ఇసుక కొరతపై ఆందోళన వద్దు 

27 Oct, 2019 05:04 IST|Sakshi

వరదలు తగ్గాక లక్షల టన్నుల ఇసుక అందుబాటులోకి వస్తుంది 

చంద్రబాబు, పవన్‌ కల్యాణ్‌ అనవసర రాద్ధాంతం చేస్తున్నారు 

వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు ధ్వజం  

సాక్షి, అమరావతి:  ఇసుక కష్టాలు త్వరలోనే తొలగిపోతాయని.. ఇసుక కొరతపై ప్రజలు, భవన నిర్మాణ కార్మికులు ఆందోళన చెందవద్దని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే, పార్టీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు చెప్పారు. ఇసుక అంశంపై ప్రతిపక్ష నేత చంద్రబాబు, జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ అనవసర రాద్ధాంతం చేస్తున్నారని విమర్శించారు. అంబటి రాంబాబు శనివారం తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. నదులు, వాగుల్లో భారీగా వరద ప్రవహిస్తుండడంతో ఇసుక తవ్వడం సాధ్యం కావడం లేదని పేర్కొన్నారు.

చంద్రబాబు, పవన్‌ కల్యాణ్‌ కలిసి భవన నిర్మాణ కార్మికులతో ఉద్యమం చేయించాలని ఆలోచించడం సరికాదని అన్నారు. చంద్రబాబు ప్రభుత్వ హయాంలో విచ్చలవిడిగా ఇసుక తోడేయడంతో గ్రీన్‌ ట్రిబ్యునల్‌ రూ.100 కోట్ల జరిమానా విధించిందని గుర్తుచేశారు. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పర్యావరణ చట్టాలను అనుసరించి ఇసుక విధానం రూపొందిస్తున్నారని చెప్పారు. నదులు, వాగుల్లో వరదలు తగ్గాక లక్షల టన్నుల ఇసుక అందుబాటులో ఉంటుందని తెలిపారు. బ్రహ్మాజీ అనే భనవ నిర్మాణ కార్మికుడు కుటుంబ కారణాల వల్ల చనిపోతే ఇసుక కొరత వల్లే మరణించాడని చంద్రబాబు ట్వీట్ల మీద ట్వీట్లు చేస్తున్నారని మండిపడ్డారు.   

రాజకీయ విమర్శలు చేస్తే తిప్పికొడతాం  
చంద్రబాబు తానా అంటే పవన్‌ కల్యాణ్‌ తందానా అంటున్నారని అంబటి రాంబాబు ధ్వజమెత్తారు. 128 నెంబరు జీవో జారీపై కొన్ని పత్రికలు రాద్ధాంతం చేయడం సరికాదని, అది కేవలం పాలనా సంస్కరణల్లో భాగంగా చేసిందే తప్ప ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అధికారాలకు కోత విధించినట్లు కాదని స్పష్టం చేశారు. ముఖ్యమంత్రికి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి మంచి సంబంధాలున్నాయన్నారు. చంద్రబాబుపై, పవన్‌ కల్యాణ్‌పై తమకు గౌరవం ఉందని, అయితే వారు రాజకీయ విమర్శలు చేస్తే మాత్రం ధైర్యంగా తిప్పి కొడతామని, ప్రతి విమర్శలు కూడా చేస్తామని అంబటి రాంబాబు తేల్చిచెప్పారు. చంద్రబాబును పవన్‌ కల్యాణ్‌ ఏనాడూ విమర్శించలేదన్నారు.  

మరిన్ని వార్తలు