కాంగ్రెస్‌తో పొత్తు దాదాపుగా లేనట్టే!

15 Feb, 2019 10:29 IST|Sakshi

ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌

బీజేపీ వ్యతిరేక ఓటు చీలకూడదని వ్యాఖ్య

సాక్షి, న్యూఢిల్లీ: లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్, ఆమ్‌ ఆద్మీ పార్టీల మద్య పొత్తుపై సాగుతున్న ఊహాగానాలకు ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రివాల్‌ తెరదించారు. కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీతో ఎంతవరకు అంగీకారం కుదిరింది అన్న ప్రశ్నకు కేజ్రీవాల్‌ జవాబిస్తూ ఇంతవరకు ఈ దిశలో ఎలాంటి అంగీకారం కుదరలేదని చెప్పారు. పొత్తు గురించి అడిగిన ప్రశ్నకు మరో ప్రశ్నకు ఆయన కాంగ్రెస్‌ దాదాపుగా పొత్తుకు నిరాకరించిందని చెప్పారు. బుధవారం శరద్‌పవార్‌ నివాసంలో జరిగిన ప్రతిపక్ష నేతల సమావేశానికి రాహుల్‌ గాంధీ, అరవింద్‌ కేజ్రివాల్‌ హాజరు కావడంతో అనేక ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో విలేకరులు అడిగిన ప్రశ్నకు జవాబిస్తూ తమ మనసులో దేశం గురించిన ఆందోళన ఎక్కువగా ఉందని, ఐదేళ్లలో దేశంలో సుహృద్భావాన్ని దెబ్బతీశారని ఆయన ఆరోపించారు.

నోట్ల రద్దు వంటి తప్పుడు నిర్ణయాలు తీసుకున్నారని, మాబ్‌ లించింగ్‌ వంటి ఘటనలు పెరగడంతో పాటు సంస్థలను దెబ్బతీస్తున్నారని ఆయన ఆరోపించారు. మోదీ, అమిత్‌షా ద్వయాన్ని ఓడించాలని మొత్తం దేశం కోరుకుంటోందని, అందువల్ల బీజేపీకి వ్యతిరేకంగా ఒక్కరే అభ్యర్థిని నిలబెట్టవలసిన అవసరం ఉందని, దాని వల్ల ఓట్లు చీలకుండా ఉంటాయని కేజ్రీవాల్‌ చెప్పారు. ఢిల్లీలో బీజేపీకి వ్యతిరేకంగా ఇద్దరు అభ్యర్థులు నిలబడితే దాని వల్ల బీజేపీకే ప్రయోజనం ఉంటుందని, ఈ విషయాన్ని అన్ని పార్టీలు అర్థం చేసుకోవాలని ఆయన చెప్పారు. యూపీలో ఎస్పీ, బీఎస్పీలతో పాటు అనేక పార్టీల అభ్యర్థులు బరిలోకి దిగితే బీజేపీకి లాభం ఉంటుందని అన్నారు. షీలాదీక్షిత్‌ సుప్రీంకోర్టు తీర్పును స్వాగతించడంపై అసహనం వ్యక్తం చేశారు. రాజకీయాల కోసం ఇటువంటి వ్యాఖ్యలు చేయడం సరికాదని కేజ్రివాల్‌ అన్నారు.

>
మరిన్ని వార్తలు