చేతనైతే ఉద్యమాలకు సహకరించండి

15 Apr, 2018 19:08 IST|Sakshi
చలసాని శ్రీనివాస్‌

సాక్షి, హైదరాబాద్‌: అవిశ్వాస తీర్మానాలు, ఆమరణ దీక్షపై కనీసం స్పందించని కేంద్ర ప్రభుత్వ తీరుకు నిరసనగా ఆంధ్రప్రదేశ్‌ బంద్‌కు పిలుపునిచ్చామని ఏపీ ప్రత్యేక హోదా సాధన సమితి కన్వీనర్‌ చలసాని శ్రీనివాస్‌ తెలిపారు. ప్రత్యేక కోసం ఢిల్లీలో ఆమరణ దీక్ష చేసిన వైఎస్సార్‌ సీపీ ఎంపీల పట్ల కేంద్రం దారుణంగా వ్యవహరించిందన్నారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. వైఎస్సార్‌ సీపీ, వామపక్షాలు, ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలు ఇప్పటికే సోమవారం(ఏప్రిల్‌16) జరగనున్న బంద్‌కు మద్దతు ప్రకటించాయని తెలిపారు.

బంద్‌లు రాష్ట్రాభివృద్ధికి అడ్డంకని సీఎం చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానిం​చడంపై ఆయన మండిపడ్డారు. బాబు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు బంద్‌లు చేయలేదా అని ప్రశ్నించారు. చేతనైతే ఉద్యమాలకు సహకరించండి లేకుంటే తీవ్ర పరిణామాలు ఉంటాయని చలసాని హెచ్చరించారు. ఈ బంద్‌లో జాతీయ పరీక్షలు రాసే విద్యార్థులకు ఆటంకం కలిగించొద్దని ఆయన తెలిపారు.

అంతేకాక రాష్ట్ర స్థాయి పరీక్షలు వాయిదా వేయాలని మంత్రి గంటా శ్రీనివాసరావును కోరామన్నారు. తమ బంద్‌ భవిష్యత్‌ తరాలకు, విద్యార్థుల ఉద్యోగాల కోసమే అన్నారు. సోమవారం జరగనున్న ఈ రాష్ట్ర బంద్‌కు ప్రతి ఒక్కరూ సహకరించాలని చలసాని కోరారు.

మరిన్ని వార్తలు