గోల షురూ!

8 Sep, 2018 09:40 IST|Sakshi
ముషీరాబాద్‌లో ఓ కార్యక్రమంలో పాల్గొన్న నాయిని నర్సింహారెడ్డిని ముషీరాబాద్‌ టికెట్‌పై ఆరాతీస్తున్న పార్టీ నాయకులు, కార్యకర్తలు

టీఆర్‌ఎస్‌ అభ్యర్థులపై నిరసన వెల్లువ  

సొంత పార్టీ కార్పొరేటర్ల.. తిరుగు‘బావుటా’

కూకట్‌పల్లి, శేరిలింగంపల్లి, కుత్భుల్లాపూర్‌లలో ముసలం

వీడని ముషీరాబాద్‌ చిక్కుముడి

అవసరమైతే తానే పోటీచేస్తానంటున్న నాయిని చర్చిద్దామన్న సీఎం కేసీఆర్‌

సాక్షి, సిటీబ్యూరో: నగరంలో తెలంగాణ రాష్ట్ర సమితి ఎమ్మెల్యే అభ్యర్థులపై అసమ్మతి భగ్గుమంటోంది. ఎక్కడికక్కడ విభేదాలు రచ్చకెక్కెతున్నాయి. ముషీరాబాద్‌ సీటు విషయంలో చిక్కుముడి అలాగే ఉండగా...తన అల్లుడు శ్రీనివాసరెడ్డికి టిక్కెట్‌ ఇప్పించేందుకు హోం మంత్రి నాయిని నర్సింహారెడ్డి స్వయంగా రంగంలోకి దిగారు. అవసరమైతే తానే ఇక్కడి నుంచి పోటీ చేస్తానని ప్రకటించారు. ఈ మేరకు సీఎం కేసీఆర్‌ను ఫోన్‌లో సంప్రదించగా...చర్చిద్దామని సూచించినట్లు సమాచారం. ఇక కొన్నిచోట్ల అదే పార్టీకార్పొరేటర్లు తిరుగుబాటు బావుటా ఎగరేశారు. వచ్చే సాధారణ ఎన్నికల్లో తాము పోటీ చేసి తీరుతామని ప్రకటించారు. కూకట్‌పల్లిలో బాలాజీనగర్‌ కార్పొరేటర్‌ కావ్య భర్త హరీష్‌రెడ్డి, శేరిలింగంపల్లిలో మాదాపూర్‌ కార్పొరేటర్‌ జగదీశ్వర్‌గౌడ్‌లు శుక్రవారం పార్టీ తీరుపై తీవ్ర నిరసన వ్యక్తం చేశారు.

కుత్బుల్లాపూర్‌లో నియోకజవర్గ ఇన్‌చార్జి కొలను హన్మంతరెడ్డి, జూబ్లీహిల్స్‌లో మురళీగౌడ్‌ (2014లో టీఆర్‌ఎస్‌అభ్యర్థి)లు సైతం పోటీకి సిద్ధమని ప్రకటించారు. కూకట్‌పల్లి నియోకవర్గంలో హరీష్‌రెడ్డితో పాటు గొట్టిముక్కల పద్మారావు, వెంకటేశ్వరరావులు సైతం తాజా మాజీ ఎమ్మెల్యే కృష్ణారావు అభ్యర్థిత్వాన్ని తీవ్రంగా  వ్యతిరేకించాలని నిర్ణయానికి వచ్చారు. వీరిలో హరీష్‌రెడ్డి ఏకంగా స్వతంత్య్ర అభ్యర్థిగా తానే పోటీ చేస్తానన్న ప్రకటన కూడా విడుదల చేశారు. శేరిలింగంపల్లి నియోజకవర్గంలో సైతం తాజా మాజీ ఎమ్మెల్యే గాంధీ అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకిస్తూ టీఆర్‌ఎస్‌కే చెందిన మాదాపూర్‌ కార్పొరేటర్‌ జగదీశ్వర్‌గౌడ్‌ అనుచరులతో శుక్రవారం సమావేశం నిర్వహించి, వారం రోజుల్లో అభ్యర్థిని మార్చాల్సిందేనని అల్టిమేటం జారీ చేశారు. జగదీశ్వర్‌గౌడ్‌ సతీమణి పూజిత హఫీజ్‌పేట కార్పొరేటర్‌గా వ్యవహరిస్తున్నారు. ఇక కుత్బుల్లాపూర్‌లో నియోకవర్గ ఇన్‌చార్జి కొలను హన్మంతరెడ్డి తాను పోటీ చేయటం ఖాయమని శుక్రవారం ప్రకటించారు.  

మల్కాజిగిరి, మేడ్చల్‌లో హైడ్రామా
మల్కాజిగిరి, మేడ్చల్‌ శాసనసభ స్థానాల విషయంలో హైడ్రామా కొనసాగుతోంది. మల్కాజిగిరి సీటును తొలుత తాజా మాజీ ఎమ్మెల్యే కనకారెడ్డి కోడలు చింతల విజయశాంతికి ఖరారు చేశారు. ఎమ్మెల్సీ మైనంపల్లి హన్మంతరావు సహా ఐదుగురు కార్పొరేటర్లు అభ్యంతరం తెలపటంతో అధికారిక ప్రకటనను వాయిదా వేశారు.

తనకే టికెట్‌ ఇవ్వాలని మైనంపల్లి పట్టుపడుతుండగా,సీఎం కేసీఆర్‌ మాత్రం చింతల కనకారెడ్డి కుటుంబానికి ఇచ్చేందుకే సుముఖంగా ఉన్నట్లు విశ్వసనీయవర్గాల కథనం. సీటు కనకారెడ్డికా లేదా ఆయన కోడలుకా అన్న విషయాన్ని తేల్చే బాధ్యతను ఆయన సమీప బంధువు, రాష్ట్ర మంత్రి ఈటల రాజేందర్‌కు అప్పగించారు. మేడ్చల్‌ నియోకజవర్గంలోనూ సస్పెన్స్‌ సాగుతోంది. ఎంపీ మల్లారెడ్డి పోటీ చేసేందుకు సంసిద్ధత వ్యక్తం చేస్తుండటంతో ఆయన వైపే సీఎం మొగ్గు చూపే అవకాశం ఉందని సమాచారం. తాజా మాజీ ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి సైతం రెండవ జాబితాలో తన పేరు ఖచ్చితంగా ఉంటుందన్న నమ్మకంతో ఉన్నారు.

ముషీరాబాద్‌ కిరికిరి..
నగర రాజకీయాల్లో కీలక స్థానమైన ముషీరాబాద్‌ అభ్యర్థిత్వం టీఆర్‌ఎస్‌ రాజకీయాల్లో ఉత్కంఠ రేపుతోంది. ఈ స్థానాన్ని తన సమీప బంధువు, కార్పొరేటర్‌ శ్రీనివాసరెడ్డికి ఇవ్వాలని కోరుతున్న హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి, అది సాధ్యపడక పోతే తానే పోటీ చేస్తానని శుక్రవారం ప్రకటించారు. ఈ స్థానం నుండి 2014లో ముఠా గోపాల్‌ పోటీ చేసి బీజేపీ అభ్యర్థి లక్ష్మణ్‌ చేతిలో ఓటమి పాలయ్యారు. వచ్చే ఎన్నికల్లో కూడా తనకే అవకాశం ఇవ్వాలని గోపాల్‌ కోరుతున్నారు. తన అభ్యర్థిత్వాన్ని ప్రకటించాలని కోరేందుకు గోపాల్‌ శుక్రవారం హుస్నాబాద్‌ వెళ్లి బహిరంగసభ వద్ద సీఎంను కలిసే ప్రయత్నం చేశారు. ఇదే విషయమై హోంమంత్రి నాయిని ముఖ్యమంత్రిని ఫోన్‌లో సంప్రదించగా శనివారం రావాలని, చర్చించి ఓ నిర్ణయం తీసుకుందామని చెప్పినట్లు సమాచారం.

మరిన్ని వార్తలు