నీయబ్బ.. ఎవరనుకున్నావ్‌ ..నీ అంతుచూస్తా

8 Mar, 2019 12:30 IST|Sakshi
అనంతయ్యను దూషిస్తున్న జేసీ పవన్‌

మాజీ సర్పంచ్‌పై జేసీ పవన్‌ దూషణల పర్వం

తిరగబడిన గ్రామస్తులు

అనంతపురం, గుంతకల్లు రూరల్‌: ‘నీయబ్బ .. ఎవరనుకున్నావు నన్ను.. నీఅంతు చూస్తా.. డబ్బు నాది, మినరల్‌ వాటర్‌ ప్లాంట్‌ నాది అడగడానికి నువ్వెవరూ’ అంటూ ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి తనయుడు జేసీ పవన్‌కుమార్‌రెడ్డి మాజీ సర్పంచ్‌పై దూషణలకు దిగాడు. వివరాల్లోకి వెళితే.. గుంతకల్లు మండలంలో నీటి ఎద్దడి ఎక్కువగా ఉన్న గ్రామాల్లో దంచెర్ల ఒకటి. ఒక్కగానొక్క బోరులో వచ్చే అరకొర నీటితోనే గ్రామస్తులు తమ అవసరాలను తీర్చుకునేవారు. ఈక్రమంలో గత ప్రభుత్వ హయాంలో మినరల్‌ వాటర్‌ ప్లాంట్‌ ఏర్పాటు కోసం గది నిర్మించారు.

గ్రామానికి నీటిని సరఫరా చేసే బోరులో అంతంత మాత్రంగా నీరు ఉండటం, అదే బోరు నుంచి శుద్ధజల ప్లాంట్‌కు నీటిని సరఫరా చేస్తే బోరు అడుగంటిపోయి గ్రామంలో తీవ్రమైన నీటి సమస్య ఏర్పడుతుందనే ఉద్దేంతో గ్రామస్తులందరూ కలిసి మినరల్‌ వాటర్‌ ప్లాంట్‌ కోసం ప్రత్యేకంగా ఒక బోరును వేయాలని కోరారు. అందుకు అనుగుణంగా పైప్‌లైన్‌ ఏర్పాటు కూడా చేపట్టాల్సి రావడం అదే సమయంలో ఎన్నికలు కూడా దగ్గర పడటంతో మినరల్‌ వాటర్‌ ప్లాంట్‌ ఏర్పాటు పనులు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. 2014లో టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి గ్రామస్తులు వాటర్‌ ప్లాంట్‌ ఏర్పాటుపై అడుగుతూనే వస్తున్నారు. అడిగిన ప్రతిసారీ అదిగో ఇదిగో అంటూ నాయకులు కాలం గడిపారు. 

బోరు, పైప్‌లైన్‌ లేకుండా  ప్లాంట్‌ ప్రారంభం
రెండు నెలల క్రితం గ్రామంలో పర్యటించిన జేసీ పవన్‌కు గ్రామస్తులు వాటర్‌ప్లాంట్‌ సమస్యను వివరించారు. ఎన్నికలలోపే  ప్లాంట్‌ ఏర్పాటుచేస్తానని హామీ ఇవ్వడంతో గ్రామస్తులందరూ సంతోషం వ్యక్తం చేశారు. ఆ తర్వాత పట్టించుకోలేదు. అయితే బోరు, పైప్‌లైన్‌ ఏర్పాటుచేయకుండా రెండు రోజుల క్రితం మిషనరీ బిగించి ప్లాంట్‌ను సిద్ధం చేశారు. ఈమేరకు గురువారం జేసీ పవన్‌రెడ్డి ప్లాంట్‌ను ప్రారంభించేందుకు వచ్చారు. ఈసందర్భంగా గ్రామ మాజీ సర్పంచ్‌ అనంతయ్య గ్రామస్తులతో కలిసి కొత్తబోరు, పైప్‌లైన్‌ వేయాలని డిమాండ్‌ చేశారు. తీవ్ర ఆగ్రహానికి గురైన పవన్‌ మాజీ సర్పంచ్‌ అన్న గౌరవం లేకుండా దూషణలకు దిగాడు. మాజీ సర్పంచ్‌ అనంతయ్య మర్యాదగా మాట్లాడాలని చెప్పినప్పటికీ జేసీ పవన్‌ తగ్గకపోవడంతో గ్రామస్తులందరూ అనంతయ్యకు మద్దతు పలికారు. గ్రామంలో మినరల్‌ వాటర్‌ ప్లాంటే అవసరం లేదని, వెంటనే అక్కడి నుంచి వెళ్లిపోవాలని మూకుమ్మడిగా తిరగబడ్డారు. దీంతో జేసీ పవన్‌ అక్కడి నుంచి తిరుగుముఖం పట్టాడు.

పైప్‌లైన్‌ వేయాలని అడిగితే  ఇష్టానుసారంగా మాట్లాడాడు..
వాటర్‌ప్లాంట్‌ను ప్రారంభిస్తామంటే గ్రామంలోని ప్రజలందరూ స్వాగతించాం. కానీ ప్లాంట్‌ కోసం ప్రత్యేకంగా బోరు వేస్తే తప్ప ఫలితం ఉండదని లేకపోతే గ్రామంలో తీవ్రమైన నీటి సమస్య ఏర్పడుతుందని చెప్పాం. అందుకు సరే అన్నారు. ఎన్నికల కోడ్‌ రాబోతున్న తరుణంలో కేవలం రెండు రోజుల వ్యవధిలోనే వాటర్‌ప్లాంట్‌ హడావుడిగా సిద్ధం చేసి ప్రస్తుతం అంతంత మాత్రంగా నీరు ఉన్న అదే బోరునుంచి ప్లాంట్‌కు నీటి సరఫరా అందించారు. అయినప్పటికీ మేము ఏమీ అనలేదు. కనీసం ప్రారంభోత్సవం అయిన వెంటనే బోరు, పైప్‌లైన్‌ ఏర్పాటు చేయాలని అడిగినందుకు   దుర్భాషలాడాడు.
– అనంతయ్య, వైఎస్సార్‌సీపీసీనీయర్‌ నాయకుడు,దంచెర్ల మాజీ సర్పంచ్‌ 

మరిన్ని వార్తలు