ఆల్‌ ఈజ్‌ ఇన్‌ వెల్‌...

15 Dec, 2017 12:24 IST|Sakshi

శరద్‌ యాదవ్‌ వేటుపై చర్చకు కాంగ్రెస్‌ పట్టు

అవసరం లేదన్న స్పీకర్

వెల్‌లోకి దూసుకెళ్లిన సభ్యులు

సాక్షి, న్యూఢిల్లీ : పార్లమెంట్‌ శీతాకాల సమావేశాల ప్రారంభం రోజే పెద్దల సభ దద్దరిల్లింది. తమ పార్టీ రాజ్యసభ ఎంపీలపై జేడీయూ అధినేత నితీశ్ కుమార్‌ అనర్హత వేటు వేసిన వ్యవహారంపై రాజ్యసభలో దుమారం రేగింది. 

సీనియర్‌ నేత శరద్‌ యాదవ్‌కు మద్దతుగా కాంగ్రెస్‌ సభ్యులు సభలో చర్చలేవనెత్తారు. శరద్‌ పై అనర్హత వేటు తప్పన్న కాంగ్రెస్‌ నేత గులాంనబీ ఆజాద్‌..  నితీశ్‌ కుమార్‌ రాజీనామాకు డిమాండ్‌ చేశారు. ఒకదశలో సభ ఛైర్మన్‌ వెంకయ్యనాయుడు(ఉపరాష్ట్రపతి) ఈ అంశంపై చర్చ అవసరం లేదని ప్రకటించటంతో అసంతృప్తికి లోనైన కాంగ్రెస్‌ నేతలు ఒక్కసారిగా వెల్‌లోకి దూసుకెళ్లారు. దీంతో ఆయన సభను కాసేపు వాయిదా వేశారు. కాగా, ఈ నేతలిద్దరూ తమ పార్టీ ఆదేశాలను ధిక్కరించి, ప్రతిపక్ష పార్టీల కార్యక్రమాలకు హాజరయ్యారని, తద్వారా వారు స్వచ్ఛందంగా తమ సభ్యత్వాలను వదులుకున్నారని రాజ్యసభ చైర్మన్‌కు జేడీయూ విన్నవించింది. దీని ఆధారంగా శరద్ యాదవ్‌తోపాటు అలీ అన్వర్‌ను రాజ్యసభ సభ్యత్వానికి అనర్హులుగా ప్రకటిస్తూ ఈ నెల 4న రాజ్యసభ ఆదేశాలు జారీ చేసింది.

ఇక తమపై పడిన వేటు గురించి మాజీ అధ్యక్షుడు శరద్ యాదవ్ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. రాజ్యసభ సభ్యత్వానికి తనను అనర్హుడిగా ప్రకటిస్తూ జారీ అయిన ఆదేశాలను రద్దు చేయాలని కోరారు. రాజ్యసభ సభ్యత్వానికి అనర్హత వేటు వేసే ముందు తన వాదనను వినిపించేందుకు కూడా అవకాశం ఇవ్వలేదని పిటిషన్‌లో ఆయన తెలిపారు.  

ప్రాసతో వెంకయ్య... 

ఈ గందరగోళం నడుమ కూడా చైర్మన్‌ వెంకయ్యనాయుడు తన వాక్ చాతుర్యం చూపించటం విశేషం. వెల్‌లోకి దూసుకొచ్చిన సభ్యులను ఉద్దేశించి.. ఆల్‌ ఇన్‌ వెల్‌.. నాట్‌ వెల్‌... (అంతా వెల్‌లోకి రావటం బాగా లేదు) అంటూ రైమింగ్‌తో సభను వాయిదావేశారు.

తిరిగి సభ ప్రారంభం కాగా, ప్రధాని మోదీ గుజరాత్‌ ఎన్నికల ప్రచారంలో చేసిన వ్యాఖ్యల అంశం లేవనెత్తటంతో మరోసారి సభలో గందరగోళం చెలరేగి సభ మధ్యాహ్నాం 2గం.30ని. కి వాయిదా పడింది. గుజరాత్‌ ఎన్నికల కోసం మాజీ ప్రధాని మన్మోహన్‌, ఇతర కాంగ్రెస్‌ నేతలు పాకిస్థాన్‌తో చేతులు కలిపారంటూ మోదీ ప్రసంగించిన విషయం తెలిసిందే. ఇవి సాధారణ ఆరోపణలు కాదని కాంగ్రెస్‌ పార్టీ చెబుతోంది.

మరిన్ని వార్తలు