చదివింది ఐదు, కానీ సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌

11 Mar, 2020 16:13 IST|Sakshi

న్యూఢిల్లీ: కష్టపడితే విద్యార్హతలతో సంబంధం లేకుండా మెరుగైన ఉద్యోగం సాధించవచ్చని బెంగుళూరుకు చెందిన మహ్మద్ తన్వీర్ నిరూపించాడు. వివరాల్లోకి వెళితే.. మహ్మద్ తన్వీర్ ఆర్థిక పరిస్థితులు సహకరించక కేవలం 5వ తరగతి మాత్రమే చదివాడు. ఆ తర్వాత వెల్డర్‌గా కొంత కాలం పని చేశాడు. కానీ అతనికి జరిగిన ఓ ప్రమాదం తన్వీర్‌ జీవితాన్నే మార్చేసింది. అప్పుడే అతను జీవితంలో ఉన్నత స్థానానికి ఎదగాలని నిశ్చయించుకున్నాడు. డిగ్రీలు లేకపోయినా సరే, పెద్ద ఉద్యోగం సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నాడు. ప్రమాదం కారణంగా విశ్రాంతి తీసుకుంటున్న సమయంలో..మెడికల్‌ ట్రాన్స్‌క్రిప్షన్‌ కోర్సు చేస్తున్న తన్వీర్‌ సోదరి అతడిని ఎంతగానో ప్రోత్సహించింది. ఆమె సహాయంతో అతను ఇంగ్లీషు చదవడం, రాయడం నేర్చుకున్నాడు. తరువాత టైపింగ్‌ కోర్సు చేసి డాటా ఎంట్రీ ఉద్యోగం సంపాదించాడు. కానీ తన్వీర్‌కు సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగం సాధించాలనే కోరిక ఉండేది.

దీంతో తొలుత అతను డిజిటల్‌ మార్కెటింగ్‌, ఎస్‌ఈవో స్పెషలిస్ట్‌ ఉద్యోగాలు చేశాడు. సాఫ్ట్‌వేర్‌ కొలువు సాధించాలని ఉన్నా డిగ్రీ అర్హతలు లేకపోవడంతో అతని మనసులో ఏదో మూలన నిరాశ తొంగిచూసేది. సరిగ్గా అదే సమయంలో మాసై స్కూల్‌ ఆఫ్‌ బిజినెస్‌ అతని లక్ష్యానికి దారి చూపింది. ఏ అర్హతలు లేకున్నా అతనికి 6నెలల కోడింగ్‌ ప్రోగ్రామ్‌ చేయడానికి అవకాశం కల్పించింది. కేవలం 6నెలల్లోనే తనకు సాఫ్ట్‌వేర్‌ ప్రోగ్రామర్‌గా ఉద్యోగం సాధించడానికి కావాల్సిన నైపుణ్యాన్ని అందించింది. దీంతో నేడు సాఫ్ట్‌వేర్‌ ప్రోగ్రామర్‌గా ఉన్నత స్థాయిలో నిలదొక్కుకున్నానని తన్వీర్‌ తన ఆనందాన్ని పంచుకున్నాడు. కాగా ప్రస్తుతం కంపెనీలు అభ్యర్థుల నైపుణ్యాలకే ప్రాధాన్యత ఇస్తున్నాయని..వారి విద్యార్హతలకు అంతగా ప్రాధాన్యత ఇవ్వడం లేదని మాసై సహ వ్యవస్థాపకుడు ప్రతీక్‌ శుక్లా పేర్కొన్నారు. 

>
మరిన్ని వార్తలు