మజ్లిస్‌తో ఢీ

2 Mar, 2019 10:06 IST|Sakshi
అజహరుద్దీన్‌ , ఫిరోజ్‌ఖాన్‌, సోహెల్‌

హైదరాబాద్‌ లోక్‌సభ స్థానంపై కాంగ్రెస్‌ గురి

మజ్లిస్‌ను దెబ్బతీసేందుకు పకడ్బందీ వ్యూహం

పరిశీలనలో ముగ్గురి అభ్యర్థిత్వాలు  

అజహరుద్దీన్‌ను దింపితే ఫలితం ఉంటుందని విశ్లేషణ

సాక్షి, సిటీబ్యూరో: మజ్లిస్‌ పార్టీ కంచుకోట హైదరాబాద్‌ లోకసభ స్థానాన్ని బద్దలు కొట్టేందుకు కాంగ్రెస్‌ పార్టీ తీవ్ర కసరత్తు చేస్తోంది. కాంగ్రెస్‌తో బద్ధ శత్రువైఖరి అవలంబిస్తున్న మజ్లిస్‌ను సొంత గడ్డపైనే ఓడించాలని పకడ్బందీ వ్యూహం పన్నుతోంది. ఇందుకోసం ఆ పార్టీ అధినేత అసదుద్దీన్‌ ఒవైసీని గట్టిగా ఎదుర్కొనే శక్తిసామర్థ్యాలున్న బలమైన అభ్యర్థిని రంగంలోకి దింపాలని యోచిస్తోంది. ఇప్పటికే హైదరాబాద్‌ లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేసేందుకు పార్టీలోని సుమారు 39 మంది పీసీసీకి దరఖాస్తు చేసుకున్నారు. టీపీసీసీ ఇప్పటికే దరఖాస్తులను వడపోసి ముగ్గురు పేర్లను ఏఐసీసీ స్క్రీనింగ్‌ కమిటీకి ప్రతిపాదించినట్లు తెలుస్తోంది.

అందులో కాంగ్రెస్‌ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్, మాజీ క్రికెటర్‌ అజహరుద్దీన్, అసెంబ్లీ ఎన్నికల్లో నాంపల్లి నియోజకవర్గం నుంచి పోటీ చేసి స్వల్ప ఓట్ల తేడాతో ఓటమి పాలైన ఫిరోజ్‌ ఖాన్, టీపీసీసీ మైనారిటీ సెల్‌ చైర్మన్‌ షేక్‌ అబ్దుల్లా సోహెల్‌ పేర్లు ఉన్నట్లు తెలుస్తోంది. వాస్తవంగా హైదరాబాద్‌ లోక్‌ సభ నియోజకవర్గం విస్తరించి ఉన్న అసెంబ్లీ స్థానాల్లో ఒకటి మినహా ఆరు నియోజకవర్గాలకు మజ్లిస్‌ ప్రాతినిధ్యం వహిస్తోంది. గట్టిపట్టు కూడా ఉంది. మరోవైపు లోక్‌సభ నియోజకవర్గం నుంచి ఆ పార్టీ అధినేత అసదుద్దీన్‌ ఓవైసీ వరుసగా విజయం సాధిస్తూ వస్తున్నారు. త్వరలో జరగబోయే ఎన్నికల్లో కూడా హైదరాబాద్‌ లోక్‌సభ నియోజకవర్గం నుంచి అసదుద్దీన్‌ పోటీ చేయనున్నారు. దీంతో బలమైన అభ్యర్థిని బరిలోకి దింపాలని కాంగ్రెస్‌ యోచిస్తోంది.

అసద్‌ను ఢీ కొట్టేదెవరు..?
మజ్లిస్‌ అధినేత అసదుద్దీన్‌కు గట్టి పోటీ ఇవ్వాలంటే...ఈ నియోజకవర్గంలో ముస్లిం సామాజిక ఓటర్లు అధికంగా ఉన్న కారణంగా అదే సామాజిక వర్గానికి చెందిన వ్యక్తిని బరిలోకి దింపాల్సి ఉంటుంది. కాంగ్రెస్‌ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్, మాజీ క్రికెటర్‌ అజహరుద్దీన్‌ బరిలోకి దింపితేనే గట్టి పోటీ ఇచ్చే అవకాశం ఉందని కాంగ్రెస్‌ భావిస్తోంది.  గతేడాది నవంబర్‌లో ముందస్తు ఎన్నికల సమయంలో అజహరుద్దీన్‌ కాంగ్రెస్‌ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌గా నియామకమయ్యారు. 2009లో ఉత్తర ప్రదేశ్‌లోని మొరాదాబాద్‌ లోక్‌సభ నియోజకవర్గం నుంచి అజహరుద్దీన్‌ గెలుపొందారు. 2014 లోక్‌సభ ఎన్నికల్లో టోంక్‌ సవాయి మదోపూర్‌ నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు  అధిష్టానం హైదరాబాద్‌ లోక్‌ సభ స్థానం నుంచి ఆయనను బరిలోకి దింపాలని భావిస్తుండగా, ఆయన మాత్రం సికింద్రాబాద్‌లోక్‌ సభ స్థానం నుంచి పోటీకి ఆసక్తి కనబర్చుతున్నారు. మరోవైపు ముంబయి సెంట్రల్‌ నుంచి బరిలో దిగుతారని అక్కడి పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. ఇదిలా ఉండగా ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో స్వల్ప ఓట్ల తేడాతో ఓటమి పాలైన ఫిరోజ్‌ ఖాన్‌ అభ్యర్థిత్వం కూడా కాంగ్రెస్‌ పార్టీ పరిశీలిస్తోంది.

ఇప్పటికే నాంపల్లి అసెంబ్లీ స్థానం నుంచి ముచ్చటగా మూడు పర్యాయాలు బరిలో దిగి స్వల్ప ఓట్ల తేడాతో అపజయం పాలయ్యారు. హైదరాబాద్‌ లోక్‌ సభ పరిధిలోకి నాంపల్లి నియోజకవర్గం రానప్పటికీ పోటీకి ఆసక్తి కనబర్చుతున్నారు. తాజాగా టీపీసీసీ మైనారిటీ సెల్‌ చైర్మన్‌ షేక్‌ అబ్దుల్లా సోహెల్‌ పేరు కూడా వినవస్తోంది. లోక్‌సభ ఎన్నికల్లో హైదరాబాద్‌ స్థానం నుంచి అసదుద్దీన్‌పై సోహెల్‌ బరిలో దిగుతారని సోషల్‌ మీడియా పోస్టులు హల్‌చల్‌ చేస్తున్నాయి. సోహెల్‌ అభ్యర్థిత్వం ఖాయమని, అధికారిక ప్రకటనే తరువాయి అని ప్రచారం కొనసాగుతోంది. అయితే అధిష్టానవర్గం బరిలో ఎవరిని దింపనుందో వేచిచూడాల్సిందే.

మరిన్ని వార్తలు