ఠాక్రే సర్కారుకు షాక్‌!

5 Jan, 2020 03:41 IST|Sakshi
అబ్దుల్‌ సత్తార్‌, కైలాష్‌ గోరంట్యాల్‌

సహాయమంత్రి సత్తార్‌ రాజీనామా?

అదే బాటలో తెలుగు ఎమ్మెల్యే కైలాష్‌ గోరంట్యాల్‌

సాక్షి, ముంబై: మహారాష్ట్రలోని మహావికాస్‌ అఘాడి ప్రభుత్వానికి తలనొప్పులు మొదలయ్యాయి. శివసేన చీఫ్, మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్‌ఠాక్రే కేబినెట్‌లో సహాయ మంత్రిగా ఉన్న అబ్దుల్‌ సత్తార్‌ రాజీనామా చేశారన్న వార్తలు శనివారం కలకలం రేపాయి. అదేవిధంగా, కాంగ్రెస్‌ నేత, తెలుగు ఎమ్మెల్యే కైలాష్‌ గోరంట్యాల్‌ కూడా రాజీనామా ఇవ్వనున్నారని తెలిసింది. జాల్నా ఎమ్మెల్యే అయిన గోరింట్యాల్‌ ఇటీవలి మంత్రివర్గ విస్తరణలో చోటు ఆశించారు. అది లభించక పోవడంతోనే అసంతృప్తితో రాజీనామా నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది.

  మంత్రి మండలి విస్తరణ అనంతరం ఐదురోజులు తిరగకుండానే శివసేన నేత, సహాయ మంత్రి అబ్దుల్‌ సత్తార్‌ తన మంత్రి పదవికి రాజీనామా చేశారు. కేబినెట్‌ హోదా లభించలేదన్న అసంతృప్తితోనే ఆయన రాజీనామా చేసినట్లు తెలిసింది. దీనికితోడు, ఔరంగాబాదులో శివసేనకు ఆరుగురు ఎమ్మెల్యేలుండగా కాంగ్రెస్‌కు ఒక్కరూ లేరు. జిల్లా పరిషత్‌తో శివసేనకు చెందిన 18 మంది సభ్యులుండగా కాంగ్రెస్‌కు 10 మంది సభ్యులున్నారు. ఈ నేపథ్యంలో జిల్లా పరిషత్‌ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు అధ్యక్ష పదవి ఇచ్చేందుకు శివసేన నిర్ణయం తీసుకుంది.

దీనిపై ముందుగా తనతో చర్చించలేదని అబ్దుల్‌ సత్తార్‌ ఆగ్రహంతో ఉన్నట్లు తెలిసింది. అందుకే సహాయ మంత్రి పదవికి రాజీనామా చేసినట్టు భావిస్తున్నారు. ఈ సంఘటన ముఖ్యమంత్రి ఉద్దవ్‌ ఠాక్రే ప్రభుత్వంతోపాటు శివసేనకు తొలి షాక్‌గా చెప్పవచ్చు. కాగా, శివసేన నేత చంద్రకాంత్‌ ఖైరే అబ్దుల్‌ సత్తార్‌ను ద్రోహి అంటూ తీవ్రంగా మండిపడ్డారు. ఔరంగాబాద్‌ జిల్లా పరిషత్‌ ఎన్నికల్లో ఆయన అనుచరులు సంకీర్ణ అభ్యర్థికి మద్దతు ఇవ్వలేదని ఆరోపించారు. ఆయనను మళ్లీ పార్టీలోకి తీసుకోవద్దని అధిష్టానాన్ని కోరారు.  

సీఎంతో నేడు సత్తార్‌ భేటీ  
రాజీనామా వార్తలు ఉదయం నుంచి రాష్ట్ర వ్యాప్తంగా రాజకీయ దుమారాన్ని లేపగా దీనిపై అబ్దుల్‌ సత్తార్‌ మాత్రం స్పందించలేదు. దీంతో సాయంత్రం వరకు సందిగ్ధం కొనసాగింది. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఆదివారం మధ్యాహ్నం 12.30 గంటలకు సీఎం ఉద్ధవ్‌ ఠాక్రేతో భేటీ ఉందని, అనంతరమే ఒక ప్రకటన చేస్తానని తెలిపారు.

మరిన్ని వార్తలు