బ్యాలెట్‌ పేపర్‌ రె‘ఢీ’

17 Jun, 2019 11:24 IST|Sakshi

సాక్షి,ఆరసవల్లి: స్థానిక సమరానికి ముహూర్తం సమీపిస్తోంది. పంచాయతీ ఎన్నికలను సకాలంలో నిర్వహించేందుకు నడుం కట్టిన రాష్ట్ర ఎన్ని కల కమిషన్‌ సన్నాహాలకు అనుగుణంగానే ప్రభుత్వ అధికారులు విధుల్లో స్పీడ్‌ పెంచా రు. ఈ క్రమంలో కీలకమైన బ్యాలెట్‌ ముద్రణకు సన్నాహాలు మొదలుపెట్టారు. 2011 జనాభా లెక్కల ప్రకారం ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల ఓటరు జాబితా ఆధారంగా ఇప్పటికే గ్రామీణ ఓటర్ల జాబితా రూపకల్పన పూర్తయ్యింది.

రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ ఆదేశాల మేరకు గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి కులాలవారీగా ఓటర్ల తుది జాబితాను ఈనెల 18న, అలాగే పోలింగ్‌ కేంద్రాల తుది జాబితాను ఈనెల 20న అధి కారికంగా ప్రకటించేందుకు జిల్లా పంచాయతీ అధికారులు సన్నద్ధమవుతుండగా, మరోవైపు బ్యాలెట్‌ పేపర్ల ముద్రణకు అధి కారులు అడుగులు వేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఏ క్షణంలో గ్రీన్‌ సిగ్నల్‌ వచ్చినా.. ఎన్నికలను నిర్వహించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని తెలియజేసేందుకు ఎన్నికల సంఘం జోరు పెంచింది.

తాజాగా జిల్లాలోని గ్రామ సర్పంచులకు, వార్డు మెంబర్లకు వేర్వేరుగా బ్యాలెట్‌ పేపర్ల ముద్రణకు మొత్తం 26 మెట్రిక్‌ టన్నుల పేపర్‌ను స్థానిక ప్రభుత్వ ప్రాంతీయ ముద్రణ కేంద్రానికి సరఫరా చేసింది. జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ ఆధ్వర్యంలో కొనుగోలు కమిటీ టెండర్లను పిలిచి.. ధరలను ఖరారు చేయనుంది. ఆ వెంటనే బ్యాలె ట్‌ పేపర్‌ ముద్రణ ప్రారంభించనున్నారు. 

స్థానిక ఎన్నికల్లో తొలిసారి.. నోటా!
త్వరలో జరుగనున్న గ్రామ పంచాయతీ ఎన్నికల్లో మొట్టమొదటిసారిగా బ్యాలెట్‌ పేపర్‌లో ‘నోటా’ గుర్తు కూడా ఉండేలా ఎన్నికల సంఘం అధికారులు చర్యలు చేపట్టారు. ఇంతవరకు సార్వత్రిక ఎన్నికల్లోనే కనిపించిన ఈ నోటా చిహ్నం ఇప్పుడు పంచాయతీలకు చేరింది. రాజకీయ పార్టీల గుర్తులకు సంబంధం లేకుండా జరుగనున్న పంచాయతీ ఎన్నికల కోసం రాష్ట్ర ఎన్నికల సంఘం విడుదల చేసిన గుర్తులతో వివిధ రకాల బ్యాలెట్‌ పేపర్లు ముద్రించనున్నారు.

 ఇద్దరు అభ్యర్థులు పోటీ చేస్తే అక్కడికి సరఫరా చేసేందుకు వీలుగా రెండు గుర్తులు, ఒక నోటా గుర్తు ఉండేలా బ్యాలెట్‌ పేపర్‌ ముద్రించనున్నారు. ఏ గ్రామ పంచాయతీలో ఎంతమంది అభ్యర్థులు రంగంలో ఉంటారనే సంఖ్య తేలిన   అనంతరం దాని ఆధారంగా ఆయా ప్రాంతాలకు బ్యాలెట్‌ పేపర్లను పంపించనున్నారు. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా, ఈ బ్యాలెట్‌ పేపర్లు ఉపయోగకరంగా ఉంటాయి.  

సర్పంచులకు పింక్, వార్డు మెంబర్లకు వైట్‌.. బ్యాలెట్లు
రాష్ట్ర ఎన్నికల సంఘం నుంచి సర్పంచ్‌ ఎన్నికకు 13 మెట్రిక్‌ టన్నుల పింక్‌ (గులాబీ) కలర్‌ బ్యాలెట్‌ పేపర్లు, వార్డు సభ్యుల కోసం 13 మెట్రిక్‌ టన్నుల వైట్‌ (తెలుపు) బ్యాలెట్‌ పేపర్లు వేర్వేరుగా జిల్లాకు కేటాయించారని జిల్లా పంచాయతీ అధికారి బి.కోటేశ్వరరావు చెప్పారు. జిల్లా ఎన్నికల అధికారుల ఆదేశాల మేరకు టెండర్ల ప్రక్రియ జరిగిన తర్వాత ప్రింటింగ్‌ ప్రారంభమవుతుందన్నారు. అలాగే ఈ ప్రక్రియను జూలై మొదటి వారంలో పూర్తి చేయాలని ఆదేశాలు అందాయని, 18న కులాల వారీగా ఓటర్ల జాబితా, 20న పోలింగ్‌ కేంద్రాల తుది జాబితాను ప్రకటిస్తామన్నారు. 

మరిన్ని వార్తలు