నిరాశతోనే చంద్రబాబు విమర్శలు: దత్తాత్రేయ

6 Mar, 2019 04:23 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నిరాశా నిస్పృహల్లో కూరుకుపోవడం వల్లే ప్రతి అంశాన్ని రాజకీయం చేస్తూ ప్రధాని నరేంద్ర మోదీపై విమర్శలు చేస్తున్నారని ఎంపీ దత్తాత్రేయ మండిపడ్డారు. మంగళవారం ఆయన ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్‌ ప్రజల వ్యక్తిగత సమాచారం ఎలా చోరీకి గురైందో చెప్పకుండా మోదీపై చంద్రబాబు విమర్శలు చేయడం శోచనీయమని దుయ్యబట్టారు. ఏపీకి రైల్వే జోన్‌ ఇచ్చినా దానిపై కూడా బాబు రాద్ధాంతం చేస్తున్నారని విమర్శించారు. ఇకనైనా ఇలాంటివి మానుకుని ఏపీలోని ప్రధాన అంశాలపై దృష్టి సారించాలని హితవు పలికారు. తెలంగాణ లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ సత్తా చాటుతుందని దత్తాత్రేయ ఆశాభావం వ్యక్తం చేశారు. వచ్చే ఎన్నికల్లో తాను తప్పకుండా పోటీ చేస్తానని స్పష్టం చేశారు. టీఆర్‌ఎస్‌ పార్టీ 16 స్థానాల్లో గెలుస్తుందని ఆ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ చెప్పడం ఆయన అహంభావానికి నిదర్శనమన్నారు. టీఆర్‌ఎస్‌ 6 స్థానాలు గెలిస్తే అదే గొప్ప అని వ్యాఖ్యానించారు. ఇక తెలంగాణలో ఖాజీపేట కేంద్రంగా కొత్త డివిజన్‌ ఏర్పాటు చేయాలని రైల్వే మంత్రికి లేఖ రాసినట్టు దత్తాత్రేయ తెలిపారు. 

మరిన్ని వార్తలు