చేనేత కార్మికులకు భరోసా

16 Nov, 2018 02:01 IST|Sakshi

బ్యాంకులతో సంబంధం లేకుండా రుణాలు: ఈటల

హుజూరాబాద్‌: టీఆర్‌ఎస్‌ అధికారంలోకొచ్చాక నేతన్నకు భరోసా లభించిందని మంత్రి ఈటల రాజేందర్‌ అన్నారు. కరీంనగర్‌ జిల్లా హుజూరాబాద్‌ మండలం శాలపల్లిలో నియోజకవర్గస్థాయి పద్మశాలి కులస్తుల ఆధ్వర్యంలో జరిగిన ఆశీర్వాద సభలో ఆయన మాట్లాడారు. రాష్ట్ర ఏర్పాటుకు ముందు చేనేత కార్మికుల కష్టాలను చూసి ఆదుకోవాలని అప్పటి ప్రభుత్వాన్ని కోరితే పట్టించుకోలేదని విమర్శించారు. దీంతో టీఆర్‌ఎస్‌ హైదరాబాద్‌లో జోలె పట్టి చందాలు వసూలు చేసి కార్మికులకు అందించిందని గుర్తు చేశారు. సిరిసిల్ల ఉరిసిల్లగా మారితే.. పార్టీ రూ.50 లక్షలు చందాలు వసూలు చేసి కార్మికులకు అండగా నిలిచిందని పేర్కొన్నారు.

కేంద్రం 4 శాతం, రాష్ట్రం 4 శాతం అందజేసే టిఫ్త్‌ ఫండ్‌ను కేంద్రం నిలిపేస్తే.. ఎంపీ వినోద్‌కుమార్‌తో కలసి కేంద్రంపై ఒత్తిడి తెచ్చామన్నారు. పోరాడి సాధించుకున్న రాష్ట్రంలో ఆకలికేకలు, ఆత్మహత్యలు ఉండకూడదని భావించి తాను మంత్రిగా బాధ్యతలు చేపట్టిన వెంటనే చేనేత కార్మిక నాయకులను పిలిపించుకుని వారి సమస్యల పరిష్కారానికి బాటలు వేశామన్నారు. తన శాఖ కాకున్నా.. కార్మికులకు అందాల్సిన పథకాలపై ఆ శాఖ మంత్రితో మాట్లాడానని గుర్తు చేశారు.

చేనేత వృత్తిపై ఆధారపడి జీవిస్తున్న కుటుంబాలు ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నాయని, అలాంటి కుటుంబాలను ఆదుకోవాలనే సంకల్పంతో టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం రూ.50 వేల నుంచి రూ.లక్ష వరకు వ్యక్తిగత రుణాలు అందించేందుకు నిర్ణయం తీసుకుందన్నారు. రైతు బీమా మాదిరిగానే అన్నివర్గాల వారికి రూ.5 లక్షల బీమా సౌకర్యం కల్పిస్తామన్నారు. 20 రోజుల్లో మిషన్‌ భగీరథ ద్వారా ఇంటింటికీ నల్లా నీళ్లను సరఫరా చేసి ఆడబిడ్డల పాదాలు కడుగుతామన్నారు. ఏప్రిల్‌ నుంచి ఫించన్‌ రూ.2016కు పెంచుతామన్నారు. నిరుద్యోగ భృతి కింద రూ.3016 ఇస్తామన్నారు. హుజూరాబాద్‌ నియోజకవర్గం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందిందని, మరోసారి టీఆర్‌ఎస్‌కు మద్దతుగా నిలిచి ఆశీర్వదించాలని కోరారు. అనంతరం పద్మశాలీ కులస్తులు గజమాలతో ఘనంగా సత్కరించారు.

మరిన్ని వార్తలు