విజయదుందుభి మోగించిన కాంగ్రెస్‌

18 Dec, 2017 08:05 IST|Sakshi

చండీఘడ్‌ : పంజాబ్‌ స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ విజయపతాకం ఎగరవేసింది. ఈ ఏడాది ప్రథమార్థంలో జరిగిన సాధారణ ఎన్నికల్లో గెలుపొందిన కాంగ్రెస్‌ పార్టీ.. ఆదివారం జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో సైతం సత్తా చాటింది. జలంధర్‌, పటియాలా, అమృతసర్‌లలో జరిగిన మున్సిపల్‌ ఎన్నికల్లో గెలుపొందింది. 

స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపుపై మాట్లాడిన పంజాబ్‌ ముఖ్యమంత్రి అమరీందర్‌ సింగ్‌.. కాంగ్రెస్‌ పార్టీ పాలసీలకు ప్రజలు మరోసారి పట్టం కట్టారని అన్నారు. విద్వేషపూరిత భావజాలాన్ని ప్రచారం చేస్తున్న ప్రతిపక్షానికి మున్సిపల్‌ ఎన్నికల తీర్పు చెంపపెట్టు అని వ్యాఖ్యానించారు. కాగా, ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ విజయంపై ప్రతిపక్షాలు పలు ఆరోపణలు గుప్పించాయి.

కాంగ్రెస్‌ పార్టీ ప్రభుత్వ వనరులను దుర్వినియోగం చేసిందని, పటియాలలో భారీగా రిగ్గింగ్‌కు పాల్పడిందని బీజేపీ, అకాళీదళ్‌ల కూటమి ఆరోపించింది. జలంధర్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌లో 80 స్థానాలకు గాను 66 స్థానాల్లో కాంగ్రెస్‌ విజయం సాధించగా.. బీజేపీ, అకాళీదళ్‌ల కూటమి 12 స్థానాలను మాత్రమే కైవసం చేసుకుంది. రెండు చోట్ల స్వతంత్ర అభ్యర్థులు విజయం సాధించారు.

పటియాలాలో 60 సీట్లకు గాను 58 సీట్లను కాంగ్రెస్‌ గెలుచుకుంది. అమృతసర్‌లో సైతం కాంగ్రెస్‌ హవా నడిచింది. మొత్తం 85 స్థానాల్లో 63 స్థానాలను అధికార కాంగ్రెస్‌ పార్టీ దక్కించుకుంది. 


 

మరిన్ని వార్తలు