హక్కులను కాలరాస్తున్న ప్రభుత్వాలు: చాడ

14 Jul, 2018 02:04 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలో కేసీఆర్‌ ప్రభుత్వాలు ప్రజల హక్కులను కాలరాస్తున్నాయని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి ఆరోపించారు. శుక్రవారం హైదరాబాద్‌లోని ఎంబీ భవన్‌లో వామపక్షాల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా చాడ మాట్లాడుతూ.. శాంతి భద్రతల పేరుతో సినీ విమర్శకుడు కత్తి మహేశ్‌ను, స్వామి పరిపూర్ణనందను హైదరాబాద్‌ నుంచి బహిష్కరించడాన్ని ఖండిస్తున్నామని చెప్పారు.

ఎటువంటి అంశాలపై అయినా చర్చకు అవకాశం ఉండాలన్నారు. నిరంకుశంగా బహిష్కరించడం సరికాదన్నారు. ఈ సమావేశంలో పలు తీర్మానాలు చేశారు. పశ్చిమబెంగాల్, త్రిపుర రాష్ట్రాల్లో టీఎంసీ, బీజేపీ ప్రభుత్వాలు చేస్తున్న దాడులకు జూలై 24ను నిరసన దినంగా పాటిస్తున్నట్లు తెలిపారు. ఆదివాసీల హక్కులు, పోడు భూములను కాపాడుకోవాలనే డిమాండ్‌తో జూలై 26న సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో రాష్ట్ర సదస్సు నిర్వహించనున్నట్లు వెల్లడించారు. సమావేశంలో సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రంతో పాటు పలువురు వామపక్ష పార్టీల నేతలు పాల్గొన్నారు. 

మరిన్ని వార్తలు