జయ ఇంటిపై మళ్లీ ఐటీ దాడులు

4 Jan, 2018 19:45 IST|Sakshi

జయ టీవీ కార్యాలయంలో కూడా

సాక్షి ప్రతినిధి, చెన్నై: అన్నాడీఎంకే అధినేత్రి, దివంగత ముఖ్యమంత్రి జయలలిత నివాసం పోయస్‌ గార్డెన్‌లో  మరోసారి ఐటీ దాడులు జరిగాయి. అలాగే జయ టీవీ కార్యాలయంలో సైతం ఐటీ అధికారులు గురువారం సోదాలు నిర్వహించారు. బోగస్‌ సంస్థలను స్థాపించి కోట్లాది రూపాయల పన్ను ఎగవేతకు పాల్పడ్డారనే ఆరోపణలపై జయ నెచ్చెలి శశికళ, ఆర్కేనగర్‌ ఎమ్మెల్యే టీటీవీ దినకరన్‌ కుటుంబీకులే లక్ష్యంగా ఐటీ దృష్టి సారించింది. శశికళ బంధుమిత్రుల ఇళ్లు, కార్యాలయాల్లో గత ఏడాది నవంబరు 10వ తేదీన 187 చోట్ల ఏకకాలంతో 1600 మంది అధికారులు దాడులు జరిపి ఐదురోజులపాటూ తనిఖీలు నిర్వహించిన విషయం తెలిసిందే.

ఈ సందర్భంగా రూ.1,480 కోట్ల పన్నుఎగవేతను గుర్తించారు. అంతేగాక లెక్కల్లో చూపని బంగారు, వజ్రాలు, కోట్లాది రూపాయల నగదును స్వాధీనం చేసుకున్నారు.  నవంబర్‌17వ తేదీన శశికళ బంధువుల ఇళ్లతోపాటూ జయలలిత వ్యక్తిగత కార్యదర్శి పూంగున్రన్‌ ఇంటిపైనా, అదే రోజు రాత్రి పోయస్‌గార్డెన్‌లోని జయ నివాసంలో మళ్లీ దాడులు జరిపారు. జయ నివాసంలోని రెండు గదులకు ఐటీ అధికారులు ఆరోజు సీలు వేశారు. ఇదిలా ఉండగా, గురువారం మధ్యాహ్నం 12.30 గంటల సమయంలో ఐదుగురు అధికారులు అకస్మాత్తుగా జయ నివాసంలోకి ప్రవేశించారు.

గతంలో సీలు వేసిన రెండు గదులను తెరిచి సోదాలు జరిపారు. అలాగే జయ నివాసం పక్కనే ఉన్న జయ టీవీ పాత కార్యాలయంలో తనిఖీలు నిర్వహించారు. కాగా, జయ నివాసాన్ని స్మారకమందిరంగా మార్చేందుకు ప్రభుత్వం 20 మందితో కూడిన బృందాన్ని నియమించింది. నాలుగు నెలల్లోగా మందిరం పనులు పూర్తి చేయాలని గడువు విధించింది.

మరిన్ని వార్తలు