేను’ అంటూ తొలి పలుకు చెప్పగానే ‘వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అనే నేను, శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, భారతదేశ సార్వ భౌమాధికారాన్ని, సమగ్రతను కాపాడుతానని, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నా కర్తవ్యాలను శ్రద్ధతో అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తానని, భయంగాని, పక్షపాతం గాని రాగద్వేషాలు గాని లేకుండా రాజ్యాంగాన్ని, శాసనాలను అనుసరించి ప్రజలందరికీ న్యాయం చేకూరుస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను’ అని అన్నారు.

వెను వెంటనే మళ్లీ గవర్నర్‌ ‘..అనే నేను’ అనగానే.. ‘వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అనే నేను ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నా పరిశీలనకు వచ్చిన లేదా నాకు తెలియ వచ్చిన ఏవిషయాన్ని నా కర్తవ్యాలను సక్రమంగా నిర్వహించేందుకు అవసరమైన మేరకు తప్పప్రత్యక్షంగా గాని, పరోక్షంగా గాని ఏ వ్యక్తికీ లేదా.. వ్యక్తులకు తెలియ పరచనని లేదావెల్లడించనని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను’ అని అన్నారు. జగన్‌ ముఖ్యమంత్రి కాగానే.. వేదికపై కాస్త ఎడంగా కూర్చున్న గవర్నర్‌సతీమణి విమలా నరసింహన్‌ ఒక పుష్పగుచ్ఛాన్ని జగన్‌ సతీమణి వైఎస్‌ భారతీరెడ్డికి ఇచ్చి
మనసారా అభినందనలు తెలియజేశారు.        

నవ్యాంధ్రలో నూతన అధ్యాయం..
2019 మే 30.. నవ్యాంధ్రలో నూతన అధ్యాయం ప్రారంభమైంది. ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమాన్ని ప్రత్యక్షంగా వీక్షించాలని వివిధ ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున పార్టీ శ్రేణులు, అభిమానులు తరలి వచ్చారు. ఉదయం నుంచే ఇందిరా గాంధీ స్టేడియం వద్ద సందడి నెలకొంది. స్టేడియం యావత్తు వైఎస్‌ జగన్‌ నినాదాలతో మార్మోగింది. గంటగంటకూ జనం పెరిగిపోవడంతో ఉదయం 10 గంటల తర్వాత అదుపు చేయడం పోలీసులకు కష్టతరమైంది. స్టేడియం బయట 14 ఎల్‌ఈడీ తెరల ముందు జనం పెద్ద ఎత్తున గుమిగూడారు. జగన్, ఆయన కుటుంబ సభ్యులు తాడేపల్లిలోని నివాసం నుంచి ప్రత్యేక కాన్వాయ్‌లో తాడేపల్లి సెంటర్, వారధి మీదుగా మున్సిపల్‌ స్టేడియానికి చేరుకున్నారు.

ఉదయం 11.50 గంటల సమయంలో జగన్‌ తన కుటుంబ సభ్యులతో కలిసి సభాస్థలికి చేరుకున్నప్పుడు ప్రజలు జేజేలు పలికారు. సభాస్థలి వద్ద పార్టీ నేతలు హెలికాప్టర్‌ నుంచి పూలు చల్లుతూ అభిమానాన్ని చాటుకున్న తీరు అపురూపం. వేదిక వద్దకు రాబోయే ముందు ఓపెన్‌ టాప్‌ జీప్‌లో వైఎస్‌ జగన్‌ జనానికి అభివాదం చేస్తూ సభా ప్రాంగణమంతా కలియతిరిగారు. అప్పటికే వేదికపైకి వచ్చిన తమిళనాడు డీఎంకే అధినేత స్టాలిన్, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కే చంద్రశేఖరరావు, తెలంగాణ మంత్రులు, పుదుచ్ఛేరీ మాజీ మంత్రి మాల్లాడి కృష్ణారావులకు వినమ్రంగా నమస్కరిస్తూ వేదికపైకి వచ్చిన జగన్‌.. ప్రజలకు అభివాదం చేసినప్పుడు కొన్ని నిమిషాల పాటు ప్రాంగణమంతా హర్షధ్వానాలతో హోరెత్తింది. వైఎస్‌ జగన్‌ ఎదురేగి గవర్నర్‌ దంపతులకు స్వాగతం పలికారు.

అనంతరం ప్రమాణ స్వీకార కార్యక్రమ ప్రక్రియను ప్రారంభిస్తున్నట్టు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీసుబ్రమణ్యం ప్రకటించారు. ముందుగా నిర్ణయించిన ముహూర్తం ప్రకారం సరిగ్గా 12.23 గంటలకు వైఎస్‌ జగన్‌తో నరసింహన్‌ ప్రమాణ స్వీకారం చేయించారు. అనంతరం గవర్నర్‌ దంపతులకు జగన్‌ స్వయంగా కిందకు వెళ్లి వీడ్కోలు పలికారు. అనంతరం స్టాలిన్, కేసీఆర్‌లు జగన్‌కు శుభాకాంక్షలు తెలిపారు. కేసీఆర్‌ మాట్లాడుతూ నాన్నగారి (డాక్టర్‌ వైఎస్సార్‌) పేరు నిలబెట్టి కనీసం మూడు నాలుగు టర్ముల వరకు మీ పరిపాలన ఈ రాష్ట్రంలో కొనసాగాలని దీవిస్తున్నానని అన్నప్పుడు సభా ప్రాంగణం జగన్‌ నినాదంతో మార్మోగింది.

సంబంధిత వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి

అరుదైన రికార్డు
తెలుగు రాష్ట్రాల చరిత్రలో జగన్‌ ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టడం ఓ అరుదైన రికార్డుగా నిలిచింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి జగన్‌ తండ్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి 2004 నుంచి 2009 వరకు ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఆ తర్వాత మళ్లీ ఇప్పుడు దివంగత సీఎం వైఎస్సార్‌ కుమారుడు వైఎస్‌ జగన్‌ ముఖ్యమంత్రి అయ్యారు. అచ్చంగా తండ్రి బాటలోనే ఆయన తన తొలి సంతకానికి ఒక పవిత్రతను చేకూరుస్తూ అవ్వా తాతల పింఛన్‌ పెంపు ఫైలుపై సంతకం చేశారు. నాడు వైఎస్‌.. రైతులకు ఉచిత విద్యుత్‌ సరఫరాపై తొలి సంతకం చేశారు. అది నేటికీ ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో అప్రతిహతంగా అమలవుతోంది.జగన్‌ ప్రమాణ స్వీకారోత్సవానికి తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు, తమిళనాడు డీఎంకే అధినేత స్టాలిన్, తెలంగాణ అసెంబ్లీ స్పీకర్‌ పోచారం శ్రీనివాసరెడ్డి, తెలంగాణ ఉప  ముఖ్యమంత్రి మహమూద్‌ అలీ, మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్, టీఆర్‌ఎస్‌ రాజ్యసభ సభ్యుడు కె.కేశవరావు, టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప, కాంగ్రెస్‌ రాజ్యసభ సభ్యుడు కేవీపీ రామచంద్రరావు, ఆయన సతీమణి.

సీపీఎం రాష్ట్ర కార్యదర్శి పి.మధు, ఆ పార్టీ మరో నేత వై.వెంకటేశ్వరరావు, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ, యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్, పుదుచ్చేరి మాజీ మంత్రి మల్లాడి కృష్ణారావు, రాజ్యసభ సభ్యులు వి.విజయసాయిరెడ్డి, వేమిరెడ్డి ప్రభాకర్‌ రెడ్డి, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి, సీనియర్‌ నేతలు, మాజీ ఎంపీలు మేకపాటి రాజమోహన్‌రెడ్డి, వైవీ సుబ్బారెడ్డి, పార్టీ సీనియర్‌ నేతలు బొత్స సత్యనారాయణ, ధర్మాన ప్రసాదరావు, రాజ్యసభ మాజీ సభ్యుడు యలమంచిలి శివాజి, టీడీపీ నేతలు నన్నపనేని రాజకుమారి, కేఆర్‌ పుష్పరాజ్, సీనియర్‌ ఐఏఎస్, ఐపీస్‌ అధికారులు, సినీ ప్రముఖులు రాంగోపాల్‌వర్మ, దిల్‌ రాజు, మహివి రాఘవతో పాటు పలువురు హాజరయ్యారు. వీరితో పాటు జగన్‌ సతీమణి వైఎస్‌ భారతి, ఆయన ఇద్దరు కుమార్తెలు హర్షారెడ్డి, వర్షారెడ్డి, సోదరి షర్మిల, బ్రదర్‌ అనిల్‌ కుమార్‌ తదితరులు మాతృమూర్తి విజయమ్మతో కలిసి వేదికపై ఆశీనులయ్యారు. పెద్ద సంఖ్యలో వైఎస్‌ కుటుంబ సభ్యులు వేదికకు కింది వైపున ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన గ్యాలరీలో ఆశీనులయ్యారు.

ఆకట్టుకున్న ప్రసంగం  
ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం అనంతరం వైఎస్‌ జగన్‌ చేసిన ప్రసంగం అన్ని వర్గాల ప్రజలను ఆకట్టుకుంది. ’నేను మీ కష్టాలు చూశాను, మీ బాధలను విన్నాను, నేను ఉన్నాను’ అని జగన్‌ చెప్పినప్పుడు వివిధ గ్యాలరీలలో ఉన్న వారు తమ సీట్లలో నుంచి లేచి మరీ హర్షధ్వానాలు వ్యక్తం చేయడం గమనార్హం. ఆగస్టు 15లోగా సుమారు 4 లక్షల వాలంటీర్‌లను నియమిస్తామని ప్రకటించినప్పుడు యువకుల కేరింతలు మిన్నంటాయి. సభ ముగిసిన అనంతరం కూడా ఉద్యోగాల భర్తీపై యువతీ యువకులు పెద్దఎత్తున చర్చించుకోవడం గమనార్హం.

అర్హులందరికీ పథకాలు అందేలా చూస్తామని.. కులం, మతం, ప్రాంతం, వర్గం, రాజకీయాలు, పార్టీలు చూడం అని జగన్‌ చేసిన ప్రకటనతో ’నాయకుడంటే ఇతనే.. తండ్రిని మించిన తనయుడు’ అని పలువురు వ్యాఖ్యానించారు. ఎన్నికల ప్రణాళిక విలువను జగన్‌ చాటిచెప్పిన తీరు ఆకట్టుకుంది. ‘ఫీజు రీయింబర్స్‌మెంట్, ఆరోగ్య శ్రీ అంటే డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖరరెడ్డికి గుర్తుకు వస్తారు. ఇప్పుడు తండ్రి అడుగుజాడల్లో నడిచి అవ్వాతాతల పెన్షన్‌ను రూ.2250కి పెంచి జగన్‌ చరితార్ధుడయ్యారు. పండుటాకులకు ఆసరా ఇచ్చిన ఈ పథకం ఉన్నంత కాలం జగన్‌ను మరచిపోవడం సాధ్యం కాదు’ అని ఓ వామపక్ష పార్టీ నాయకుడు రవీంద్ర అభిప్రాయపడ్డారు. మొత్తం మీద రాష్ట్రంలో నూతన అధ్యయనానికి నవ యువకుడు నడుం కట్టారని మేధావులు అభిప్రాయపడ్డారు.  

 ప్రమాణ స్వీకారోత్సవం ఇలా..
►11.50 గంటలకు కుటుంబ సభ్యులతో కలిసి ఇంటి నుంచి బయలుదేరిన జగన్‌
►12.04 గంటలకు స్టేడియంలోకి ప్రవేశం
►12.10 గంటలకు వేదికపైకి   
►12.18 గంటలకు గవర్నర్‌ ప్రసంగం
►12.23 గంటలకు సీఎంగా ప్రమాణ స్వీకారం
►12.29 గంటలకు ప్రమాణ స్వీకారం ముంగింపు
►12.30 గంటలకు గవర్నర్‌కు జగన్‌ వీడ్కోలు
►12.41 గంటలకు జగన్‌ ప్రసంగం
►1.05 గంటలకు అవ్వాతాతల
పెన్షన్‌ పెంపు ఫైలుపై జగన్‌ తొలి సంతకం

Read latest Politics News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు