రోజూ పెడబొబ్బలు.. ఆ పార్టీకి డిపాజిటే గల్లంతైంది : కేసీఆర్‌

24 Oct, 2019 16:43 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: హుజూర్‌నగర్‌ ఉప ఎన్నికలో టీఆర్‌ఎస్‌ పార్టీకి అఖండ మెజారిటీతో విజయాన్ని అందించిన ప్రజలకు ఆ పార్టీ అధినేత, సీఎం కే చంద్రశేఖర్‌రావు ధన్యవాదాలు తెలిపారు. ఈ ఎన్నిక రాష్ట్ర ప్రభుత్వాన్ని మార్చగలిగే కీలక తీర్పు కాకపోయినా.. పనిచేసే ప్రభుత్వానికి ఇదొక టానిక్‌లా పనిచేస్తుందని అన్నారు. ఇదొక కీలక ఉప ఎన్నిక అని, ఈ ఎన్నికలో అద్భుతమైన ఫలితాన్ని ప్రజలు ఇచ్చారని కొనియాడారు. హుజూర్‌నగర్‌లో టీఆర్‌ఎస్‌ అభ్యర్థి సైడిరెడ్డి గెలుపొందిన నేపథ్యంలో కేసీఆర్‌ తెలంగాణ భవన్‌లో విలేకరులతో మాట్లాడారు.

ప్రతిపక్షాలు తమ పంథా మార్చుకోవాలి
హుజూర్‌నగర్‌ ఉప ఎన్నికలో ప్రతిపక్షాలు చాలా దుష్ప‍్రచారం చేశాయని, తమపై నీలాపనిందలు వేశారని కేసీఆర్‌ అన్నారు. అధికారం ఎవరికీ శాశ్వతం కాదని, పచ్చి అబద్ధాలతో ప్రజలను గోల్‌మాల్‌ చేసే రాజకీయాలు చేయడం మంచిది కాదని కేసీఆర్‌ ప్రతిపక్షాలకు సూచించారు. తలాతోక లేని ఆరోపణలు చేస్తే బూమరాంగ్‌ అవుతుందని హెచ్చరించారు. ఏదిపడితే అది మాట్లాడితే.. ఇష్టానుసారంగా ఆరోపణలు చేస్తే ప్రజలు ఆమోదించబోరని హుజుర్‌నగర్‌ ఫలితాలు చాటుతున్నాయన్నారు. ఇప్పటికైనా ప్రతిపక్షాలు తమ పంథా మార్చుకుంటే మంచిదన్నారు. ప్రతిపక్షం ఉంటేనే మంచిదని, అది నిర్మాణాత్మకంగా ఉండాలని సూచించారు.

బీజేపీకి డిపాజిట్‌ కూడా గల్లంతయినట్టు తెలుస్తోందని, రోజూ ఆ పార్టీ పెట్టే పెడబొబ్బలకు, అరుపులకు.. ఆ పార్టీకి వచ్చిన ఓట్లకు మధ్య పోలిక చూసుకుంటే.. నవ్వాలో, ఏడ్వాలో అర్థం కావడం లేదని ఎద్దేవా చేశారు. ప్రజలు అన్ని గమనిస్తున్నారని, వ్యక్తిగతంగా, చీప్‌ విమర్శలు చేయడం, ఇష్టమొచ్చినట్టు మాట్లాడటం మంచి పద్ధతి కాదన్నారు. రాజకీయాల్లో సహనం మంచిదని, అహంభావం, అహంకారం మంచిది కాదని అన్నారు. హుజూర్‌నగర్‌లో గెలుపుతో తమపై బాధ్యత పెరిగిందని, టీఆర్‌ఎస్‌ శ్రేణులు కూడా ఎవరూ అహంభావానికి లోనుకాకుండా మరింతగా కష్టపడాలని సూచించారు.

ఎల్లుండి థ్యాంక్స్‌ సభ
ఇప్పుడు హుజూర్‌నగర్‌లో సుమారు 43వేల మెజారిటీతో సైదిరెడ్డి విజయం సాధించారని, గతంలో ఏడువేల ఓట్ల తేడాతో ఈ సీటులో తాము ఓడిపోయామని అన్నారు. తాజా ఫలితాలతో దాదాపు 50వేల ఓటర్లు టీఆర్‌ఎస్‌ వైపు మొగ్గుచూపారని తేలిందని, హుజూర్‌నగర్‌ ప్రజలు ఆశలు, ఆకాంక్షలు నెరవేరుస్తామని అన్నారు. హుజూర్‌నగర్‌ ప్రజలకు కృతజ్ఞతలు తెలిపేందుకు ఎల్లుండి (శనివారం) సాయంత్రం టీఆర్‌ఎస్‌ సభ నిర్వహిస్తోందని, ఈ సభలో తాను పాల్గొని ప్రజలకు థ్యాంక్స్‌ చెప్తానని తెలిపారు.

మరిన్ని వార్తలు