సోమిరెడ్డిని తొలగించాల్సిందే!

28 May, 2018 10:19 IST|Sakshi
జీవీఎల్‌ నరసింహారావు.. మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి

సాక్షి, న్యూఢిల్లీ: టీటీడీ మాజీ ప్రధాన అర్చకులు రమణ దీక్షితులపై మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి అభ్యంతరకర వ్యాఖ్యల వ్యవహారం చల్లారేలా కనిపించటం లేదు. క్షమాపణలు చెప్పినప్పటికీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డిపై పలువురు విమర్శలు గుప్పిస్తూనే ఉన్నారు. ఈ వ్యవహారంపై బీజేపీ ఎంపీ జీవీఎల్‌ నరసింహారావు మరోసారి ఢిల్లీలో మీడియాతో మాట్లాడారు. 

‘రమణదీక్షితులపై సోమిరెడ్డి వ్యాఖ్యలు క్షమించరానివి. ఆయన్ని మంత్రి పదవి నుంచి తొలగించాల్సిందే. సోమిరెడ్డి.. ఇకనైనా దగుల్బాజి మాటలు మానుకుంటే మంచింది. ఏపీ సీఎం చంద్రబాబు ఏమైనా మాఫియా రాజ్యం నడుపుతున్నారా? ప్రజలకు ప్రశ్నించే అధికారం ఉండదా? పరిస్థితులు చూస్తుంటే ఏపీలో అసలు ప్రజాస్వామ్యం ఉందా‌ ? అన్న అనుమానాలు కలుగుతున్నాయి’ అని ఆయన పేర్కొన్నారు. (టీటీడీ చరిత్రలో చీకటి రోజు)

తిరుమల వెంకన్న ఆలయంలో జరుగుతున్న వ్యవహారాలపై ఆందోళన వ్యక్తం చేసినందుకు మొదట రమణ దీక్షితుల్ని ప్రధాన అర్చకుడిగా పదవి నుంచి తొలగించారని, ఇప్పుడు జైల్లో వేస్తామని భయపెట్టారని జీవీఎల్‌ విమర్శించారు. కాగా, రమణ దీక్షితులను జైల్లో వేయాలంటూ సోమిరెడ్డి చేసిన తీవ్ర వ్యాఖ్యలు విమర్శలకు దారితీశాయి. సోమిరెడ్డి వ్యాఖ్యలపై బ్రాహ్మణ సంఘాలతోపాటు పలు వర్గాల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తం కావడంతో చివరికి వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటూ క్షమాపణలు చెప్పారు. అయినప్పటికీ సోమిరెడ్డిపై గుంటూరు జిల్లా నగరంపాలెం పోలీస్‌ స్టేషన్‌లో బ్రాహ్మణ సేవా సమితి ఆదివారం ఫిర్యాదు చేసింది.

మరిన్ని వార్తలు