పటేళ్ల పంతం నెగ్గిందా?

19 Dec, 2017 01:51 IST|Sakshi

గుజరాత్‌లో పాటీదార్ల వ్యతిరేకత ఎన్నికల ఫలితాలపై ప్రభావం చూపిందని పరిశీలకులు భావిస్తున్నారు. 2015లో హార్ధిక్‌ పటేల్‌ నాయకత్వాన మొదలైన పాటీదార్ల రిజర్వేషన్‌ ఆందోళన అత్యధిక పటేళ్లను బీజేపీకి దూరం చేసింది. రిజర్వేషన్‌ అమలు చేస్తామనే రాహుల్‌  హామీతో వారిని ఆకట్టుకోవడం మొదటిసారి గుజరాత్‌ రాజకీయ, సామాజిక చిత్రాన్ని సమూలంగా మార్చే పరిస్థితి తలెత్తింది. పర్యవసానంగా బీజేపీ సీట్లకు గండికొట్టి, కాంగ్రెస్‌కు లాభం చేకూర్చింది.

ఎక్కువ సీట్లు ఇచ్చినా బీజేపీకి దక్కని ప్రయోజనం
రెండేళ్ల నుంచీ బీసీ కోటా కోసం ఆందోళన సాగిస్తున్న పాటీదార్లను ప్రసన్నం చేసుకోడానికి ఈసారి బీజేపీ ఎక్కువ మంది పటేళ్లకు టికెట్లు ఇచ్చింది. ఆ వర్గం సిట్టింగ్‌ ఎమ్మెల్యేలందరికీ మళ్లీ పోటీ చేసే అవకాశమిచ్చింది. కాంగ్రెస్‌ పార్టీ మాత్రం పాటీదార్‌ రిజర్వేషన్‌ ఉద్యమ నేతే (హార్ధిక్‌పటేల్‌) తనకు మద్దతు ప్రకటించడంతో ఈసారి పటేళ్లకిచ్చే టికెట్ల సంఖ్యను తగ్గించింది. బరిలో నిలిచేందుకు అవసరమైన 25 ఏళ్లు రాకపోవడంతో పాటీదార్‌ నేత హార్దిక్‌ పోటీ చేయలేదు కానీ తమ నేతలు కొందరికి టికెట్లు సాధించగలిగారు. పాటీదార్ల మద్దతు బాగా తగ్గిపోయిందన్న విషయం గ్రహించిన బీజేపీ వారికి వ్యతిరేకంగా బాహాటంగా బీసీలను ఆకట్టుకునే సాహసం చేయలేకపోయింది.

బీసీల్లో ఎక్కువ శాతమున్న మత్స్యకారులైన కోలీల మద్దతు విషయంలో బీజేపీ కొంత విజయం సాధించింది. ఎస్సీలు, బీసీలు, పాటీదార్ల యువనేతల మద్దతు కాంగ్రెస్‌కు లభించడం కొంత వరకు ఆ పార్టీకి మేలు చేసింది. తమకు కోటా రాదని తెలిసినా కేవలం మోదీకి, విజయ్‌ రూపాణీ నేతృత్వంలోని బీజేపీ సర్కారుకు ‘గుణపాఠం’ చెప్పాలనే హార్ధిక్, ఇతర యువ పాటీదార్‌ నేతల మాటలు పెద్ద తరం పటేళ్లకు రుచించలేదు. ఒక్కసారిగా బీజేపీకి కులమంతా దూరం కావడం తెలివైన వ్యూహం కాదని వారు భావించడంతో పాటీదార్‌ ఓట్లు కూడా చాలా ప్రాంతాల్లో బీజేపీకి అవసరమైన స్థాయిలో పడ్డాయి.

అన్ని వర్గాల నుంచీ తగ్గిన మద్దతు?
పాటీదార్ల స్థానంలో ఇతర సామాజిక వర్గాల ఓట్లు కూడా బీజేపీకి పూర్తిగా పడకపోయినా బీజేపీ 99 సీట్లు గెలుచుకోవడం నిజంగా గొప్ప విజయమేనని చెప్పాలి. పది శాతమున్న ముస్లింల ఓట్లు పెద్దగా బీజేపీకి పడకపోయి నా, దాదాపు 12 శాతమున్న పటేళ్లలో తమ సర్కారుపై కోపం పీకలదాకా ఉన్నా ఈ ఎన్నికల్లో కాషాయ పక్షం మెజారిటీ సాధించ డం ఈ పార్టీ నేతలు సైతం ఊహించని వాస్తవం. పాటీదార్‌ యువత అంచనా వేయలే నంతగా దూరమైనప్పటికీ ఇతర బీసీలు, ఆదివాసీలను ఆకట్టుకోవడానికి బీజేపీ చేసిన ప్రయత్నాలు కొంత వరకు సఫలమయ్యాయని ఫలితాలు నిరూపిస్తున్నాయి. 13 ఎస్సీ రిజర్వుడ్‌ సీట్లలో ఏడు, 23 ఆదివాసీ నియోజకవర్గాల్లో దాదాపు సగం దక్కించుకోవడం కూడా బీజేపీ మెజారిటీకి దోహదం చేశాయి.    -- సాక్షి నాలెడ్జ్‌ సెంటర్‌

మరిన్ని వార్తలు