‘బూత్‌ను క్యాప్చర్‌ చేసేందుకు కోడెల ప్రయత్నించారు’

14 Apr, 2019 20:28 IST|Sakshi

సాక్షి, గుంటూరు : తెలుగుదేశం పార్టీ సీనియర్‌ నేత కోడెల శివప్రసాద్‌ పోలింగ్‌ రోజున పోలింగ్‌ కేంద్రం వద్ద ఎక్కువసేపు ఉండటమే ఆయన చేసిన తప్పని వైఎస్సార్‌ సీపీ నేత బొత్స సత్యనారాయణ మండిపడ్డారు. కోడెల చేసిన తప్పును వదిలేసి తమ నేతలపైన కేసులు పెట్టారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలింగ్‌ రోజు జరిగిన టీడీపీ దాడులపై వైఎస్సార్‌ సీపీ నేతలు ఆదివారం గుంటూరు ఎస్సీకి ఫిర్యాదు చేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. వైఎస్సార్‌ సీపీ శ్రేణులపై టీడీపీ నేతలు దాడులకు దిగారన్నారు.

టీడీపీ నేతలపై కాకుండా తమ పార్టీ నేతలపై కేసులు పెట్టారని తెలిపారు. తమ పార్టీ నేతలు ఫిర్యాదు చేసినా పోలీసులు కేసు నమోదు చేయలేదన్నారు. మేరుగ నాగార్జునపై హత్యాయత్నం జరిగిందని, కారు అద్దాలు ధ్వంసం చేశారని వెల్లడించారు. దాడి చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని ఎస్పీకి ఫిర్యాదు చేసినట్లు తెలిపారు.

బూత్‌ను క్యాప్చర్‌ చేసేందుకు కోడెల ప్రయత్నించారు
తెలుగుదేశం పార్టీ సీనియర్‌ నేత కోడెల శివప్రసాద్‌ పోలింగ్‌ రోజున పోలింగ్‌ కేంద్రంలోకి వెళ్లి తలుపులు వేసుకున్నారని వైఎస్సార్‌ సీపీ నేత అంబటి రాంబాబు ఆరోపించారు. బూత్‌ను క్యాప్చర్‌ చేసేందుకు కోడెల ప్రయత్నించారని అన్నారు. కోడెల తీరుపై ఇనిమెట్ల గ్రామస్తులు ఆందోళనకు దిగారని తెలిపారు. కోడెల అరాచకాలను అడ్డుకున్న గ్రామస్తులపై కేసులు పెట్టారని, విచారణ చేయకుండానే తమపై కేసులు పెట్టారన్నారు. గురజాలలో అధికార పార్టీకి మద్దతుగా పోలీసులు వ్యవహరిస్తున్నారని చెప్పారు. పోలీసులు నిష్పక్షపాతంగా విచారణ జరిపించాలని కోరారు.

మరిన్ని వార్తలు