టీఆర్‌ఎస్‌.. పాటలకు పచ్చజెండా

20 Nov, 2018 02:02 IST|Sakshi

అభ్యంతరకర పదాల తొలగింపుతో ఆమోదించిన ఎన్నికల సంఘం

 ఎనిమిది గీతాల్లో రెండింటిని రాసిన సీఎం కేసీఆర్‌  

సాక్షి, హైదరాబాద్‌ : టీఆర్‌ఎస్‌ పార్టీ రూపొందించిన ఎన్నికల ప్రచార పాటల్లోని కొన్ని అభ్యంతరకర పదాలను తొలగించిన తర్వాత ఎన్నికల సంఘం వాటికి అనుమతించింది. సాహితీ ప్రేమికుడు, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌ రావు స్వయంగా రాసిన రెండు పాటలతో పాటు, ఇతర ప్రముఖ రచయితలు రాసిన మరో ఆరు పాటలు ఇందులో ఉన్నాయి. రాష్ట్ర ఎన్నికల అదనపు ప్రధాన అధికారి జ్యోతిబుద్ధ ప్రకాశ్‌ నేతృత్వంలోని సర్టిఫికేషన్‌ కమిటీ ఈ పాటలను పరిశీలించి ఎన్నికల ప్రవర్తనా నియమావళికి విరుద్ధంగా ఉన్న పదాలను తొలగించాలని సూచించింది. గత నాలుగున్నరేళ్లలో అమలు చేసిన అభివృద్ధి, సంక్షేమ పథకాలు, కార్యక్రమాలకు అత్యంత ప్రాధాన్యమిస్తూ ...‘మా ప్రభుత్వం/ప్రభుత్వం’అని పాటల్లో పలుమార్లు వచ్చిన పదాలతో పాటు గొర్లు, బర్రెలు, చేపల పంపిణీ వంటి కార్యక్రమాలతో లబ్ధిపొందిన గొర్ల కురుమ/గంగ పుత్రులు/గౌడ తదితర కులాల ప్రస్తావనలను పాటల నుంచి తొలగించాలని ఎన్నికల సంఘం కోరింది.

వ్యక్తిగత విమర్శలకు ఆస్కారమిచ్చే పదాలను సైతం తొలగించాలని కోరినట్లు తెలిసింది.ఎన్నికల ప్రచార వీడియోల్లో రాష్ట్ర ప్రభుత్వ చిహ్నాలు, సచివాలయం తదితర ప్రభుత్వ ఆస్తుల దృశ్యాలను తొలగించాలని కోరింది. ఈ మార్పులకు టీఆర్‌ఎస్‌ నాయకత్వం అంగీకరించడంతో అన్ని పాటలకు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి(సీఈఓ) రజత్‌కుమార్‌ సోమవారం అనుమతులు జారీ చేశారు. కాగా రాజకీయపార్టీలు, అభ్యర్థులు తమ ప్రచార ప్రకటనలు, ఆడియో, వీడియోలను ఎన్నికల సంఘం పరిశీలన కోసం సమర్పించాల్సి ఉంటుంది. ఎన్నికల ప్రచార ప్రకటనల్లోని సమాచారంతో పాటు ప్రచార వీడియో, ఆడియోల్లోని అంశాలను సైతం ఎన్నికల సంఘం పరిశీలన జరిపి అనుమతిస్తోంది. వార్తా పత్రికలు, టీవీ చానళ్లు, సోషల్‌ మీడియా ద్వారా జారీ చేసే ఎన్నికల ప్రచార ప్రకటనలు, ఆడియో, వీడియోలు ఎన్నికల కోడ్‌కు అనుగుణంగా ఉంటేనే అనుమతి లభించనుంది. 

>
మరిన్ని వార్తలు