జిగ్నేష్‌పై జులుం.. తీవ్ర ఉద్రిక్తత

18 Feb, 2018 12:54 IST|Sakshi
జిగ్నేష్‌తో దురుసుగా ప్రవర్తించిన అధికారులు.. చిత్రాలు

సాక్షి, అహ్మదాబాద్‌ : దళిత యువ నేత, ఎమ్మెల్యే జిగ్నేష్‌ మెవానీపై గుజరాత్‌ పోలీసులు జులుం ప్రదర్శించారు. ఓ కార్యక్రమంలో పాల్గొనటానికి వెళ్తున్న ఆయన్ని బలవంతంగా అదుపులోకి తీసుకున్నారు. దీంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. 

దళిత ఉద్యమ కార్యకర్త భానుభాయ్‌ వాంకర్‌ బలిదానానికి సంతాపంగా సారంగపూర్‌లోని అంబేద్కర్‌ విగ్రహాం వద్ద సంస్మరణ ర్యాలీ, నిరసన ప్రదర్శనలు నిర్వహించేందుకు వాంకర్‌ కుటుంబ సభ్యులు సిద్ధమయ్యారు. ఇందులో పాల్గొనేందుకు తన అనుచరులతో కలిసి జిగ్నేష్‌ ర్యాలీగా బయలుదేరారు. అయితే ప్రారంభంలోనే ఆయన్ని అడ్డుకున్న పోలీసులు కారులోంచి లాగేశారు. ఆపై కారు తాళాలను బద్ధలు కొట్టి, బలవంతంగా అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం ఆయన ఎక్కడున్న విషయం తెలియరావటం లేదు. దీంతో జిగ్నేష్‌ అనుచరులు ధర్నాకు దిగారు. ఈ మేరకు యువ నేత సెహ్లా రషీద్‌ తన ట్విట్టర్‌లో సందేశాలను, ఆ వీడియోను పోస్ట్‌ చేశారు. 

తనకు న్యాయంగా దక్కాల్సిన భూమి కోసం ఏళ్ల తరబడి పోరాటం జరిపిన భానుభాయ్‌ వాంకర్‌ గురువారం పటన్‌ జిల్లా కలెక్టర్‌ కార్యాలయం ముందు ఆత్మాహుతికి పాల్పడ్డారు. తీవ్ర గాయాలతో చికిత్స పొందుతూ శుక్రవారం రాత్రి ఆయన మృతి చెందారు. ఈ నేపథ్యంలో దళిత వ్యతిరేక బీజేపీ దారుణ హత్యకు పాల్పడిందంటూ జిగ్నేష్ ఆరోపణలకు దిగాడు. యువ నేతలు హర్దిక్‌ పటేల్‌, కాంగ్రెస్‌ ఎమ్మెల్యే అల్పేష్‌ ఠాకూర్‌లతో కలిసి జిగ్నేష్‌ అహ్మదాబాద్‌-గాంధీనగర్‌హైవేపై నిరసన ప్రదర్శనలో శనివారం పాల్గొన్నారు.


                                             భానుభాయ్‌ వాంకర్‌

మరిన్ని వార్తలు