మధ్యాహ్నం బీజేపీకి జై.. రాత్రి సొంతగూటికి..

12 Oct, 2018 04:39 IST|Sakshi
పద్మినీరెడ్డికి బీజేపీ కండువా కప్పుతున్న కె. లక్ష్మణ్‌(ఉదయం 9 గం.), పద్మినికి కాంగ్రెస్‌ కండువా కప్పుతున్న టీపీసీసీ నాయకురాలు ఇందిరా శోభన్‌ (రాత్రి 9 గం.)

కమల దళంలో చేరిన గంటల వ్యవధిలోనే తిరిగి సొంత గూటికి దామోదర రాజనర్సింహ సతీమణి

భర్త, కార్యకర్తల ఒత్తిడితో వెనుకడుగు

కీలక సమయంలో పార్టీకి, వ్యక్తిగతంగా నష్టం చేయొద్దని బుజ్జగింపు

హైడ్రామా మధ్య సుఖాంతమైన పార్టీ మార్పు అంశం

పద్మిని బీజేపీలో చేరేలా పావులు కదిపిన ఓ ఆధ్యాత్మికవేత్త, బీజేపీ ఎమ్మెల్యే

కమలం పార్టీ నేతల్లోనూ అయోమయం

సాక్షి, హైదరాబాద్‌: కాంగ్రెస్‌ పార్టీ తెలంగాణ మేనిఫెస్టో కమిటీ చైర్మన్, మాజీ ఉప ముఖ్యమంత్రి దామోదర రాజ నర్సింహ సతీమణి పద్మినీ రెడ్డి పార్టీ మార్పు అంశం లో నాటకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి. అనూహ్యకర పరిస్థితుల్లో గురువారం మధ్యాహ్నం బీజేపీ తీర్థం పుచ్చుకున్న పద్మిని.. రాత్రికల్లా తిరిగి కాంగ్రెస్‌ గూటికే చేరారు. ప్రధాని నరేంద్ర మోదీ చేపట్టిన కార్యక్రమాలు నచ్చే బీజేపీలో చేరుతున్నట్లు ప్రకటించిన గంటల వ్యవధిలోనే.. నిర్ణయం మార్చు కున్నారు. తన భర్త దామోదర రాజనర్సింహ, కార్యకర్తల మనోవేదనను అర్థం చేసుకొని తిరిగి కాంగ్రెస్‌లో కొనసాగాలని నిర్ణయించుకున్నట్లు ప్రకటించారు. అటు, పద్మిని పార్టీ మార్పుతో కలవరం చెందిన కాంగ్రెస్‌ నేతలు, కార్యకర్తలు.. కథ సుఖాంతం కావడంతో ఊపిరి పీల్చుకున్నారు.

అనూహ్యంగా బీజేపీలోకి!
రాజకీయంగా ఎలాంటి ముందస్తు ప్రకటన లేకుండా అనూహ్యంగా పద్మినీరెడ్డి  గురువారం బీజేపీ కండువా కప్పుకున్నారు. మధ్యాహ్నం 12 గంటలకు హైదరాబాద్‌లోని బీజేపీ కార్యాలయంలో రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్, జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్‌రావు సమక్షంలో ఆమె బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. లక్ష్మణ్‌ బీజేపీ కండువా కప్పి ఆమెను పార్టీలోకి ఆహ్వానించారు. ఈ చేరికపై మీడియా, బీజేపీలోని కీలక నేతలు, జిల్లా నేతలకు కూడా ఎలాంటి సమాచారం లేదు. దీంతో ఈ వార్తలు మొదట బీజేపీ నేతలనే ఆశ్చర్యానికి గురిచేశాయి. ప్రముఖ ఆ«ధ్యాత్మికవేత్త, బీజేపీ ఎమ్మెల్యే ఒకరు పద్మినీ రెడ్డి.. బీజేపీలో చేర్చే దిశగా పావులు కదిపినట్టు సమాచారం. పద్మిని చేరిక సందర్భంగా బీజేపీ అధ్యక్షుడు లక్ష్మణ్‌.. ఆమె చేసిన సేవలను కొనియాడారు. సామాజిక సేవలో ముందుండే పద్మినీ రెడ్డి అనేక కార్యక్రమాలు చేపట్టారని, సేవా రంగంలో ఆమెకు మంచి పేరుందని ప్రశంసించారు. ఆమె రాకతో పార్టీకి ఎంతో మేలు చేకూరుతుందన్నారు. ఆమె సేవలను బీజేపీ తప్పకుండా వినియోగించుకుంటుందని లక్ష్మణ్‌ పేర్కొన్నారు.

కొండగట్టులో మొక్కులు తీర్చుకొని, బీజేపీ గెలుపు కోసం ప్రార్థించి నేరుగా పార్టీ కార్యాలయానికి వచ్చి పద్మినీ రెడ్డి తమ పార్టీలో చేరారని చెప్పారు. బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్‌రావు మాట్లాడుతూ జీర్ణ దేవాలయాల పునరుద్ధరణలో పద్మిని చేసిన కృషి మరువలేమన్నారు. ఆమె చేరికతో తెలంగాణలో బీజేపీ బలోపేతమవుతందన్నారు. ప్రధాని మోదీ చేపట్టిన సంక్షేమ పథకాల, ప్రజోపయోగ కార్యక్రమాలు నచ్చే బీజేపీలో చేరానని పద్మినీ రెడ్డి వెల్లడించారు. గతంలో తాను కాంగ్రెస్‌ టికెట్‌ అడిగిన మాట వాస్తవమేనని.. అయితే ఈసారి మాత్రం టికెట్‌ ఆశించట్లేదన్నారు. సంగారెడ్డి నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీకి చేస్తారా? అని ప్రశ్నించగా.. ‘అవకాశం ఇస్తే పోటీ చేస్తాన’న్నారు. కాంగ్రెస్‌ సీనియర్‌ నేత అయిన తన భర్త (రాజనర్సింహ)పై ఎటువంటి ప్రభావం చూపుతుందనే విషయమై మాట్లాడబోనన్నారు.

కాంగ్రెస్‌లో కలకలం..
పద్మినీ రెడ్డి బీజేపీలో చేరడంతో కాంగ్రెస్‌ పార్టీని విస్మయానికి గురిచేసింది. అటు పార్టీ వర్గాలు కూడా విస్మయానికి గురయ్యాయి. తెలంగాణలో పార్టీని అధికారంలోకి తేవడమే లక్ష్యంగా, మేనిఫెస్టో తయారీలో దామోదర బిజీగా ఉన్న సమయంలో ఈ పరిణామం చోటచేసుకోవడంతో వారంతా షాక్‌కు గురయ్యారు. సంగారెడ్డి నుంచి కాంగ్రెస్‌ తరఫున బరిలో దిగాలని పద్మిని భావించారని.. అది కుదిరే అవకాశాలు లేకపోవడంతోనే (కుటుంబం నుంచి ఒకరికే టికెట్‌ ఇవ్వాలన్న అధిష్టానం నిర్ణయంతో) ఆమె బీజేపీలో చేరారనే ప్రచారం జరిగింది. ఈ పరిణామం వ్యక్తిగతంగా దామోదరకు, పార్టీకి ఇబ్బంది పెట్టే అంశమేనని గాంధీభవన్‌లో చర్చ జరిగింది. ఇదంతా జరుగుతున్న సమయంలో ఆందోల్‌ నియోజకవర్గంలో పర్యటిస్తున్న దామోదరతో పార్టీ సీనియర్లు మాట్లాడారు. ఆయనకు సన్నిహితంగా ఉండే నేతలను ఆయన వద్దకు పంపి పార్టీకి నష్టం కలగకుండా చూడాలని కోరారు. దీనిపై వివరణ ఇచ్చిన దామోదర.. ఆమెది తొలి నుంచీ స్వతంత్రంగా వ్యహరించే మనస్తత్వమని పేర్కొన్నారు. అయినా పార్టీకి నష్టం జరుగకుండా చూస్తానని వారికి హామీ ఇచ్చారు.

కార్యకర్తల ఒత్తిడితోనే
ఈ అంశమై వెంటనే రంగంలోకి దిగిన దామోదర రాజనర్సింహ హైదరాబాద్‌లో ఉన్న పద్మినితో ఫోన్‌లో మట్లాడారు. కీలక సమయంలో పార్టీ మార్పుతో వ్యక్తిగతంగా తనకు, పార్టీకి ఎదురయ్యే ఇబ్బందులను వివరించారు. పార్టీ కార్యకర్తల మనోస్థైర్యాన్ని దెబ్బతీయొద్దని కోరారు. ఇదే సమయంలో ఆందోల్‌ నియోజకవర్గం నుంచి సుమారు వెయ్యి మందికి పైగా కార్యకర్తలు వాహనాల్లో హైదారాబాద్‌లోని పద్మిని నివాసానికి చేరుకొని ఆమె వద్ద తమ ఆవేదన వ్యక్తం చేశారు. కొందరు మహిళా కార్యకర్తలు కన్నీరుపెట్టుకున్నారు. కీలక సమయంలో పార్టీ మార్పు సరైన నిర్ణయం కాదని.. కార్యకర్తల మనోబలాన్ని దెబ్బతీయొద్దని పీసీసీ అధికార ప్రతినిధి ఇందిరా శోభన్‌ సహా కొందరు మహిళా నేతలు ఆమెకు విన్నవించారు. పద్మిని తన నిర్ణయాన్ని వెనక్కు తీసుకోకపోతే.. ఆత్మహత్యలకు వెనుకాడబోమని కొందరు యువకులు హెచ్చరించినట్లుగా తెలిసింది. దీంతో వెనక్కు తగ్గిన పద్మిని ఫోన్‌లో దామోదరతో మాట్లాడారు. ఆయన సూచన మేరకు సంగారెడ్డి చేరుకొని తన పార్టీ మార్పు నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటున్నట్లు ప్రకటించారు. పద్మినీ తిరిగి కాంగ్రెస్‌గూటికి చేరడంలో ఆమె కూతురు త్రిష పాత్ర కూడా ఉన్నట్లు తెలుస్తోంది. 

నిర్ణయం వెనక్కి తీసుకుంటున్నా: పద్మినీరెడ్డి
సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: భారతీయ జనతా పార్టీలో చేరాలని తాను తీసుకున్న నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటున్నట్లు కాంగ్రెస్‌ నేత, మాజీ ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ సతీమణి పద్మిని వెల్లడించారు. ఉదయం నుంచి జరిగిన నాటకీయ పరిణామాల నేపథ్యంలో.. ఆమె గురువారం రాత్రి సంగారెడ్డిలోని తమ నివాసంలో మీడియాతో మాట్లాడారు. ‘కార్యకర్తల మనోవేదనను దృష్టిలో పెట్టుకుని నా నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటున్నా. ఇంత రియాక్షన్‌ ఉంటుందని నేను అనుకోలేదు. అదంతా (బీజేపీలో చేరడం) అనుకోకుండా జరిగింది. కార్యకర్తల బాధను చూడలేకపోతున్నా’ అని పద్మిని వ్యాఖ్యానించారు. మీడియా సమావేశంలో పద్మిని వెంట టీపీసీసీ నాయకురాలు ఇందిర శోభన్, కాటా సుధారాణి ఉన్నారు.  

మరిన్ని వార్తలు