నినాదాలు కాదు.. ప్రధానిపై ఒత్తిడితేవాలి

17 Apr, 2018 10:59 IST|Sakshi
చాడ వెంకట్‌రెడ్డిని అరెస్టు చేస్తున్న పోలీసులు

టీఆర్‌ఎస్‌ ఎంపీలకు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి సూచన

సాక్షి, రంగారెడ్డి జిల్లా: టీఆర్‌ఎస్‌ ఎంపీలు పార్లమెంటులో నినాదాలు చేస్తే సరిపోదని.. రాష్ట్రానికి దక్కాల్సిన అన్నింటినీ సాధించేందుకు ప్రధాని మోదీపై ఒత్తిడి తేవాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి అన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటై నాలుగేళ్లు గడిచినా ఏ ఒక్క సమస్యనూ సంపూర్ణంగా పరిష్కరించలేదన్నారు. నీళ్లు, నిధులు, నియామకాల పేరుతో గద్దెనెక్కిన టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఆచరణలో ఘోరంగా విఫలమైందని విమర్శించారు. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం తీసుకుంటున్న ప్రజావ్యతిరేక విధానాలను నిరసిస్తూ సీసీఐ ఆధ్వర్యంలో సోమవారం కలెక్టరేట్‌ వద్ద జైల్‌భరో నిర్వహించారు. ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు ర్యాలీగా కలెక్టరేట్‌కు బయలుదేరగా మార్గమధ్యంలో పోలీసులు అడ్డగించారు. కలెక్టరేట్‌ ముట్టడికి వెళ్లేందుకు యత్నించడంతో వారిని అరెస్ట్‌ చేశారు. అంతకుముందు జరిగిన సభలో చాడ మాట్లాడుతూ... ప్రధాని మోదీని సీఎం కేసీఆర్‌ గతంలో పొగడ్తలతో ముంచెత్తారని, మరి సమస్యలను పరిష్కరించాలని మోదీపై ఎందుకు ఆయన ఒత్తిడి తేవడం లేదని ప్రశ్నించారు. కమలనాథ్‌ కమిషన్‌ సిఫారసులను ఎందుకు అమలు చేయడం లేదన్నారు. బయ్యారంలో ఉక్కు ఫ్యాక్టరీని ఏర్పాటు చేయాలని ఆయన డిమాండ్‌ చేశారు.

ప్రజా సమస్యలు పరిష్కరించేంత వరకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై సీపీఐ యుద్ధం కొనసాగుతుందని స్పష్టం చేశారు. అరెస్టయిన వారిలో ప్రజానాట్య మండలి అధ్యక్షులు పల్లె నర్సింహ, గౌరవాధ్యక్షులు ఉప్పలయ్య, ప్రధాన కార్యదర్శి కన్న లక్ష్మీనారాయణ, ఏఐవైఎఫ్‌ ప్రదాన కార్యదర్శి అనిల్‌కుమార్, ఏఐఎస్‌ఎఫ్, అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు రావి శివరామవృష్ణ, వేణు తదితరులు ఉన్నారు. కార్యక్రమంలో సీపీఐ జిల్లా కార్యదర్శి పుస్తకాల నర్సింగరావు, సహాయ కార్యదర్శి పాల్మాకుల జంగయ్య, కార్యవర్గ సభ్యులు పానుగంటి పర్వతాలు, ఓరుగంటి యాదయ్య, యాదిరెడ్డి, అఫ్సర్, కావలి నర్సింహ తదితరులు పాల్గొన్నారు. 

మరిన్ని వార్తలు