‘ట్విటర్‌ అంత ఈజీ కాదు సభ నిర్వహించడం’

3 Sep, 2018 13:42 IST|Sakshi
కే లక్ష్మణ్‌

ప్రగతి నివేదన సభపై బీజేపీ అధ్యక్షుడు లక్ష్మణ్‌ సెటైర్‌

సాక్షి, హైదరాబాద్‌ : బహిరంగ సభలను నిర్వహించడం ట్విటర్‌లో స్పందించినంత సులువు కాదని మంత్రి కేటీఆర్‌ను ఉద్దేశించి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్‌ ఎద్దేవా చేశారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. టీఆర్‌ఎస్‌ ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన ప్రగతి నివేదన సభపై స్పందించారు. సభ అట్టర్‌ ఫ్లాప్‌ అయిందన్నారు. గత వారం పది రోజులుగా వందల కోట్లు ఖర్చుపెట్టి ఒక హైప్‌ క్రియేట్‌ చేశారని, కానీ కలెక్షన్‌ నిల్‌గా నిలిచిందన్నారు. అది కేసీఆర్‌ ఆవేదన సభగా జరిగిందని విమర్శించారు.

ఎన్నికల శంఖారావంలాగా, తన కొడుక్కి పట్టాభిషేకం చేయాలని వందల కోట్లు ఖర్చుపెట్టారన్నారు. కానీ ప్రజల ఆదరణ పొందని సభగా నిలిచిపోయిందన్నారు. ధనబలం, అధికారమదంతో ప్రజాధనం దుర్వినయోగం చేశారని మండిపడ్డారు. ప్రజలను తరలించే విషయంలో వందలు కోట్లు ఖర్చు పెట్టారు తప్పా ప్రజలను సమీకరించలేకపోయారన్నారు. సీఎం కేసీఆర్‌ ప్రసంగంలో బలం లోపించిందని, ఒక దశ దిశ లేదన్నారు. సభలో ఏం చెప్తారో అని ప్రజలు ఆశగా ఎదురుచూశారని, కానీ కేసీఆర్‌ ప్రసంగం వారిని నిరుత్సాహపరిచిందన్నారు. 

నాలుగున్నరేళ్లలో ఇచ్చిన హామీలు ఇప్పటికి నెరవేర్చకపోగా రాష్ట్రాన్ని అప్పులోకి నెట్టారని ఆరోపించారు. తాము ప్లెక్సీలు కడితే రాత్రికి రాత్రే జీహెచ్‌ఎంసీ అధికారులు తొలగించారని, ఇప్పుడెందుకు అలా చేయలేదని ప్రశ్నించారు. జీహెచ్‌ఎంసీ అధికారులు అధికార పార్టీలకు తొత్తులుగా మారారని మండిపడ్డారు. తమ అధినేత అమిత్‌షా కూడా ముందస్తు ఎన్నికలు సిద్దమని, ప్రచారం కూడా చేస్తానని చెప్పారని తెలిపారు. ప్రతి అసెంబ్లీ నియోజక వర్గాల్లో ఒక భారీ బహిరంగ సభలు ఏర్పాటు చేస్తామన్నారు.

చదవండి: నూటొక్క తీరు.. శ్రేణుల హోరు

మరిన్ని వార్తలు