‘ఓటుకు కోట్లు’ దొంగతో చర్చించం

12 Jan, 2018 01:18 IST|Sakshi

ఉత్తమ్, జానారెడ్డి వస్తే చర్చకు సిద్ధం: బాల్క సుమన్‌

సాక్షి, హైదరాబాద్‌: విద్యుత్‌ అంశంపై చర్చించడానికి తమకు ఎలాంటి అభ్యంతరం లేదని, కాంగ్రెస్‌ తరఫున పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, సీఎల్పీ నేత జానారెడ్డి వస్తే తాము చర్చకు సిద్ధమని ఎంపీ బాల్కసుమన్‌ పేర్కొన్నారు. ఓటుకు కోట్లు కేసులో పట్టుబడ్డ దొంగ రేవంత్‌రెడ్డితో ఎందుకు చర్చిస్తామని అన్నారు.

మండలిలో ప్రభుత్వ విప్‌ పల్లారాజేశ్వర్‌రెడ్డి, ఎమ్మెల్సీ భానుప్రసాద్‌లతో కలసి ఆయన గురువారం టీఆర్‌ఎస్‌ఎల్పీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. తప్పుడు ఆరోపణలతో వార్తల్లో ఉండేందుకు తపించే విశ్వసనీయత లేనివ్యక్తి రేవంత్‌ అని, అలాంటి వారితో చర్చించడం వల్ల ఏం ఉపయోగం ఉండదని సుమన్‌ పేర్కొన్నారు.

గతంలో అసెంబ్లీ సాక్షిగా విద్యుత్‌పై అబద్ధా్దలు మాట్లాడి రేవంత్‌ అడ్డంగా దొరికిపోయాడని, తన వాదనకు సరైన డాక్యుమెంట్లు చూపలేక అసెంబ్లీకి మొహం చాటేశాడని గుర్తు చేశారు. కోమటిరెడ్డి చేసిన ఆరోపణలు ఏ ఒక్కటీ నిజంకాదని రాజేశ్వర్‌రెడ్డి తెలిపారు. సీఎం చర్చకు రావాలంటే తాము 10, జనపథ్‌ నుంచి రావాలంటామని పల్లా అన్నారు. 

మరిన్ని వార్తలు