కృషి అంతా నాదే..

10 Nov, 2018 04:04 IST|Sakshi

ఎన్డీఏ వ్యతిరేక పక్షాలను ఏకం చేస్తున్నా: సీఎం చంద్రబాబు

చెన్నైలో డీఎంకే అధ్యక్షుడు స్టాలిన్‌తో బాబు భేటీ

సాక్షి ప్రతినిధి, చెన్నై:  దేశంలో ఎన్డీఏ వ్యతిరేక పక్షాలను ఏకం చేసేందుకు తానొక్కడినే కృషి చేస్తున్నానని సీఎం చంద్రబాబు చెప్పారు. చంద్రబాబు శుక్రవారం రాత్రి చెన్నైలో డీఎంకే అధ్యక్షుడు స్టాలిన్‌ను కలిసి సుమారు గంటపాటు చర్చలు జరిపారు.

అనంతరం చంద్రబాబు మీడియాతో మాట్లాడుతూ ప్రధాని మోదీ తీరుతో ప్రజాస్వామ్యం ప్రమాదకర పరిస్థితిలో పడిందన్నారు. దేశంలో వ్యవస్థలకు స్వేచ్ఛ లేకుండా పోయిందని, కేంద్ర ప్రభుత్వం మితిమీరిన జోక్యంతో ఆర్బీఐ గవర్నర్‌ కూడా వైదొలగాల్సిన పరిస్థితి నెలకొందని విమర్శించారు. సీబీఐ, ఈడీ వ్యవస్థలను సైతం ప్రతిపక్షాలను బెదిరించేందుకు వినియోగించుకుంటున్నారని ఆరోపించారు. ఆఖరికి గవర్నర్‌ను కూడా వాడుకుంటున్నారని ధ్వజమెత్తారు.

మోదీ కంటే స్టాలిన్‌ సమర్థుడు
మహాకూటమిలో కొన్ని పార్టీల మధ్య అభిప్రాయ భేదాలున్నా దేశ ప్రయోజనాల దృష్ట్యా కలసి నడుస్తామని చంద్రబాబు పేర్కొన్నారు. ‘మాకు 40 ఏళ్లుగా కాంగ్రెస్‌ పార్టీతో విభేదాలుండేవి. వాటిని మరిచి నేను సర్దుకుపోయినట్లే అందరూ సర్దుకుపోతారు. మహాకూటమిని నడిపించేందుకు ఎందరో సమర్థ నాయకులున్నారు. నరేంద్ర మోదీ కంటే స్టాలిన్‌ ఎంతో సమర్థుడు. కేంద్ర ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టేందుకు ఢిల్లీ మీడియా భయపడుతోంది.

ఏపీలో నేను, పశ్చిమ బెంగాల్‌లో మమతా బెనర్జీ, తమిళనాడులో స్టాలిన్, కర్ణాటకలో దేవెగౌడ ఎంతో బలమైన నాయకులం. కర్ణాటక, తమిళనాడు మధ్య విబేధాల్లేవు. తమిళనాడుకు అవసరమైన తాగునీటిని కృష్ణా, గోదావరి నుంచి ఇచ్చేందుకు మేం సిద్ధంగా ఉన్నాం. కరుణానిధి హయాం నుంచే డీఎంకేతో నాకు మంచి సంబంధాలున్నాయి’ అని పేర్కొన్నారు. పర్యటనలో చంద్రబాబు వెంట మంత్రులు యనమల రామకృష్ణుడు, నక్కా ఆనందబాబు, కళావెంకట్రావు, ఎంపీ సీఎం రమేష్‌ తదితరులున్నారు.

నేడు బాబుతో అశోక్‌ గెహ్లాట్‌ భేటీ
సాక్షి, అమరావతి: కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, రాజస్థాన్‌ మాజీ సీఎం అశోక్‌ గెహ్లాట్‌ శనివారం చంద్రబాబుతో సమావేశం కానున్నారు. సాయంత్రం 5 గంటలకు ఉండవల్లిలోని సీఎం నివాసంలో వీరు సమావేశమవుతారు. రాహుల్‌ బృందంలో కీలక సభ్యుడిగా ఉన్న గెహ్లాట్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడి దూతగా అమరావతికి వస్తున్నారు. తెలంగాణలో కాంగ్రెస్‌ పార్టీ ఎన్నికల ఖర్చును చంద్రబాబే భరిస్తున్నట్లు వార్తలు వచ్చిన నేపథ్యంలో ఈ భేటీ ప్రాధాన్యం సంతరించుకుంది. కాంగ్రెస్‌ కేంద్ర ఎన్నికల కమిటీ ఆమోదించిన తెలంగాణ కాంగ్రెస్‌ అభ్యర్థుల జాబితాను చంద్రబాబుకు చూపించి ఆయన ఆమోదం తీసుకోడానికే గెహ్లాట్‌ అమరావతికి వస్తున్నట్టు సమాచారం.

మరిన్ని వార్తలు