నిరాహార దీక్ష: అనారోగ్యం పాలవుతోన్న మంత్రులు

18 Jun, 2018 16:33 IST|Sakshi
ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్‌ సిసోడియాను ఆస్పత్రికి తరలిస్తున​ దృశ్యం (ట్విటర్‌ ఫొటో)

సాక్షి, న్యూఢిల్లీ : రాష్ట్ర హక్కులను కేంద్రం కాలరాస్తోందంటూ ఢిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ లెఫ్టినెంట్‌ గవర్నర్‌ కార్యాలయంలో చేపట్టిన నిరసన దీక్ష నేడు(సోమవారం) ఎనిమిదో రోజుకు చేరింది. ఇంతలో ఈ ‘సోఫా ధర్నా’పై కేజ్రీవాల్‌కు గట్టి షాకే తగిలింది. ఇతరుల ఇళ్లలో ధర్నా చేసే అధికారం మీకెవరిచ్చారంటూ ఢిల్లీ హైకోర్టు కేజ్రీవాల్‌ను నిలదీసింది. ‘దీన్ని ధర్నా అని ఎవరూ అనరు. ఇతరుల ఇళ్లలోకి, కార్యాలయాల్లోకి జోరబడి ధర్నా చేసే హక్కు ఎవరికీ ఉండదు’ అని స్పష్టం చేసింది.  కోర్టు ఉత్తర్వులు, ఆందోళన తదుపరి వ్యూహాలపై చర్చించేందుకు కేజ్రీవాల్‌ నివాసంలో ఆప్‌ నేతలు భేటీ కానున్నారు.

మరోవైపు దీక్షలో పాల్గొన్న పలువురు ఆమ్‌ ఆద్మీ పార్టీ నేతలు ఒక్కొక్కరుగా అనారోగ్యం పాలవడం ఆందోళన కలిగిస్తోంది. నిరసనలో భాగంగా గత వారం రోజులుగా దీక్షలో పాల్గొన్న ఢిల్లీ ఆరోగ్యశాఖ మంత్రి సత్యేంద్ర జైన్‌ ఆరోగ్యం పూర్తీగా క్షీణించడంతో ఆయనను ఆదివారం రాత్రి లోక్‌నాయక్‌ ఆస్పత్రికి తరలించారు. అయితే ప్రసుతం దీక్ష చేస్తోన్న మరో మంత్రి కూడా అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరారు. ఈ విషయాన్ని కేజ్రీవాల్‌ ట్విటర్‌ ద్వారా తెలిపారు. ‘కీటోన్‌ లెవల్‌ 7.4కు పెరిగిన తర్వాత రొటీన్‌ చెకప్‌ కోసం ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్‌ సిసోడియాను ఎల్‌ఎన్‌జీపీ ఆస్పత్రికి తరలించారని’  ఆయన ట్వీట్‌ చేశారు.

కాగా ఢిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌కు మద్దతు పెరుగుతోంది. కేజ్రీవాల్‌ ఆందోళన విలక్షణమైనదని శివసేన ఎంపీ సంజయ్‌ రౌత్‌ ఆయనకు బాసటగా నిలిచారు. ఆందోళన బాట పట్టిన ఆప్‌ నేతలకు ఏమైనా జరిగితే అది ప్రజాస్వామ్యానికి మంచిది కాదని ఆయన హెచ్చరించారు. 

మరిన్ని వార్తలు