మాపై కోపమెందుకు అన్నా: కుమారస్వామి

28 May, 2019 11:09 IST|Sakshi

కాంగ్రెస్‌ ఎమ్మెల్యేతో సీఎం కుమారస్వామి

సాక్షి, బెంగళూరు : ‘ఎందుకన్నా.. మాపై కోపమా, రా అన్న మాతో కలవండి, మీకు ఏమి సహాయం కావాలో చేద్దాం, ఇలా మధ్యలో విడచిపెట్టి వెళ్లవద్దు. మీ సమస్య ఏదైనా ఉంటే చెప్పండి’ అంటూ ముఖ్యమంత్రి కుమారస్వామి అథణి కాంగ్రెస్‌ ఎమ్మెల్యే మహేశ్‌ కుమటెళ్లికి విన్నవించిన సంఘటన సోమవారం విధానసౌధలో జరిగింది. మాజీ ప్రధాని పండిట్‌ జవహర్‌లాల్‌ నెహ్రూ వర్ధంతి సందర్భంగా విధానసౌధలో జరిగిన కార్యక్రమానికి మహేశ్‌ కూడా వచ్చారు. ఈ సందర్భంగా సీఎం కుమారస్వామి, డిప్యూటీ సీఎం పరమేశ్వర్ ఇద్దరు కలిసి మహేశ్‌ను పక్కనే ఉన్న ఉద్యానవనంలోకి తీసుకెళ్లి మాట్లాడారు. ఆయనను ఒప్పించే పనిలోపడ్డారు. ఈ ఘటన రాజకీయంగా అత్యంత ప్రాముఖ్యతను సంతరించుకొంది.

ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రితో భేటీ తరువాత మహేశ్‌ కుమటెళ్ళి విలేకరులతో మాట్లాడారు. ‘అథణి నియోజకవర్గంలో ఉన్న కృష్ణా నదిలో నీరులేదు. నియోజకవర్గ ప్రజలకు మహారాష్ట్ర నుంచి తాగునీరు విడుదల చేయించే విషయమై ముఖ్యమంత్రిని కలిసా, మినహాయించి ఇందులో ఎలాంటి ప్రత్యేకత లేదు అని పేర్కొన్నారు. తాను కాంగ్రెస్‌ పార్టీలోనే ఉంటానని, కాంగ్రెస్‌ నుంచి వైదొలగనని తెలియజేసిన ఆయన, కొన్ని చానల్స్‌లో తాను గోవాలో ఉన్నానని చూపిస్తున్నారు. ఇలాంటి తప్పుడు సమాచారాన్ని మీడియాలో ప్రసారం చేయరాదన్నారు. మాజీ మంత్రి రమేశ్‌ జారకిహొళ్ళి మాజీ ముఖ్యమంత్రి ఎస్‌.ఎం.కృష్ణను కలుసుకున్న సంగతి తనకు తెలియదని, తామెవ్వరు కాంగ్రెస్‌ను విడచి వెళ్లమన్నారు. తమలో ఎలాంటి భిన్నాభిప్రాయాలు లేవని అన్నారు.   

మరిన్ని వార్తలు