కర్ణాటకలో హంగ్‌!

14 Apr, 2018 02:40 IST|Sakshi

అతిపెద్ద పార్టీగా కాంగ్రెస్‌

34–43 సీట్లతో కింగ్‌మేకర్‌గా మారనున్న జేడీఎస్‌

కాంగ్రెస్‌కు 90–101 సీట్లు, బీజేపీకి 78–86 స్థానాలు

బీజేపీకి పెరగనున్నఓట్ల శాతం

ఇండియాటుడే–కార్వీ సర్వేలో వెల్లడి

హోరాహోరీ ప్రచార హోరు కొనసాగుతున్న కర్ణాటకలో.. ఓటరు తుది తీర్పు ఎలా ఉండబోతోంది? ప్రభుత్వ వ్యతిరేకతను కాదని కాంగ్రెస్‌ మళ్లీ అధికార పీఠం అధిరోహిస్తుందా? లేక బీజేపీ చీఫ్‌ అమిత్‌ షా మంత్రాంగం ఫలించి దక్షిణ భారతావనిలోనూ బీజేపీ హవా ప్రారంభమవుతుందా? సీఎంగా సిద్దరామయ్య ఓకేనా? యడ్యూరప్పకు లభిస్తున్న మద్దతెంత?.. తదితర ప్రశ్నలకు ఇండియాటుడే–కార్వీ నిర్వహించిన ఒపీనియన్‌ పోల్‌లో  కొంతవరకు సమాధానాలు లభించాయి. రాష్ట్రంలో హంగ్‌ రాబోతోందని, కాంగ్రెస్‌(90–101 సీట్లలో గెలుపు) అతిపెద్ద పార్టీగా అవతరించబోతోందని, జేడీఎస్‌(34–43 సీట్లు) కింగ్‌ మేకర్‌ పాత్ర పోషించబోతోందని ఈ సర్వేలో వెల్లడైంది. అలాగే, బీజేపీ(78–86 సీట్లు)కి ఓట్ల శాతం పెరుగుతుంది కానీ, మెజారిటీకి మాత్రం దూరంగానే ఉంటుందని తేలింది. బీజేపీ సీఎం అభ్యర్థి యడ్యూరప్ప కన్నా సీఎంగా  సిద్దరామయ్యకే ఎక్కువ మద్దతు లభించడం విశేషం.   

బెంగళూరు: కన్నడనాట హంగ్‌ అసెంబ్లీ ఏర్పడే అవకాశం ఉందని ఇండియాటుడే–కార్వీ ఒపీనియన్‌ పోల్‌లో వెల్లడైంది. అధికార కాంగ్రెస్‌ పార్టీ అధికారాన్ని అందుకోకపోయినా అతిపెద్ద పార్టీగా అవతరిస్తుందని సర్వే తెలిపింది. 225 మంది ఎమ్మెల్యే (ఒక నామినేటెడ్‌ ఆంగ్లో సాక్సన్‌)లున్న కన్నడ అసెంబ్లీలో ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసేందుకు 113 సీట్లు కావాలి. అయితే కాంగ్రెస్‌ 90–101 స్థానాల్లో, బీజేపీ 78–96 చోట్ల గెలిచే అవకాశం ఉందని సర్వే పేర్కొంది. బీఎస్పీతో చేతులు కలిపిన జేడీ (ఎస్‌) 34–43 స్థానాల్లో గెలిచి ప్రభుత్వ ఏర్పాటులో కీలకం కానుందని సర్వేలో తేలింది. అటు సీఎంగా సిద్దరామయ్యకే 33 శాతం మంది ఓకే చెప్పగా.. యడ్యూరప్పకు 26 శాతం, కుమారస్వామికి 21 శాతం మంది మద్దతిచ్చారు.

తగ్గనున్న కాంగ్రెస్‌ సీట్లు
ఐదేళ్లుగా అధికారంలో ఉన్న సిద్దరామయ్య ప్రభుత్వంపై భారీగా వ్యతిరేకత లేకపోయినా అధికారానికి అవసరమైన సీట్లు రావని సర్వేలో తేలింది. ఉపాధి కల్పన, స్వచ్ఛమైన తాగునీరు సహా పలు అంశాలు కాంగ్రెస్‌కు ఇబ్బందికరంగా మారాయి. కాంగ్రెస్‌ కోల్పోనున్న సీట్లలో బీజేపీ పాగా వేయనుంది. అయితే కమలదళం కూడా సంపూర్ణంగా ప్రజల మద్దతు సంపాదించలేదని తేలింది. లింగాయత్‌ల మైనారిటీ హోదా రిజర్వేషన్ల అంశం బీజేపీకి భారీగా గండికొట్టనుందని తెలుస్తోంది.

ప్రస్తుతం అసెంబ్లీలో 40 సీట్లున్న జేడీఎస్‌ తన సీట్లను కాపాడుకోనుంది. కన్నడ ఎన్నికల్లో ఈసారి బీజేపీ ఓటు బ్యాంకు గత ఎన్నికల కన్నా గణనీయంగా పెరగనున్నట్లు ఇండియాటుడే–కార్వీ సర్వేలో వెల్లడయింది. అయితే ఈ పార్టీ ప్రభుత్వాన్ని మాత్రం ఏర్పాటుచేయలేదని సర్వే తెలిపింది. గత అసెంబ్లీ ఎన్నికల్లో 20 శాతం ఓట్లు సాధించిన బీజేపీ.. ఈసారి 35 శాతం ఓట్లను సాధించొచ్చని వెల్లడించింది. కాంగ్రెస్‌ గత ఎన్నికల్లో లాగే 37 శాతం ఓట్లను గెలుచుకోనుండగా.. జేడీఎస్‌–బీఎస్పీ కూటమి 19 శాతం ఓట్లను గెలవొచ్చని సర్వే పేర్కొంది.

ప్రజాభిప్రాయం కాంగ్రెస్‌+జేడీఎస్‌
ఈ నేపథ్యంలో ఒకవేళ హంగ్‌ ఏర్పడితే కాంగ్రెస్, బీజేపీల్లో ఎవరికి జేడీఎస్‌ మద్దతుండాలనే ప్రశ్నకు.. కాంగ్రెస్‌కే జేడీఎస్‌–బీఎస్పీ కూటమి మద్దతివ్వాలని సర్వేలో పాల్గొన్న వారిలో 39 శాతం మంది కన్నడిగులు అభిప్రాయపడ్డారు. కేవలం 29 శాతం మందే కుమారస్వామి బీజేపీతో వెళ్తే బాగుంటుందన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 224 నియోజకవర్గాల్లో 27,919 మందిని ఈ సర్వే బృందం ఇంటర్వ్యూ చేసింది.

మార్చి 17 నుంచి ఏప్రిల్‌ 5 వరకు జరిపిన ఈ సర్వేలో 62 శాతం సర్వే శాంపుల్స్‌ గ్రామీణ కర్ణాటకలో.. మిగిలింది పట్టణ ప్రాంతాల్లో తీసుకున్నారు. 45 శాతం మంది సిద్దరామయ్య నేతృత్వంలోని కాంగ్రెస్‌ ప్రభుత్వానికి రెండోసారి అవకాశం ఇవ్వాలని అభిప్రాయపడ్డారు. 65 శాతం ముస్లింలు, 44 శాతం హిందువులు ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. కులాల వారిగా చూస్తే.. 55 శాతం మంది కురుబ గౌడ(సిద్దరామయ్య సామాజిక వర్గం)లు, 53 శాతం మంది దళితులు, 37 శాతం మంది లింగాయత్‌లు, 36 శాతం మంది బ్రాహ్మణులు ఇదే అభిప్రాయాన్ని వెల్లడించారు.

ఎన్నికల్లో కీలకాంశాలు
కన్నడ ఎన్నికల్లో ఉపాధికల్పన ప్రధాన అజెండాగా మారింది. 56 శాతం మంది ఉద్యోగాల్లేకపోవటం.. చాలా తీవ్రమైన సమస్యగా పేర్కొన్నారు. ఐదేళ్లలో ఈ విషయంలో పరిస్థితి అధ్వాన్నంగా తయారైందని అభిప్రాయపడ్డారు. ధరల పెరుగుదల, అవినీతి, సరైన తాగునీరు అందుబాటులో లేకపోవటం మొదలైన అంశాలపైనా ప్రజల్లో ఆందోళన నెలకొంది. సిద్దరామయ్యపైనే మెజారిటీ కన్నడిగులు సానుకూలంగా ఉన్నారు. 38 శాతం మంది సిద్దరామయ్య పనితీరు బాగుంది, చాలా బాగుందని తెలపగా..31 శాతం మంది పర్వాలేదన్నారు. 29 శాతం మంది మాత్రమే అసంతృప్తి వ్యక్తం చేశారు.

భాష, జెండా, టిప్పు సుల్తాన్‌..
కర్ణాటకలో కొంతకాలంగా వివాదాస్పదమవుతున్న అంశాలపైనా రాష్ట్ర ప్రజలు స్పష్టంగానే ఉన్నారు. అన్ని పాఠశాలల్లో కన్నడ భాషను తప్పనిసరి చేయటాన్ని 73 శాతం మంది అంగీకరించారు. రాష్ట్రానికి ప్రత్యేక జెండా ఉండే అంశంలోనూ 59 శాతం మంది సిద్దరామయ్యకు మద్దతుగా నిలిచారు. కేవలం 29 శాతం మంది మాత్రమే ఈ నిర్ణయాన్ని వ్యతిరేకించారు. టిప్పు సుల్తాన్‌ జయంతిని అధికారికంగా నిర్వహించటంపై మాత్రం 33 శాతం మందే  సానుకూలంగా స్పందించగా.. 44 శాతం మంది వ్యతిరేకించారు. ముస్లింల్లోనూ 58 శాతం మంది మాత్రమే టిప్పు జయంతికి మద్దతు తెలిపారు. లింగాయత్‌లకు రిజర్వేషన్లపై మాత్రం ఆచితూచి స్పందించారు. 52 శాతం మంది ఈ ఎన్నికల్లో లింగాయత్‌ల అంశం కీలకం కానుందని అభిప్రాయపడ్డారు.

మరిన్ని వార్తలు