శాలువాలు కప్పి లడ్డూలు ఇస్తే లొంగుతారా?

3 Nov, 2018 12:26 IST|Sakshi

సాక్షి, వైస్సార్‌ జిల్లా : కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, మాజీ మంత్రి సి. రామచంద్రయ్య ఆ పార్టీకి రాజీనామా చేశారు. చంద్రబాబుతో కాంగ్రెస్‌ పొత్తు పెట్టుకోవడానికి నిరసనగా రాజీనామా చేస్తున్నానని రామచంద్రయ్య ప్రకటించారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడూ.. చంద్రబాబుకు ఒక సిద్ధాంతం అనేది లేదని, ఆయన ఎవరితోనైనా కలుస్తారని విమర్శించారు. చంద్రబాబు అవకాశ రాజకీయాలను తాము సమర్థించాల్సిన అవసరం ఏంటని రాహుల్‌ గాంధీని ప్రశ్నించారు. కాంగ్రెస్‌ను భూస్థాపితం చేస్తానన్న చంద్రబాబుతో పొత్తుపెట్టుకోవడం దారుణమన్నారు. 

చంద్రబాబుతో పొత్తు నైతికంగా టీడీపీకి ఊతమివ్వడం తప్పా కాంగ్రెస్‌కు ఎలాంటి ఉపయోగం లేదన్నారు. ఢిల్లీకి వచ్చి శాలువాలు కప్పి లడ్డూలు ఇస్తే చంద్రబాబుకు లొంగుతారా అని రాహుల్‌ను ప్రశ్నించారు. 23 మంది ఎమ్మెల్యేలను అడ్డగోలుగా కొనుగోలు చేసిన చంద్రబాబు.. ప్రజాస్వామ్యం గురించి మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు. చంద్రబాబు అవినీతికి అంతులేకుండా పోయిందని విమర్శించారు. జన్మభూమి కమిటీలతో రాజ్యాంగ స్పూర్తిని దెబ్బదీశారన్నారు. ఓటుకు కోట్లు కేసులో ఆధారాలతో అడ్డంగా దొరికిన చంద్రబాబుతో కాంగ్రెస్‌ ఎలా పొత్తు పెట్టుకుందని విమర్శించారు. చంద్రబాబు పాపాలను భూజాన వేసుకోవాల్సిన ఖర్మ తనకు లేదన్నారు. మరోసారి అవినీతి పార్టీని అధికారంలోకి తీసుకురావాడానికి చేస్తున్న ప్రయత్నానికి నిరసనగా  రాజీనామా చేస్తున్నానని రామచంద్రయ్య పేర్కొన్నారు.

టీడీపీ ఎఫెక్ట్‌; కాంగ్రెస్‌కు వరుస దెబ్బలు

మరిన్ని వార్తలు