ముఖ్యమంత్రులు కాదు.. ప్రజలు శాశ్వతం: సీపీఐ

24 Sep, 2019 16:11 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : వ్యవసాయ సంక్షోభం నేపథ్యంలో దేశవ్యాప్తంగా ఆక్టోబర్‌ 10 నుంచి 16 వరకు ఆందోళన కార్యక్రమం చేపట్టబోతున్నట్లు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌ రెడ్డి తెలిపారు. రెండు రోజులుగా సీపీఐ జాతీయ కార్యవర్గ సమావేశాలు కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో చాడ వెంకటరెడ్డి మాట్లాడుతూ.. ఈ సమావేశంలో అనేక అంశాలపై తీర్మానాలు చేశామని అన్నారు. నరేంద్రమోదీ ప్రధాని అయ్యాక దేశంలో తిరోగమనంలో వెళ్తుందని దుయ్యబట్టారు. గోదావరి నీళ్లు కృష్ణా నదిలోకి తరలించడం మంచి నిర్ణయమని.. కానీ అందరి అభిప్రాయాలను తీసుకొని నిర్ణయాలు తీసుకోవాలని చాడ వెంకట్ రెడ్డి సూచించారు. 

ముఖ్యమంత్రులు శాశ్వతం కాదని, ప్రజలు శాశ్వతంగా ఉంటారని అన్నారు. ప్రజల అభిష్టానికి విరుద్ధంగా పని చేస్తే  పతనం తప్పదని హెచ్చరించారు. యురేనియం తవ్వకాలను సీపీఎం పార్టీ వ్యతిరేకిస్తుందని, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు యురేనియం తవ్వకాలకు సంబంధించిన పనులను నిలిపివేయాని పేర్కొన్నారు. యురేనియం వెలికితీత కారణంగా మానవ మనుగడకే ప్రమాదకరమని, కృష్ణా నది నీళ్లు సైతం కలుషితమవుతాయని తెలిపారు. దీనిపై పెద్ద ఎత్తున సీపీఐ ఆందోళన కార్యక్రమం చేపడుతుందని ఆపార్టీ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్ రెడ్డి స్పష్టం చేశారు.

మరిన్ని వార్తలు