హుడాకు థ్యాంక్స్‌ చెప్పిన కాంగ్రెస్‌

8 Dec, 2018 18:52 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: సర్జికల్‌ దాడులపై లెఫ్టినెంట్‌ జనరల్‌(రిటైర్డ్‌) డీఎస్‌ హుడా చేసిన వ్యాఖ్యలను కాంగ్రెస్‌ పార్టీ తమకు అనుకూలంగా మలచుకుంది. ప్రధాని నరేంద్ర మోదీ, బీజేపీపై విమర్శనాస్త్రాలు సంధించింది. సర్జికల్‌ దాడులను రాజకీయంగా వాడుకున్నారని, అతిగా ప్రచారం చేశారని హుడా వ్యాఖ్యానించారు. 2016, సెప్టెంబర్‌ 29న భారత భద్రతా బలగాలు సరిహద్దు  దాటి పాకిస్తాన్‌లోని తీవ్రవాద తండాలపై ఆకస్మిక దాడులు చేసిన సంగతి తెలిసిందే. సర్జికల్‌ దాడులు జరిగినప్పుడు ఆర్మీ నార్త్‌ కమాండ్‌ చీఫ్‌గా ఆయన ఉన్నారు. కాగా, ఈ దాడులకు సంబంధించిన వీడియోలు ఈ ఏడాది సెప్టెంబర్‌లో బహిర్గతమయ్యాయి. ఈ నేపథ్యంలో హుడా వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.

హుడా వ్యాఖ్యలపై కాంగ్రెస్‌ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ స్పందించారు. ఆయన నిజమైన సైనికుడిలా మాట్లాడారని ప్రశంసించారు. సర్జికల్‌ దాడులను వ్యక్తిగత ప్రయోజనాల కోసం వాడుకున్న వారు ఏమాత్రం సిగ్గుపడటం లేదని పరోక్షంగా ప్రధాని మోదీని విమర్శించారు. ‘ నిజమైన సైనికుడిలా మాట్లాడారు. మిమ్మల్ని చూసి దేశం గర్విస్తోంది. మన సైన్యాన్ని సొంత ఆస్తిలా వాడుకునేందుకు మిస్టర్‌ 36 మాత్రం ఏమాత్రం సిగ్గుపడటం లేదు. సర్జికల్‌ దాడులను ఆయన రాజకీయ స్వలాభం కోసం ఉపయోగించుకున్నారు. రఫేల్‌ ఒప్పందంలో అక్రమాలకు పాల్పడి అనిల్‌ అంబానీకి రూ. 30 వేల కోట్లు లబ్ది చేకూర్చార’ని రాహుల్‌ గాంధీ ట్వీట్‌ చేశారు.
 

సర్జికల్‌ దాడులను తన రాజకీయ ప్రయోజనాలకు వాడుకున్న ప్రధాని మోదీ బండారాన్ని బయటపెట్టినందుకు కాంగ్రెస్‌ నాయకుడు రణదీప్‌ సూర్జెవాలా కూడా హుడాకు ధన్యవాదాలు తెలిపారు. సైనికుల త్యాగాలను రాజకీయాల కోసం వాడుకోవడం తగదన్నారు. దేశ భద్రతను ప్రమాదంలో పడేసిన మోదీ దోషి అని ట్వీట్‌ చేశారు. తన స్వార్థం కోసం వ్యూహాత్మక ప్రయోజనాలను తాకట్టు పెట్టారని ఆరోపించారు.

మరిన్ని వార్తలు