యూపీలో పలు కీలక ప్రాజెక్టులకు శంకుస్థాపన

15 Jul, 2018 13:19 IST|Sakshi
నరేంద్ర మోదీ (ఫైల్‌ ఫోటో)

యూపీలో రెండో రోజు ప్రధాని నరేంద్ర మోదీ పర్యటన

లక్నో : కాంగ్రెస్‌ పార్టీ నిర్లక్ష్యం కారణంగా దేశం అభివృద్ధికి ఆమడదూరంలో ఉండిపోయిందని ప్రధాని నరేంద్ర మోదీ ధ్వజమెత్తారు. రెండు రోజుల పర్యటనలో భాగంగా.. ఆదివారం ఉత్తరప్రదేశ్‌లోని మీర్జాపూర్‌లో బన్సాగర్‌ నీటిపారుదల ప్రాజెక్టును మోదీ ప్రారంభించారు. పర్యటనలో భాగంగా గంగానదీపై ఇటీవల నిర్మించిన వంతెనను ప్రారంభించిన మోదీ, మెడికల్‌ కాలేజీ, 229 కోట్లతో మీర్జాపూర్‌-ఆలహాబాద్‌ నేషనల్‌ హైవేకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా బీజేపీ నిర్వహించిన రోడ్‌షోలో మోదీ ప్రసంగించారు.

గత పాలకుల నిర్లక్ష్యం కారణంగా రాష్ట్రంలో ఎప్పుడో పూర్తి కావాల్సిన ప్రాజెక్టులు ఇప్పటికి పూర్తి కాలేదని మండిపడ్డారు. ఇరవై ఏళ్ల క్రితం బన్సాగర్‌ ప్రాజెక్టుకు 350 కోట్లతో శంకుస్థాపన చేసి వదిలేశారని, తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఏడాదిలోపే 3500 కోట్లుతో ప్రాజెక్టును పూర్తి చేసినట్లు మోదీ తెలిపారు. ఈ ప్రాజెక్టుతో మీర్జాపూర్‌యే కాకుండా ఆలహాబాద్‌కు కూడా నీటి అవసరాలు తీరుతాయని పేర్కొన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీ 55ఏళ్ల పాలనలో ఒక్క ఎయియ్స్‌ కూడా నిర్మించలేకపోయిందని, తమ ప్రభుత్వం 700 మెడికల్‌, 50 శస్త్రచికిత్సా కేంద్రాలను ఏర్పాటు చేయనుందని తెలిపారు.

రాష్ట్రానికి సీఎం అయిన కొంత కాలంలోనే యూపీని అభివృద్ధి పథంలో నడుపుతున్నారని సీఎం యోగి ఆదిత్యానాధ్‌ను మోదీ కొనియాడారు. కాంగ్రెస్‌ పార్టీ కేవలం ముస్లింల పక్షానే నిలుస్తుందని, ట్రిపుల్‌ తలాక్‌పై వీరు అనుసరిస్తున్న ధోరణే ఇందుకు నిదర్శనమని శనివారం మోదీ విమర్శించిన విషయం తెలిసిందే.

మరిన్ని వార్తలు