గంటాకు ఎసరు?

10 Mar, 2019 04:47 IST|Sakshi

భీమిలి సీటు లోకేష్‌కిస్తానంటున్న బాబు

అలిగి వెళ్లిపోయిన మంత్రి

సాక్షి, అమరావతి : మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావుకు చంద్రబాబు తనదైన శైలిలో ఎసరు పెట్టారు. ఆయన ప్రాతినిథ్యం వహిస్తున్న విశాఖ జిల్లా భీమిలి స్థానంలో తన కొడుకు, ఐటీ మంత్రి లోకేష్‌ను పోటీ చేయించేందుకు పావులు కదుపుతుండడంతో ఆయన కంగుతిన్నారు. ఉండవల్లిలో శుక్రవారం జరిగిన విశాఖ పరిధిలోని పార్లమెంటు నియోజకవర్గాల సమీక్షలో భీమిలి సీటును చంద్రబాబు ఆయనకు ఖరారు చేయలేదు. ఈ స్థానంలో లోకేష్‌ పోటీ చేస్తారని ఆయన కోసం త్యాగం చేయాల్సి ఉంటుందని స్పష్టం చేశారు.

కుదిరితే విశాఖపట్నం ఎంపీ లేదా విశాఖ నార్త్, చోడవరం, గాజువాక అసెంబ్లీలో ఒక దాన్ని కేటాయించే విషయాన్ని పరిశీలిస్తానని చెప్పారు. దీంతో అవాక్కయిన గంటా జిల్లాలో సిట్టింగ్‌ ఎమ్మెల్యేలు పలువురికి సీటు ఖరారు చేసి తన సీటును పెండింగ్‌లో పెట్టడంపై అసంతృప్తితో అక్కడి నుంచి వెళ్లిపోయారు. సీటు కేటాయించే విషయంపై చర్చల కోసం శనివారం ఉదయం మళ్లీ రావాలని చంద్రబాబు సూచించినా.. గంటా వెళ్లలేదు. తన మొబైల్‌ను స్విచ్‌ ఆఫ్‌ చేసి పార్టీ ముఖ్యులకు అందుబాటులోకి రాలేదు. మరోవైపు లోకేష్‌ భీమిలిలో పోటీచేస్తే ఆయన తోడల్లుడు భరత్‌ భవితవ్యం ప్రశ్నార్థకంగా మారనుంది. భరత్‌ విశాఖ ఎంపీగా పోటీ చేస్తారని చాలా రోజుల నుంచి టీడీపీ వర్గాలు ప్రచారం చేస్తున్నాయి. ఇప్పుడు లోకేష్‌ పేరు తెరపైకి రావడంతో భరత్‌ ఆశలపై నీళ్లుచల్లినట్లయింది. 

మరిన్ని వార్తలు