సీఎం జగన్‌ను విమర్శించే స్థాయి లోకేష్‌కు లేదు 

23 Nov, 2019 10:51 IST|Sakshi

ప్రజలను పీడించిన రౌడీషీటర్‌ కోసం లోకేష్‌ రావటమా? 

దిగజారుడు రాజకీయానికి పాల్పడుతున్న బాబు, లోకేష్‌  

సాక్షి, నరసరావుపేట: జైలులో ఉన్న రౌడీషీటర్‌ను చూసేందుకు తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యదర్శి లోకేష్, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు సబ్‌ జైలుకు వెళ్ళటం రాజకీయ దిగజారుడుతనానికి నిదర్శనమని ఎమ్మెల్యే డాక్టర్‌ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి విమర్శించారు. శుక్రవారం స్థానిక పార్టీ కార్యాలయంలో ఆయన విలేకర్లతో మాట్లాడుతూ నరసరావుపేటలో లోకేష్‌ చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. ఎస్సీ మహిళైన తహసీల్దార్‌ వనజాక్షిని కొట్టిన చింతమనేనిని ఆదర్శంగా తీసుకోవాలని చంద్రబాబు ప్రకటించిన వెంటనే లోకేష్‌ రౌడీషీటర్‌ను చూసేందుకు రావటం గమనార్హమన్నారు.

దీనిని బట్టి తెలుగుదేశం పార్టీ నాయకత్వం ఎటువైపు పయనిస్తోందో ప్రజలు గుర్తించాలని కోరారు. గత ప్రభుత్వానికి ముందు, గత టీడీపీ ప్రభుత్వ హయాంలో చింతమనేనిపై 18 కేసులు నమోదయ్యాయన్నారు. జైలులో ఉన్న రౌడీషీటర్‌ వైఎస్సార్‌సీపీ వారిపై 18 కేసులు పెట్టించాడన్నారు. పట్టా భూమిలో సిమెంట్‌ రోడ్డు వేయించాడని, 40 ఏళ్ళ నుంచి సాగు చేసుకుంటున్న పట్టా భూమిలో శ్మశానం కట్టించాడని చెప్పారు. టీడీపీ రంగులు వేసిన బెంచీలు పగులకొడితే మూడు కేసులు పెట్టించాడన్నారు. ఇలాంటి దౌర్భాగ్యుడి కోసం లోకేష్‌ జైలుకు వెళ్లి పలకరించాడని విమర్శించారు.   

జగన్‌మోహన్‌రెడ్డి పులిబిడ్డ
సీఎం జగన్‌మోహన్‌రెడ్డిపై లోకేష అనుచిత వ్యాఖ్యలను ఎమ్మెల్యే గోపిరెడ్డి తీవ్రంగా ఖండించారు. జగన్‌మోహన్‌రెడ్డిని గురించి మాట్లాడే స్థాయి లోకేష్‌కు లేదని చెప్పారు.  రాష్ట్రంలో దుబారా ఖర్చు, అవినీతి, ఆశ్రిత పక్షపాతం లేకుండా పరిపాలన చేస్తున్న సీఎం జగన్‌పై ఈ విధంగా మాట్లాడటం దురదృష్టకరమన్నారు. తన తండ్రి చంద్రబాబు రాజకీయాలను అడ్డంపెట్టుకొని లోకేష్‌ వచ్చాడని, అతని వల్లే పార్టీ భ్రష్టుపట్టిపోతోందని టీడీపీ వారే అనుకుంటున్నారని చెప్పారు. రాజశేఖరరెడ్డి కడుపున పులిలాంటి నాయకుడు పుట్టాడని జగన్‌ను ప్రజలు కీర్తిస్తున్నారన్నారు.

మరిన్ని వార్తలు