ఆనంద్ మహీంద్ర దృష్టికి వినూత్న హాస్పిటల్‌

17 Apr, 2018 11:05 IST|Sakshi
ఆనంద్ మహీంద్ర ట్వీట్‌ చేసిన ఫోటో

సాక్షి,ముంబై: మహీంద్ర అండ్‌ మహీంద్రా కంపెనీ చైర్మన్ ఆనంద్ మహీంద్రా మరోసారి వార్తల్లోకి వచ్చారు. సోషల్‌ మీడియాలో తరచుగా యాక్టివ్‌గా ఉండే ఆయన తాజాగా ఒక సామాన్య  కార్మికుని పట్ల అనూహ్యంగా  స్పందించారు. తనకు వాట్సాప్‌ ద్వారా వచ్చిన మెసేజ్‌ను ట్విటర్‌లో పోస్ట్‌ చేయడంతో పాటు  వివరాలు తెలిస్తే..పెట్టుబడులు పెడతానంటూ  ఆనంద్‌ మహీంద్ర   ట్వీట్‌ చేశారు.  దేశంలో మైనర్‌ బాలికలపై జరుగుతున్న హత్యాచారాలపై  స్పందిస్తూ రేపిస్టుల పట్ల కటారిగా మారతానంటూ తీవ్ర  ఆగ్రహం  ప్రకటించిన ఆయన ఇపుడిలా దాతృత్వాన్ని వ్యక్తం చేయడం పలువురిని ఆకట్టుకుంటోంది. 

వివరాల్లోకి వెడితే ‘జఖ్మీ జూతోంకా హాస్పిటల్‌’ పేరుతో డా. నర్సీరాం అనే వ్యక్తి వినూత్నంగా చెప్పుల దుకాణాన్ని నడుపుకుంటున్నాడు. బూట్లు మరమ్మతు చేస్తానంటూ ఒక ఫ్లెక్సీని పెట్టి ప్రజల దృష్టిని ఆకర్షించాడు. ఇందులో పొద్దున్న, సాయంత్రం ఓపీ సమయం, భోజన విరామం తదితర వివరాలు పేర్కొనడం విశేషం. ఇదే ఆనంద్‌ మహీంద్రాను విపరీతంగా ఆకర్షించింది. ఇండియన్‌ మార్కెటింగ్‌ మేనేజ్‌మెంట్‌  సంస్థలో పాఠాలు బోధిస్తూ ఉండాల్సిన ఆయనంటూ నర్సీరాంను  కొనియాడారు.  

ఎవరైనా నర్సీరాంకు సంబంధించిన వివరాలు తెలియజేస్తే..ఈ స్టార్టప్‌ కంపెనీలో తాను పెట్టుబడులు పెడతానంటూ ఆనంద్‌ మహీంద్ర ట్వీట్‌ చేశారు. ఈ ట్వీట్‌కు ఆయన అభి​మానుల నుంచి స్పందన భారీగా వస్తోంది.  డా. నర్సీరం  హర్యానా జింద్‌ ప్రాంతానికి చెందినవారని ఓ ఫాలోవర్‌ స్పందించారు. దానికి సంబంధించిన ఒక వార్తాపత్రిక కథానాన్ని కూడా జోడించారు. దీని ప్రకారం డా. నర్సీరాం గత 20 సంవత్సరాలుగా ఈ వృత్తిలో ఉన్నారు.  మరి  ఈ డాక్టర్‌ గారిని ఎలాంటి అదృష్టం వరించనుందో చూడాలి.

గత ఏడాది కేరళకు చెందిన ఆటో డ్రైవర్‌  సునీల్‌ పాత  స్కార్పియో​ను ఆటోగా  ఆకర్షణీయంగా తీర్చిదిద్దిన  వైనానికి ముగ్దుడైన ఆనంద్‌ మహీంద్ర.. సునీల్‌ను వెదికి పట్టుకుని  ఆయన దగ్గరున్న పాత స్కార్పియో వాహనాన్ని తీసుకొని తన మ్యూజియంలో భద్రపర్చుకున్నారు. అంతే కాదు దీనికి బదులుగా సునీల్‌కు  కొత్త 4 వీలర్‌  ఆటోను కూడా అందించిన సంగతి తెలిసిందే.

మరిన్ని వార్తలు