ఐఏఎస్‌లకు ఏం తెలుసు?

9 May, 2020 04:02 IST|Sakshi

ప్రభుత్వ యంత్రాంగంపై ప్రతిపక్ష నేత చంద్రబాబు విమర్శలు 

ఐఏఎస్‌ల కమిటీ ఏం చేస్తుంది?

వాళ్లకి సబ్జెక్ట్‌ నాలెడ్జ్‌ ఏముంటుంది?

అచ్చెన్నాయుడుతో త్రిసభ్య కమిటీ వేస్తున్నా

రూ.కోటి పరిహారం సరిపోతుందా?  

గ్యాస్‌ లీకేజీని ముఖ్యమంత్రి లైట్‌గా తీసుకున్నారు 

విశాఖలో గ్యాస్‌ లీకేజీ దుర్ఘటనపై ఐదుగురు ఐఏఎస్‌ అధికారులతో కమిటీ వేస్తే వాళ్లేం చేస్తారు? ఐఏఎస్‌ అధికారులకు సబ్జెక్ట్‌ తెలుసా? సైంటిఫిక్, టెక్నికల్‌ అంశాలు వాళ్లకి తెలియవు. వాళ్ల గురించి నాకు తెలియదా? ఇన్నేళ్లు రాజకీయాల్లో ఉన్న నాకే స్టైరీన్‌ అంటే ఏంటో తెలియదు. ఇక ఐఏఎస్‌లకు ఏం తెలుస్తుంది. నేను ఉండిఉంటే నేరుగా ఫ్యాక్టరీలోకే వెళ్లేవాడిని.    
– చంద్రబాబు, ప్రతిపక్ష నేత

సాక్షి, అమరావతి: విశాఖలో గ్యాస్‌ లీకేజీ దుర్ఘటనపై ఐదుగురు ఐఏఎస్‌ అధికారులతో కమిటీ వేస్తే వాళ్లేం చేస్తారని ప్రతిపక్ష నేత  చంద్రబాబు వ్యాఖ్యానించారు. ఐఏఎస్‌ అధికారులకు సబ్జెక్ట్‌ తెలుసా? అని ప్రశ్నించారు. సైంటిఫిక్, టెక్నికల్‌ అంశాలు వాళ్లకి తెలియవన్నారు. వాళ్ల గురించి తనకు తెలియదా? అని ప్రశ్నించారు. ఇన్నేళ్లు రాజకీయాల్లో ఉన్న తనకే స్టైరీన్‌ అంటే ఏంటో తెలియదని, ఇక ఐఏఎస్‌లకు ఏం తెలుస్తుందన్నారు. మేధావులు దీనిపై అధ్యయనం చేయాలన్నారు. శుక్రవారం హైదరాబాద్‌ నుంచి ఏపీలో ఎంపిక చేసిన మీడియాతో ఆయన ఆన్‌లైన్‌లో మాట్లాడారు. చంద్రబాబు ఇంకా ఏమన్నారంటే..

ప్రపంచంలో ఎక్కడా జరగలేదు..
► కోటి రూపాయలతో మనిషి మళ్లీ బతికివస్తాడా? రూ.కోటి సరిపోతాయా? డబ్బులివ్వమని ఎవరైనా అడిగారా?
► గ్యాస్‌ లీకేజీ ఘటనను సీఎం చాలా లైట్‌గా తీసుకున్నారు. ఆయనది అవగాహనా లోపం. తూతూమంత్రంగా ఒక కమిటీ వేస్తే ఎలా? నిపుణులతో అధ్యయనం చేయించాలి. బాధితుల ఆరోగ్య సంరక్షణను కొద్దికాలం పరిశీలించి చూడాలి. 
► ఘటనపై నిజ నిర్ధారణ కోసం టీడీపీ తరఫున అచ్చెన్నాయుడు, చినరాజప్ప, నిమ్మల రామానాయుడితో త్రిసభ్య కమిటీని నియమిస్తున్నాం.
► ఇది మామూలు ప్రమాదం కాదు. ఇంతవరకూ ఇలాంటి ప్రమాదం ప్రపంచంలో ఎక్కడా జరగలేదు. దీన్ని ప్రభుత్వం హ్యాండిల్‌ చేసిన విధానం చూసి చాలా బాధేసింది. 
► ఒక నేరం జరిగినప్పుడు బాధితులను దృష్టిలో పెట్టుకుని చూడాలి తప్ప ఫ్యాక్టరీని దృష్టిలో పెట్టుకోకూడదు. అవగాహనా రాహిత్యం ఉంది. అందుకే హైకోర్టు ఈ కేసును సుమోటోగా తీసుకుంది. ఎన్‌జీటీ కూడా సుమోటోగా తీసుకుని రూ.50 కోట్లు డిపాజిట్‌ చేయమంది. వెంటనే ఫ్యాక్టరీని మూసివేయాలి. అవసరమైతే వేరేచోటకి మార్చాలి. 

నిపుణులతో మాట్లాడా..
► ఈ సీఎం ఎవరు చెప్పినా వినరు. ఇలాంటప్పుడు పదిమందితో మాట్లా డాలి. నేను ఉండుంటే నేరుగా ఫ్యాక్ట రీలోకే వెళ్లేవాడిని. ఒకవేళ గ్యాస్‌ ప్రభా వం ఉంటే తగ్గాకే వెళ్లాలి. ఎవరితోనూ మాట్లాడ కుండా కలెక్టర్‌ చెప్పాడని ఏదో చెప్పేస్తే ఎలా? 
► ఇందులో మీ సొంత పాండిత్యం ఏమిటి? సబ్జెక్ట్‌ నిపుణులతో కమిటీ వేయాలి. 
► సీఎంలు అన్నింటిలో నిపుణులు కాదు. ఇది అధికార, పరిపాలనా యంత్రాంగం వైఫల్యం.     
► గ్యాస్‌ లీకేజీపై నేను చాలామంది సబ్జెక్ట్‌ నిపుణులతో మాట్లాడా. ఇది మానవ తప్పిదమా? సాంకేతిక ప్రమాదమా అనేది తేల్చాలి. 
► లాక్‌డౌన్‌ తర్వాత ప్రమాదకరమైన ఇలాంటి ఫ్యాక్టరీని తెరిచేటప్పుడు తనిఖీ చేసి అనుమతి ఇవ్వాల్సింది.
► ఈ ఘటన తర్వాత రాత్రి నాకు నిద్ర రాలేదు. అక్కడికి ఎందుకు వెళ్లలేకపోయానా అని బాధపడ్డా. వెళ్లేందుకు ఇంకా ప్రయత్నిస్తూనే ఉన్నా. కేంద్రం అనుమతి కోరా. అనుమతి ఎప్పుడు వస్తే అప్పుడు వెళతా. 

>
మరిన్ని వార్తలు