జీఎస్టీపై బీజేపీ, కాంగ్రెస్‌ల పంచాయతీ

1 Jul, 2018 14:48 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: దేశంలో వస్తు సేవల పన్ను( జీఎస్టీ) విధానం అమల్లోకి వచ్చి నేటికి ఏడాది పూర్తయింది. 2017 జూలై 1 నుంచి కేంద్ర సర్కారు దీన్ని అమల్లోకి తీసుకొచ్చింది. జీఎస్టీ తొలి వార్షికోత్సవాన్ని బీజేపీ ఆదివారం నాడు ఘనంగా జరుపుకొంటోంది.  ప్రధాని నరేంద్ర మోదీ దీనిపై ఈ రోజు ఉదయమే ట్వీట్ చేశారు. జీఎస్టీ ఏడాది కాలం పూర్తి చేసుకోవడంపై దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు.

‘‘జీఎస్టీ వృద్ధిని ప్రోత్సహించింది. పన్నుల్లో పారదర్శకతను తీసుకొచ్చింది. ఆర్థిక అంశాలను వ్యవస్థీకృతం చేసేందుకు, ఉత్పత్తిని పెంచేందుకు, వ్యాపారం మరింత సులభతర నిర్వహణకు సాయపడుతోంది. సహకారాత్మక సమాఖ్య వ్యవస్థకు, టీమిండియా స్ఫూర్తికి ఇదో అద్భుతమైన ఉదాహరణ. భారతీయ ఆర్థిక వ్యవస్థలో సానుకూల మార్పులను తీసుకొచ్చింది’’ అని ప్రధాని ట్వీటర్‌లో పేర్కొన్నారు. 

జీఎస్టీ ఒక గొప్ప ఆర్థికసంస్కరణ అని ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీ ట్వీట్‌ చేశారు. ‘గతంలోని సంక్షిష్ట పన్ను విధానానికి స్వస్తి చెప్పి 17 రకాల పన్నుల స్థానంలో ఒకే పన్ను వచ్చింది. దేశ ఆర్థిక వ్యవస్థలో ఒక గొప్ప మార్పు జీఎస్టీ’  అని జైట్లీ పేర్కొన్నారు.

కాగా, కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం గొప్పగా చెప్పుకుంటున్న జీఎస్టీ విధానం ఏడాదిలో ఆశించిన ఫలితాలను ఇవ్వలేదని కాంగ్రెస్ నాయకుడు పి చిదంబరం విమర్శించారు. 'ఆర్థిక వ్యవస్థ క్రమబద్దీకరణ హామీ ఇచ్చి ఏడాదైనా అది అమలుకు నోచుకోలేదు. నగదు డిమాండ్ అంతకంతకూ పెరుగుతూ అవాంతరాలు తలెత్తుతూనే ఉన్నాయి. జీఎస్టీతో వస్తువుల ధరలు 40 శాతం పెరిగాయి. జీఎస్టీ ప్రభావం ఆర్థిక వ్యవస్థపై ఇంకా తొలగిపోలేదు’ అని ట్విటర్‌లో చిదంబరం పేర్కొన్నారు.
 

మరిన్ని వార్తలు