బాబు తెలుగుకు చేసిన సేవ శూన్యం: యార్లగడ్డ

1 May, 2019 18:15 IST|Sakshi
మాజీ ఎంపీ యార్లగడ్డ లక్ష్మీప్రసాద్‌(పాత చిత్రం)

ఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌ పబ్లిక్‌ సర్వీస్ కమిషన్(ఏపీపీఎస్‌సీ)పై మాజీ ఎంపీ యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్‌ తీవ్రంగా మండిపడ్డారు. ఏపీపీఎస్‌సీ తెలుగు భాషను నిర్లక్ష్యం చేస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఏపీపీఎస్‌సీ వింతగా వ్యవహరిస్తోందని, ప్రశ్నా పత్రాల్లో జనరల్‌ నాలెడ్జ్‌, మెంటల్‌ ఎబిలిటీకి సంబంధించిన ప్రశ్నలు కూడా ఇంగ్లీషులోనే ఇవ్వడం విడ్డూరంగా ఉందన్నారు. సబ్జెక్టు ప్రశ్నా పత్రాలు ఇంగ్లీషులోనే ఉన్నా.. జనరల్‌ నాలెడ్జికి సంబంధించి మాత్రం తెలుగులోనే ఉండాలని అభిప్రాయం వ్యక్తం చేశారు. తెలుగులో ప్రశ్నాపత్రం ఉండదు..ఇంగ్లీషులోనే ఉంటుంది అనే విషయాన్ని నోటిఫికేషన్‌లో ఎక్కడా ఇవ్వలేదని చెప్పారు. హాల్ టిక్కెట్లు వచ్చాక ప్రశ్నాపత్రాలన్నీ ఇంగ్లీషులోనే ఉంటాయని చెబుతున్నారు.. దీని వల్ల తెలుగు మీడియం అభ్యర్థులు తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉందన్నారు.

తెలుగు మీడియం విద్యార్థుల పీక కోయడానికే ఉన్నత న్యాయస్థానానికి వెళ్తున్నారా అని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. అడ్మినిస్ట్రేటివ్‌ ట్రిబ్యునల్‌ ఇచ్చిన తీర్పును యథాతధంగా అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు తన ఐదేళ్ల పరిపాలనలో తెలుగుకు చేసిన సేవ శూన్యమన్నారు. ఒకటో తరగతి నుంచి ఇంటర్ వరకు తప్పనిసరిగా తెలుగును ఒక పాఠ్యాంశంగా చేస్తానన్న చంద్రబాబు ఆ హామీని  అమలు చేయలేకపోయారని విమర్శించారు. చివరికి అమరావతి హైకోర్టు శిలాఫలకాలను కూడా ఇంగ్లీషులోనే వేశారని, తెలుగు భాషను పూర్తిగా చంపేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అంగన్‌వాడీలలో కూడా ఇంగ్లీష్‌లో పెట్టడం అన్యాయమన్నారు.

మరిన్ని వార్తలు