కేసీఆర్‌ సభ: భారీవర్షంతో అనూహ్య పరిణామం

17 Oct, 2019 14:46 IST|Sakshi

సాక్షి, సూర్యాపేట : ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు గురువారం హుజూర్‌నగర్ పట్టణంలో తలపెట్టిన భారీ బహిరంగ సభకు వరుణుడు అడ్డు తగిలాడు. హుజూర్‌నగర్‌లో గురువారం మధ్యాహ్నం భారీ వర్షం కురవడంతో  సీఎం కేసీఆర్‌ సభ రద్దయింది. హుజూర్‌ నగర్‌ ఉప ఎన్నిక ప్రచారానికి సీఎం కేసీఆర్‌ వస్తుండటంతో అధికార టీఆర్‌ఎస్‌ పార్టీ అత్యంత ప్రతిష్టాత్మకంగా ఏర్పాట్లు చేసింది. పెద్ద ఎత్తున జనసమీకరణను చేపట్టింది. సభా ప్రాంగణానికి ఇప్పటికే పార్టీ శ్రేణులు, ప్రజలు తరలివచ్చారు. అయితే, ఈ క్రమంలో గురువారం మధ్యాహ్నం ఒక్కసారిగా వర్షం విరుచుకుపడింది. గంటసేపటి నుంచి కుండపోతగా వర్షం కురుస్తుండటంతో సభాప్రాంగణం అస్తవ్యస్తంగా మారిపోయింది. సభా ప్రాంగణంలో నీళ్లు చేరి.. బురదమయంగా అయింది. దీంతో ప్రజలను, పార్టీ కార్యకర్తలను ఇబ్బందిపెడుతూ.. సభ నిర్వహించడం కుదరదని గ్రహించిన టీఆర్‌ఎస్‌ సీఎం కేసీఆర్‌ సభను రద్దు చేసింది.

హుజూర్‌ నగర్‌ ఉప ఎన్నికల ప్రచారం చివరి అంకానికి చేరుకున్న సంగతి తెలిసిందే. ప్రచారానికి ఇంకా రెండు రోజుల గడువు మాత్రమే ఉంది. ఇప్పటికే ఇక్కడ ప్రధాన పార్టీలు హోరాహోరీగా ప్రచారం చేస్తున్నాయి. ఈ క్రమంలో హుజూర్‌నగర్‌లో సీఎం కేసీఆర్‌ సభకు టీఆర్‌ఎస్‌ పెద్ద ఎత్తున ప్లాన్లు వేసింది. వారం రోజులుగా ఈ సభపైనే టీఆర్‌ఎస్‌ నేతలు ప్రత్యేక దృష్టి సారించారు. సీఎం సభ ఏర్పాట్లను మంత్రులు గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి, సత్యవతి రాథోడ్, పార్టీ ముఖ్య నేతలు దగ్గరుండి పరిశీలించారు. అన్ని ఏర్పాట్లు పూర్తయి.. మధ్యాహ్నం ఒంటి గంటకు సీఎం కేసీఆర్‌ హైదరాబాద్‌ నుంచి హెలికాప్టర్‌లో నేరుగా హుజూర్‌నగర్‌ చేరుకుంటారనే తరుణంలో వరుణుడి రాకతో సభకు బ్రేక్‌ పడింది.

మరిన్ని వార్తలు