మాది ప్రగతి పథం..కాంగ్రెస్‌ది విభజనవాదం

22 Dec, 2017 08:01 IST|Sakshi

రైతుల ఆత్మహత్యలు ఆందోళనకరం

హుబ్లీ పరివర్తన యాత్ర సభలో

యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌

హుబ్లీ (సాక్షి, బెంగళూరు): కాంగ్రెస్‌ పార్టీకి రాష్ట్ర అభివృద్ధిపై చిత్తశుద్ధి లేదని బీజేపీ నేత, ఉత్తరప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ ఆరోపించారు. రాష్ట్రం కోసం కేంద్ర ప్రభుత్వం కేటాయించిన నిధులను కూడా రాష్ట్ర అభివృద్ధి కోసం వినియోగించడం లేదని విమర్శించారు. హుబ్లీలోని నెహ్రూ మైదానంలో గురువారం పరివర్తన యాత్ర సందర్భంగా నిర్వహించిన భారీ బహిరంగ సభకు ఆదిత్యనాథ్‌ ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు.

‘కేంద్ర ప్రభుత్వం అభివృద్ధిని అజెండాగా చేసుకొని ముందుకు సాగుతుంటే కర్ణాటకలోని కాంగ్రెస్‌ పార్టీ మాత్రం ప్రజలను మతం, వర్గాలుగా విభజించడమే అజెండాగా ఎంచుకుంది. హుబ్లీ–ధార్వాడ అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం పెద్దఎత్తున నిధులను విడుదల చేసింది. హుబ్లీకి నూతన వసతులతో కూడిన విమానాశ్రయం అందుబాటులోకి వచ్చింది. గతంలో యూపీఏ ప్రభుత్వం ధార్వాడకు

ఐఐటీని ఎందుకు తీసుకురాలేక పోయింది?
కర్ణాటకలో ప్రస్తుతం రైతుల ఆత్మహత్యలు చూస్తుంటే ఆందోళన కలుగుతోంది. కంటి తుడుపుగా మాత్రమే రైతుల రుణాలను మాఫీ చేశారు. ప్రస్తుతం కర్ణాటకలో అభివృద్ధికి ప్రాధాన్యత ఇచ్చే ప్రభుత్వం రావాల్సి ఉంది. టిప్పుసుల్తాన్‌ వంటి వ్యక్తిని ప్రముఖుడిగా చూపించే ప్రయత్నం చేసిన కాంగ్రెస్‌కు రాష్ట్ర ప్రజలు సరైన బుద్ధి చెప్పాలి. రాష్ట్ర ప్రజలు ప్రధాని మోదీ నాయకత్వంతో పాటు యడ్యూరప్ప నేతృత్వం పై నమ్మకం ఉంచి రాష్ట్రంలో బీజేపీని గెలిపించాలి’ అని యోగి పేర్కొన్నారు. సభకు ముందు యోగి ఆదిత్యనా«థ్‌  హుబ్లీలోని మూరుసావిర మఠాన్ని సందర్శించారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బి.ఎస్‌.యడ్యూరప్ప, ప్రతిపక్ష నేత జగదీష్‌ శెట్టర్‌లు ఆయన వెంట ఉన్నారు.

నీటిని తెచ్చే బాధ్యత మాది: యడ్యూరప్ప
మహదాయి నది నుంచి కర్ణాటకకు తాగునీటిని తీసుకువచ్చే బాధ్యత మాదేనని సభలో యడ్యూరప్ప చెప్పారు. ఇందుకోసం ఎంత వరకైనా పోరాడుతామన్నారు. జలాల వివాదంపై గోవా ముఖ్యమంత్రి మనోహర్‌ పారికర్‌ తనకు రాసిన లేఖ వివరాలను చదివి వినిపించారు. తమ పట్టుదల వల్లే మనోహర్‌ పారికర్‌ చర్చలకు అంగీకరించారని యడ్డి చెప్పారు. ఎట్టి పరిస్థితుల్లోనూ గోవాను ఒప్పించి మహదాయి నుంచి తాగునీటిని ఉత్తర కర్ణాటకకు తీసుకువస్తానన్నారు.

>
మరిన్ని వార్తలు