కేజ్రీవాల్‌ యూటర్న్‌ తీసుకున్నారా?

11 Aug, 2019 08:52 IST|Sakshi

గిల్లికజ్జాలు పెట్టుకునే శైలికి స్వస్తి

అభివృద్ధి చేసినందుకు కృతజ్ఞతలు తెలుపుతున్న వైనం

అసెంబ్లీ ఎన్నికలే కారణమంటున్న రాజకీయ విశ్లేషకులు

సాక్షి, న్యూఢిల్లీ:  ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ యూటర్న్‌ తీసుకున్నారు. ఆయన కేంద్రంతో వ్యవహరించే శైలిలో పూర్తిగా మార్పులు వచ్చాయి. గతంలో  కేంద్రంతో చీటికి మాటికి గిల్లికజ్జాలు పెట్టుకునే శైలికి స్వస్తి చెప్పి సామరస్యపూర్వకంగా వ్యవహరిస్తున్నారు. అంతేకాదు ఇటీవల ఆయన పలుమార్లు కేంద్రానికి కృతజ్ఞత తెలిపారు. తాజాగా çశుక్రవారం సుంగర్‌పుర్‌ గ్రామంలో యమునా తీరాన చెరువు తవ్వే పైలట్‌ ప్రాజెక్టు ప్రారంభోత్సవం సందర్భంగా ఆయన కేంద్ర మంత్రికి కృతజ్ఞతలు తెలిపారు. ఇంతకు ముందు కూడా ఆయన తమ ప్రతిపాదనలకు ఆమోదం తెలిపినందుకు  మోదీ సర్కారుకు ధన్యవాదాలు తెలిపారు.

లోక్‌సభ ఫలితాలతో మారిన తీరు!
లోక్‌సభ ఎన్నికల ఫలితాలు వచ్చినప్పటి నుంచి కేజ్రీవాల్‌  శైలి మారిపోయిందని, అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న దృష్ట్యా ఆయన  తన వైఖరిని మార్చుకున్నారని రాజకీయ పరిశీలకులు అంటున్నారు. కేంద్ర ప్రభుత్వంతో  ఢిల్లీ ప్రభుత్వ సంబంధాలు మెరుగయ్యాయన్న సందేశాన్ని కేజ్రీవాల్‌ ప్రజలకు ఇవ్వదలచుకున్నారని వారు అంటున్నారు. అంతకుముందు కేజ్రీవాల్‌ తమ ప్రతి పనికి కేంద్రం అడ్డుపడ్తోందని ఆరోపించేవారు. ఆయన ఇప్పుడామాటే ఎత్తడం లేదు. జూన్‌ 21న ఆయన ప్రధానమంత్రి నరేంద్రమోదీని కలిసి లోక్‌సభ ఎన్నికలలో ఘనవిజయానికి అభినందించారు. ఢిల్లీ అభివృద్ధి కోసం కేంద్రం, ఢిల్లీ ప్రభుత్వం కలిసి పనిచేయవలసిన అవసరం ఉందని, తాము సంపూర్ణ సహకారం అందిస్తామని ఆయన ఈ సందర్భంగా ట్వీట్‌ చేశారు. 

అనధికార కాలనీల క్రమబద్దీకరణ ప్రతిపాదనకు అనుమతి ఇచ్చినందుకు  కేజ్రీవాల్‌ జూలై 18న కేంద్రానికి కృతజ్ఞతలు తెలిపారు. అనధికార కాలనీలలో రిజిస్ట్రేషన్‌ పనులు త్వరలో మొదలవుతాయని ప్రకటిస్తూ కేజ్రీవాల్‌ ఢిల్లీవాసుల తరపున కేంద్రానికి కృతజ్ఞతలు తెలిపారు. యమునా తీరాన భూగర్భ జల సంరక్షణ కోసం  యమునా తీరాన కుంటలు తవ్వే ప్రతిపాదనకు త్వరగా అనుమతినిచి్చందుకు కేజ్రీవాల్‌ హర్షం çప్రకటిస్తూ కేంద్ర జలశక్తి మంత్రికి కృతజ్ఞతలు తెలిపారు. ఓఖ్లాలో  సీవేజ్‌ ట్రీట్‌మెంట్‌ ప్లాంటు శంకుస్థాపన సందర్భంగా కేజ్రీవాల్‌ జూలై 8న కృతజ్ఞతలు తెలిపారు. కేంద్రం, ఢిల్లీ ప్రభుత్వం కలిసి  యమునను శుద్ధి చేయడంలో విజయం సాధిస్తాయన్న నమ్మకం తనకుందని ఆయన చెప్పారు. ఢిల్లీలో నేరాలను తగ్గించడం కోసం తాము లెప్టినెంట్‌ గవర్నర్‌తో కలిసి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నామని జూలై 30న చెప్పారు.

>
మరిన్ని వార్తలు