పొత్తులు లేవు.. త్రిముఖ పోరు

24 Apr, 2019 10:55 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: రాజధాని నగరం ఢిల్లీలో మంగళవారం నామినేషన్ల పర్వం ముగియడంతో లోక్‌సభ ఎన్నికల పోటీ చిత్రం స్పష్టమైంది. పొత్తుపై గత కొద్ది నెలలుగా ఊగిసలాడిన ఆమ్‌ ఆద్మీ పార్టీ, కాంగ్రెస్‌ పార్టీలు వేర్వేరుగా పోటీచేస్తుండడంతో నగరంలో ముక్కోణపు పోటీ ఖాయమైంది. పొత్తుపై కాంగ్రెస్‌తో మంతనాలు జరుపుతూనే ఆప్‌ ఏడు సీట్లకు అభ్యర్థులను ముందుగానే ప్రకటించడంతో ఆప్‌ అభ్యర్థుల నామినేషన్ల పర్వం మిగతా రెండు పార్టీల కన్నా ముందే ముగిసింది. కాంగ్రెస్‌ సోమవారం అభ్యర్థులను ప్రకటించడంతో పార్టీ అభ్యర్థులందరు ఆఖరి రోజునే నామినేషన్‌ దాఖలు చేశారు. బీజేపీ అభ్యర్థులలో మనోజ్‌తివారీ, డా.హర్షవర్థన్, పర్వేష్‌ వర్మ సోమవారం నామినేషన్‌ దాఖలు చేయగా మిగతా నలుగురు అభ్యర్థులు మంగళవారం నామినేషన్లు సమర్పించారు. బీజేపీ మంగళవారం వాయవ్య ఢిల్లీ అభ్యర్థిని ప్రకటించింది. వాయవ్య ఢిల్లీ నుంచి సిట్టింగ్‌ ఎంపీ ఉదిత్‌రాజ్‌కు టికెట్‌ ఇవ్వకుండా గాయకుడు హన్స్‌ రాజ్‌ హన్స్‌ను బీజేపీ బరిలోకి దింపింది. దీంతో ఢిల్లీ నుంచి పోటీచేసే సెలబ్రిటీల సంఖ్య మూడుకు పెరిగింది. బాక్సర్‌ విజేందర్‌ సింగ్‌కు కాంగ్రెస్‌ టికెట్‌ ఇవ్వగా, గాయకుడు హన్స్‌రాజ్‌తోపాటు క్రికెటర్‌ గౌతం గంభీర్‌ను బీజేపీ బరిలోకి దింపింది.

అనుభవానికి కాంగెస్ర్‌.. యువతకు ఆప్‌
అభ్యర్థుల ఎంపికలో కాంగ్రె‹స్‌ రాజకీయ అనుభవానికే ప్రాధాన్యాన్ని ఇచ్చింది. దక్షిణ ఢిల్లీ నుంచి పార్టీ బరిలోకి దింపిన 33 సంవత్సరాల బాక్సర్‌ విజేందర్‌ సింగ్‌ మినహా ఆ పార్టీ అభ్యర్థులంతా రాజకీయంలో తలపండినవారే. మూడు పార్టీల అభ్యర్థులలో కాంగ్రెస్‌ అభ్యర్థులే పెద్ద వయసు వారు. వారి సగటు వయసు 57 సంవత్సరాలు. ఈశాన్య ఢిల్లీ నుంచి కాంగ్రెస్‌ తరపున పోటీచేస్తున్న 81 సంవత్సరాల షీలాదీక్షిత్‌ ఈ ఎన్నికల్లో అభ్యర్థులందరిలోకి పెద్ద వారు. ఇక, మిగతా పార్టీలతో పోల్చుకుంటే అతి తక్కువగా ఆరు సంవత్సరాల రాజకీయ అనుభవం ఉన్న యువ అభ్యర్థులతోనే ఆమ్‌ ఆద్మీ పార్టీ ఢిల్లీ లోక్‌సభ ఎన్నికల బరిలో నిలిచింది. వయసులోనూ మిగతా పార్టీల అభ్యర్థుల కన్నా ఆప్‌ అభ్యర్థులు తక్కువ వయసు కలిగి ఉన్నారు. వారి సగటు వయకు 45 సంవత్సరాలుగా ఉంది. దక్షిణ ఢిల్లీ నుంచి పోటీ చేస్తున్న 30 సంవత్సరాల రాఘవ్‌ చద్దా మూడు పార్టీల అభ్యర్థులలో అతి పిన్న వయçస్కుడు.

సిట్టింగ్‌ అభ్యర్థులు, సెలెబ్రిటీలతో బరిలో బీజేపీ
మోడీ బలం నమ్ముకుని ఎన్నికల బరిలోకి దిగిన బీజేపీ ఐదుగురు సిట్టింగ్‌ ఎంపీలకు టికెట్‌ ఇచ్చింది. తూర్పు ఢిల్లీ నుంచి పోటీచేస్తున్న 37 సంవత్సరాల గౌతం గంభీర్, వాయవ్య ఢిల్లీ నుంచి పోటీ చేస్తున్న గాయకుడు హన్స్‌ రాజ్‌ హన్స్‌ మినహా మిగతా ఐదుగురు అభ్యర్థులు గత ఎన్నికల్లో విజయబావుటా ఎగురవేసినవారే. ఈ ఇద్దరు కూడా తమ తమ రంగాల్లో దేశవ్యాప్తంగా గుర్తింపు కలిగిన సెలబ్రిటీలే. మహిళలకు ప్రాతినిధ్యం కల్పించే విషయంలో మూడు పార్టీలు కంటితుడుపు వైఖరినే పాటించాయి.
ఆప్‌ తూర్పు ఢిల్లీ నుంచి అతిషీని, కాంగ్రెస్‌ ఈశాన్య ఢిల్లీ నుంచి షీలాదీక్షిత్‌ను, బీజేపీ న్యూఢిల్లీ నుంచి మీనాక్షి లేఖిని నిలబెట్టాయి.

ఢిల్లీలో ఏడు లోక్‌సభ స్థానాలకు పోటీలో ఉన్న అభ్యర్థులు వీరే


నియోజకవర్గం    
ఆప్‌     బీజేపీ     కాంగ్రెస్‌
న్యూఢిల్లీ     బ్రజేష్‌ గోయల్‌     మీనాక్షి లేఖి     అజయ్‌ మాకెన్‌
తూర్పుఢిల్లీ     అతిషీ     గౌతం గంభీర్‌     అర్విందర్‌ సింగ్‌ లవ్లీ
వాయవ్య ఢిల్లీ    గూగన్‌ సింగ్‌     హన్స్‌ రాజ్‌ హన్స్‌     రాజేష్‌ లిలోఠియా
ఈశాన్య ఢిల్లీ     దిలీప్‌ పాండే     మనోజ్‌ తివారీ     షీలాదీక్షిత్‌

దక్షిణ ఢిల్లీ    
రాఘవ్‌ చద్దా    రమేష్‌ బిధూడీ     విజేందర్‌ సింగ్‌

చాందినీ చౌక్‌    
పంకజ్‌ గుప్తా     డా.హర్షవర్థన్‌     జేపీ అగర్వాల్‌
 
పశ్చిమ ఢిల్లీ     బల్బీర్‌ సింగ్‌ ఝాకడ్‌     పర్వేష్‌ వర్మ    మహాబల్‌ మిశ్రా


 

మరిన్ని వార్తలు