కాంగ్రెస్‌ మేనిఫెస్టో కమిటీకి వెల్లువలా వినతులు

27 Sep, 2018 02:37 IST|Sakshi

     6 గంటల పాటు అర్జీలు స్వీకరించిన కమిటీ

     జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలిస్తామన్న రాజనర్సింహా

సాక్షి, హైదరాబాద్‌: కాంగ్రెస్‌ మేనిఫెస్టో కమిటీకి వివిధ సంఘాలు, వర్గాల నుంచి వినతులు, అర్జీలు వెల్లువలా వస్తున్నాయి. తమకు సంబంధించిన అంశాలను మేనిఫెస్టోలో చేర్చి న్యాయం చేయాలని ఆయా సంఘాల నేతలు విన్నవిస్తున్నారు. బుధవారం మేనిఫెస్టో కమిటీ చైర్మన్‌ దామోదర రాజనర్సింహా, కన్వీనర్‌ మహేశ్‌కుమార్‌గౌడ్, సభ్యులు మల్‌రెడ్డి రంగారెడ్డి, సుధాకర్‌యాదవ్, ఇందిరా శోభన్‌లు గాంధీభవన్‌లో 6 గంటల పాటు వివిధ సంఘాల నేతల నుంచి వినతులు స్వీకరించారు. ఎంపీటీసీ అధికారాల్లో కోత, నిధుల కేటాయింపులో నిర్లక్ష్యంపై రాష్ట్ర ఎంపీటీసీల ఫోరం ప్రధాన కార్యదర్శి ఉమ్మన్నగారి మనోహర్‌రెడ్డి నేతృత్వంలో ఎంపీటీసీలు వినతిపత్రం అందజేశారు.

రెడ్డి ఐక్యవేదిక అధ్యక్షుడు సంతోష్‌రెడ్డి, నేతలు మాసాని శ్రీనివాస్‌రెడ్డి, భీంరెడ్డి నేతృత్వంలో రెడ్లకు కార్పొరేషన్‌ ఏర్పాటు చేయాలని, వారికి ప్రత్యేక గురుకులాలు ఏర్పాటు చేయాలని కోరారు. పదోన్నతుల్లో తీవ్ర అన్యాయం జరుగుతోందని, 30 ఏళ్లుగా సర్వీసు చేసి కానిస్టేబుళ్లుగానే రిటైర్‌ అవుతామని నేతలకు పోలీసు కానిస్టేబుళ్ల అసోసియేషన్‌ మొరపెట్టుకుంది. ఆటో డ్రైవర్స్, జర్నిలిస్టుల అసోసియేషన్లు, నిరుద్యోగ జేఏసీ, టీచర్స్‌ జేఏసీ, ఫార్మాసిస్ట్‌ ఉద్యోగులు కూడా వినతులు సమర్పించారు. 

టీఆర్‌ఎస్‌ మోసం చేసింది..
జర్నలిస్టులకు ఇళ్ల స్థలాల విషయంలో టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం మోసం చేసిందని రాజనర్సింహా అన్నా రు. వైఎస్‌ ప్రభుత్వ హయాంలో ఇచ్చిన మాట మేరకు జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు కేటాయించామని, తాము అధికారంలోకి రాగానే వెంటనే స్థలాలు కేటా యిస్తామన్నారు. ఇప్పటికే 16 వేల మంది అక్రెడిటెడ్‌ జర్నలిస్టులు, మరో లక్ష మంది అన్‌ అక్రెడిటెడ్‌ జర్నలిస్టుల సంక్షేమంపై అనేక వినతులు వచ్చాయన్నా రు. జర్నలిస్టుల సంక్షేమంపై మరోసారి పూర్తి స్థాయి లో చర్చించి మేనిఫెస్టోలో చేరుస్తామన్నారు. మెయిల్‌ ద్వారా వెయ్యికి పైగా అర్జీలు వచ్చాయని, టోల్‌ఫ్రీ నంబర్‌కు వందల సంఖ్యలో ఫోన్లు చేస్తున్నారని, వాటన్నింటినీ క్రోడీకరించి 2 వారాల్లో ప్రజా రంజక మేనిఫెస్టోను ప్రజల ముందుకు తీసుకొస్తామన్నారు. త్వరలో సింగరేణి కార్మికుల సమస్యలపై చర్చించేం దుకు జిల్లాలో పర్యటిస్తామని చెప్పారు.

మరిన్ని వార్తలు