సింధియా రాజీనామాతో మేలుకున్న కాంగ్రెస్‌

11 Mar, 2020 16:09 IST|Sakshi
డీకే శివకుమార్‌ (ఫైల్‌ఫోటో)

కర్ణాటక, ఢిల్లీకి కొత్త పీసీసీల నియామకం

సాక్షి, బెంగళూరు : మధ్యప్రదేశ్‌ కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నాయకుడు జ్యోతిరాదిత్య సింధియా రాజీనామాతో కాంగ్రెస్‌ అధిష్టానంకు ఊహించిన పరిణామం ఎదురైంది. ఆ షాక్‌ నుంచి తేరుకున్న పార్టీ నాయకత్వం ఖాళీగా ఉన్న ప్రదేశ్‌ కాంగ్రెస్ కమిటీ (పీసీసీ) పదవులను భర్తీ చేయాలని నిర్ణయించింది. ఈ క్రమంలోనే కర్ణాటక కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నేత డీకే శివకుమార్‌కు కీలక పదవి అప్పగించింది. ఆ రాష్ట్ర ప్రదేశ్‌ కాంగ్రెస్‌ కమిటీ (పీసీసీ) అధ్యక్షుడిగా ఆయన్ని నియమించింది. పార్టీలో సమర్థవంతమైన సీనియర్‌ నేతగా, వ్యూహకర్తగా డీకే జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన విషయం తెలిసిందే. ఇక రాష్ట్ర కార్యనిర్వహక అధ్యక్షులుగా సలీమ్‌ అహ్మద్‌, ఈశ్వర్‌ ఖాంద్రీ, సతీష్‌ జర్కీహోళీలు పదవులు దక్కించుకున్నారు. ఈ మేరకు కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌ బుధవారం అధికారిక ప్రకటన చేశారు. అలాగే ఢిల్లీ పీసీసీ చీఫ్‌గా సీనియర్‌ నేత అనిల్‌ చైదరీని పార్టీ అధిష్టానం నియమించింది. (బీజేపీలో చేరిన సింధియా)

కాగా చాలా కాలం నుంచి పలు రాష్ట్రాల్లో పీసీసీ పదవులు ఖాళీగానే ఉంటున్న విషయం తెలిసిందే. కర్ణాటకలో గుండూరావు రాజీనామా అనంతరం కొత్త నాయకత్వాన్ని నియమించడంపై అధిష్టానం ఆసక్తి కనబరచలేదు. తాజాగా చోటుచేసుకుంటున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో పార్టీలో ఖాళీగా ఉన్న పదవులను భర్తీ చేయాలని అధిష్టానం ఆదేశించింది. ఈ నేపథ్యంలో కర్ణాటక, ఢిల్లీలకు నూతన పీసీసీలను నియమించింది.

మరిన్ని వార్తలు