బీజేపీ, జనసేన పొత్తు తప్పుకాదు

19 Jan, 2020 05:07 IST|Sakshi

భీమవరం: బీజేపీ, జనసేన పొత్తు పెట్టుకోవడం తప్పుకాదని ప్రతిపక్ష నేత చంద్రబాబు అన్నారు. ఆ రెండు పార్టీలు రాజధానిని అమరావతి నుంచి తరలించకుండా అడ్డుకోవాలని కోరారు. అమరావతి పరిరక్షణ యాత్రలో భాగంగా శనివారం పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలో చంద్రబాబు మాట్లాడారు. శివరామకృష్ణ కమిటీ రాజధాని ఏర్పాటుకు విజయవాడ, గుంటూరు జిల్లాలకు ప్రథమ ప్రాధాన్యత ఇవ్వడం వల్లే 29 వేల మంది రైతుల నుంచి 33 వేల ఎకరాలు సేకరించామన్నారు. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి బోగస్‌ కమిటీల నివేదికలతో అమరావతి నుంచి రాజధానిని విశాఖపట్నం తరలించడానికి కుట్ర చేస్తున్నారని విమర్శించారు.

విశాఖలో వైఎస్సార్‌సీపీ నేతలు కొనుగోలు చేసిన భూముల విలువ పెంచుకోవడానికే ఈ నిర్ణయం తీసుకున్నారన్నారు. ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం పోలీసులనే కాదు ఎవరినైనా ఎదిరిస్తానని వెల్లడించారు. రాష్ట్రంలో అభివృద్ధి కానరావడం లేదని.. పోలవరం పనులు నిలిచిపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో తుగ్లక్‌ పాలన సాగుతోందని.. పాలకులు ప్రజల జీవితాలతో ఆడుకుంటున్నారని విమర్శించారు. ముందుగా చంద్రబాబు జోలె పట్టి అమరావతి ఉద్యమానికి నిధులు ఇచ్చి సహకరించాలని కోరినా ప్రజల నుంచి స్పందన లభించలేదు.

నేడు టీడీఎల్పీ సమావేశం 
సాక్షి, అమరావతి: తెలుగుదేశం పార్టీ శాసనసభాపక్ష సమావేశం ఆదివారం చంద్రబాబు అధ్యక్షతన మంగళగిరి ఎన్టీఆర్‌ భవన్‌లో జరగనుంది. 20వ తేదీన అసెంబ్లీ సమావేశం జరగనున్న దృష్ట్యా అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించేందుకు ఈ సమావేశం ఏర్పాటు చేశారు. మూడు రాజధానులపై అసెంబ్లీలో ప్రభుత్వాన్ని ఎలా ఇరుకున పెట్టాలి, ఏంచేయాలనే దానిపై ఈ సమావేశంలో నిర్ణయిస్తామని టీడీపీ నేత ఒకరు తెలిపారు. పార్టీపై తిరుగుబాటు చేసిన ఎమ్మెల్యేలు వల్లభనేని వంశీ, మద్దాల గిరిలకు విప్‌ జారీ చేశారు. అసెంబ్లీలో సోమవారం ఓటింగ్‌ జరిగితే పార్టీకి అనుకూలంగా ఓటు వేయాలని పేర్కొన్నారు.  
ఎన్టీఆర్‌ వర్థంతి: ఎన్టీఆర్‌ 24వ వర్థంతి సందర్భంగా మంగళగిరి టీడీపీ కార్యాలయంలో సభ జరిగింది. ఎన్టీఆర్‌ విగ్రహానికి పూలమాల వేసి చంద్రబాబు నివాళులర్పించారు. 

మరిన్ని వార్తలు