భారత నేతలతో నేపాల్‌కు ఆదాయం

15 Sep, 2018 18:37 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : నేపాల్‌ పర్యటనకు వెళ్లిన ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తిరుగు టపాలో ఆగస్టు 31వ తేదీన కఠ్మాండుకు సమీపంలోని పశుపతినాథ్‌ ఆలయాన్ని సందర్శించిన విషయం తెల్సిందే. ఆయన 2014లో ప్రధాన మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన నాటి నుంచి పశుపతినాథ్‌ ఆలయాన్ని ఆయన సందర్శించడం ఇది మూడవ సారి. కర్ణాటక రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌ రోజున కూడా ఆయన ఆ ఆలయాన్ని సందర్శించారు. హిందూ ఓటర్లను ఆకర్షించడం కోసమే ఆయన ఆ రోజు అక్కడికి వెళ్లారంటూ వార్తలు రావడమే కాకుండా కర్ణాటక కోస్తా ప్రాంతంలో బీజేపీకి ఎక్కువ సీట్లు రావడానికి ఆయన ఆలయ సందర్శన దోహదపడిందని పార్టీ వర్గాలే పేర్కొన్నాయి. 

ప్రధాని నరేంద్ర మోదీ ఆగస్టు 31వ తేదీన పశుపతినాథ్‌ ఆలయాన్ని సందర్శించుకున్న రోజునే కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ మానససరోవర యాత్రలో భాగంగా కఠ్మాండు చేరుకున్నారు. ఇలా పాలక, ప్రతిపక్ష నేతలు విదేశీ పర్యటనలో ఒకే నగరంలో ఉండడం చాలా అరుదు. ఆరోజున రాహుల్‌ గాంధీ కూడా పశుపతినాథ్‌ ఆలయాన్ని సందర్శించుకోవాల్సి ఉంది. అయితే రాహుల్‌ తన కార్యక్రమాన్ని రద్దు చేసుకొని నేరుగా టిబెట్‌లోని లాసా ప్రాంతానికి బయల్దేరి వెళ్లారు. అందుకు కారణాలు అధికారికంగా ఎవరూ వెల్లడించలేదుగానీ ప్రధాని మోదీ ఆలయానికి వస్తున్నారని తెలిసే రాహుల్‌ తన కార్యక్రమాన్ని రద్దు చేసుకున్నారని తెల్సింది. కర్ణాటక ఎన్నికల సందర్భంగా రాహుల్‌ గాంధీ హెలికాప్టర్‌ సాంకేతిక లోపానికి గురై కుదుపులకు గురవడం, అందులో నుంచి రాహుల్‌ గాంధీ క్షేమంగా బయట పడడం తెల్సిందే. అందుకు కృతజ్ఞతగా ఇప్పుడు ఆయన మానస సరోవరం యాత్రను చేపట్టారట. 

ప్రధాని నరేంద్ర మోదీ పశపతినాథ్‌ ఆలయ సందర్శనకు ముందు మాజీ భారత ప్రధాన మంత్రి హెచ్‌డీ దేవగౌడ తన కుటుంబం సమేతంగా పశపతినాథ్‌ ఆలయాన్ని సందర్శించుకున్నారు. భారత రాజకీయ నాయకులు ఓట్ల కోసం పశపతినాథ్‌ ఆలయాన్ని సందర్శిస్తుంటే ప్రచారం పెరిగి భారత్‌లోని హిందువులు కూడా ఆ ఆలయానికి క్యూ కడుతున్నారట. ఈ ఏడాది భారతీయ యాత్రికులు 20 శాతం పెరిగి తమ పర్యాటక రంగానికి ఆదాయం కూడా పెరిగిందని నేపాల్‌ టూరిజం బోర్డు అధిపతి దీపక్‌ రాజ్‌ జోషి తెలిపారు. మానససరోవర యాత్రకు బయల్దేరిన భారతీయుల్లో ఇప్పటికే ఆరువేల మంది యాత్రికులు నేపాల్‌గంజ్‌ మీదుగా వెళ్లారట. మానససరోవరానికి నేపాల్‌ ‘గేట్‌వే’లా పనిచేస్తున్న విషయం తెల్సిందే. ఆ యాత్రకు వెళ్లేందుకు నేపాల్‌ మీదుగా ఇదివరకు మూడు దారులు ఉండగా, 2015లో సంభవించిన పెను భూకంపం కారణంగా రెండు దారులు మూసుకుపోగా, ఇప్పుడు నేపాల్‌గంజ్‌–హుమ్లా మార్గమే మిగిలింది. 

నాడు సోనియాను అనుమతించలేదు...
1988లో అప్పటి భారత ప్రధాన మంత్రి రాజీవ్‌ గాంధీ సోనియా గాంధీతో కలసి నేపాల్‌ పర్యటనకు వెళ్లారు. అప్పుడు ఆ దంపతులు పశుపతినాథ్‌ ఆలయాన్ని సందర్శించాలనుకున్నారు. అయితే సోనియా గాంధీ క్రైస్తవ మతానికి చెందడం వల్ల అందుకు నేపాల్‌ ప్రభుత్వం అనుమతించలేదు. ఈ కారణంగా ఇరు దేశాల మధ్య చాలా కాలం వరకు దౌత్య సంబంధాలు నిలిచిపోయాయి. 

మరిన్ని వార్తలు