ప్రత్యేక హోదా.. చంద్రబాబు మరో డ్రామా!

26 Mar, 2018 20:23 IST|Sakshi

సాక్షి, అమరావతి, నెల్లూరు :  ప్రత్యేక హోదా విషయంలో మరో డ్రామాకు ఏపీ ప్రభుత్వం తెరలేపింది. రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో మంగళవారం ఉదయం 11 గంటలకు అఖిలపక్ష సంఘాల సమావేశాన్ని నిర్వహిస్తోంది. ప్రత్యేక హోదా కోసం పోరాడే అన్ని పార్టీలకు ఆహ్వానం పంపించారు. ఒక్కో పార్టీ నుంచి ఇద్దరు ప్రతినిధులకు ఆహ్వానం అందింది.

అఖిలపక్ష భేటీపై పేరిట రాష్ట్ర ప్రభుత్వం వ్యవహారిస్తున్న తీరుపై  వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఆగ్రహం వ్యక్తం చేసింది. అఖిలపక్ష సంఘాల సమావేశం పేరుతో చంద్రబాబు మరో డ్రామాకు తెరలేపారని మండిపడింది. ‘చంద్రబాబు కారణంగానే ఏపీకి ప్రత్యేక హోదా రాలేదు. హోదా కంటే ప్యాకేజీ మేలన్నది చంద్రబాబే. వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి సుదీర్ఘంగా నిర్వహించిన పోరాటాల వల్లే హోదా ఆకాంక్ష సజీవంగా ఉంది. హోదా క్రెడిట్‌ జగన్‌కు వస్తుందేమోననే భయం చంద్రబాబుకు పట్టుకుంది. అందుకే అఖిలపక్ష డ్రామాకు తెరతీశారు’ అని వైఎస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యే కాకాణి గోవర్థన్‌రెడ్డి మండిపడ్డారు. ఒకవేళ చంద్రబాబుకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే తమ ఎంపీలతోపాటు టీడీపీ ఎంపీలతోనూ రాజీనామా చేయించాలని డిమాండ్‌ చేశారు. నాలుగేళ్లుగా చంద్రబాబుకు అఖిలపక్షం ఎందుకు గుర్తుకురాలేదని నిలదీశారు. ప్రజల దృష్టిని మరల్చేందుకే అఖిలపక్ష సంఘం పేరుతో డ్రామాలు ఆడుతున్నారని ధ్వజమెత్తారు.

మరిన్ని వార్తలు